పేదల తరఫున రాజీలేని పోరాటం
రొద్దం: ‘‘ప్రతి పేదవాడి మోములో చిరునవ్వు చూడాలన్నదే వైఎస్సార్ సీపీ అజెండా. ఇందుకోసం ఎంతదాకై నా వెళ్తాం. పేదలకు అన్యాయం చేయాలనుకునే వారు ఎవరైనా ఎదిరిస్తాం. పేదల తరఫున రాజీలేని పోరాటం చేస్తాం’’ అని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు, మాజీ మంత్రి ఉషశ్రీచరణ్ అన్నారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలలను కూటమి ప్రభుత్వం పీపీపీ పద్ధతిలో ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడాన్ని నిరసిస్తూ వైఎస్సార్ సీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ శనివారం మండల పరిధిలోని చిన్నమంతూరు, చెరుకూరు, పెద్దమంతూరు గ్రామ పంచాయతీల్లో జరిగింది. ఈ సందర్భంగా ఉషశ్రీచరణ్ ఇంటింటికీ వెళ్లి మెడికల్ కళాశాలలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడం వల్ల పేదలకు జరిగే నష్టాన్ని వివరించారు. ప్రజల కోసం వైఎస్సార్ సీపీ చేపట్టిన పోరాటానికి మద్దతుగా సంతకాలు సేకరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ... పేదలకు విద్య, వైద్యం దూరం చేయాలని కూటమి కుట్ర చేస్తోందని, దీన్ని ఎంతమాత్రమూ సహించబోమన్నారు. పేదలకు మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పించడంతో పాటు, పేద కుటుంబాల్లోని విద్యార్థుల డాక్టర్ కల నెరవేర్చేందుకు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తన హయాంలో రాష్ట్రంలో 17 మెడికల్ కళాశాలలకు శ్రీకారం చుట్టారన్నారు. అందులో ఐదు పూర్తి కాగా, మిగతావి వివిధ దశల్లో ఉన్నాయన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే చంద్రబాబు నిర్మాణంలో ఉన్న కళాశాలలను పీపీపీ పద్ధతిలో తన అనుచరులకు కట్టబెట్టేందుకు సిద్ధమయ్యారన్నారు. ఈ క్రమంలోనే ఇక పెనుకొండలోని మెడికల్ కళాశాలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించేందుకు ప్రభుత్వం సిద్ధమైనా మంత్రి సవిత కనీసం స్పందించడం లేదన్నారు. ఆమెకు మంత్రి పదవిపై ఉన్న ప్రేమ...ప్రజలపై లేదన్నారు. చంద్రబాబు తన నిర్ణయాన్ని మార్చుకునేంత వరకూ వైఎస్సార్ సీపీ పోరాటం చేస్తుందన్నారు.
యువత వలస బాట..
కూటమి ప్రభుత్వం కొలువుదీరాక గ్రామాల్లో ఉపాధి కరువై యువత కర్ణాటకకు వలస వెళ్తున్నారని మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం చెరుకూరులో జరిగిన కోటిసంతకాల సేకరణలో ఉషశ్రీచరణ్ కలిసి ఆయన పాల్గొన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ తిమ్మయ్య, సర్పంచులు అశ్వర్థమ్మ, సుభాషిణి, రామచంద్రారెడ్డి, పార్టీ మండల కన్వీనర్ బి.తిమ్మయ్య, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు మూలింటి రమణ, నాయకులు ఎన్. నారాయణరెడ్డి, సి.నారాయణరెడ్డి, లక్ష్మీనారాయణరెడ్డి, చిన్నమంతూరు పంచాయతీ కన్వీనర్ సూరి పాల్గొన్నారు.
మెడికల్ కళాశాలల
ప్రైవేటీకరణ దుర్మార్గం
చంద్రబాబు తన నిర్ణయాన్ని
మార్చుకోవాలి
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు
ఉషశ్రీచరణ్
ఉపాధి లేక యువత వలస వెళ్తున్నారని తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ఆవేదన


