నిరాశ పర్చిన చంద్రబాబు పర్యటన
తలుపుల: ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనపై జిల్లా వాసులు పెట్టుకున్న ఆశలు అడియాసలే అయ్యాయి. కనీసం తలుపుల మండలానికైనా మేలు జరిగేలా వరాలు ప్రకటిస్తారని భావించారు. కానీ ప్రజాధనం రూ.కోటి ఖర్చు చేసి హెలీకాప్టర్‌లో వచ్చిన సీఎం...తన గొప్పల డప్పు కొట్టుకుని వెళ్లిపోయారు. కనీసం హామీలు కూడా ఇవ్వకపోవడంతో జనం పెదవి విరిచారు.
ఒక్క హామీ లేదు..
శనివారం తలుపుల మండలం పెద్దన్నవారిపల్లిలో పర్యటించిన చంద్రబాబు..ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేశారు. అనంతరం ప్రజా వేదిక సభలో మాట్లాడారు. కానీ మండల వాసులకు ఒక్కటంటే ఒక్క హామీ ఇవ్వలేకపోయారు. పైగా వైఎస్ జగన్ హయాంలో జరిగిన అభివృద్ధిని తన ఖాతాలో వేసుకునేందుకు పడరానిపాట్లు పడ్డారు. హంద్రీ–నీవా 14వ ప్యాకేజీ టన్నెల్ పనులను చేయలేమని అప్పట్లో చంద్రబాబు చేతులెత్తేయగా.. వైఎస్ జగన్ ఆ పనులు పూర్తి చేశారు. కానీ చంద్రబాబు తానే హంద్రీనీవా కాలువ పనులు పూర్తి చేసి నీళ్లు వదిలినట్లు చెప్పడంపై జనం పెదవి విరిచారు.
భంగపడ్డ స్థానిక నేతలు..
అధినేతతో వరాల జల్లు కురిపిస్తామని చెప్పిన స్థానిక టీడీపీ నేతలు కూడా భంగపడ్డారు. మండలానికి డిగ్రీ కళాశాల, సీహెచ్‌సీ మంజూరు..హంద్రీనీవా నీటితో చెరువులు నింపేందుకు అవసరమైన అనుమతులు... తదితర వాటిపై మండల వాసులు ఎన్నో ఆశలు పెట్టుకోగా... సీఎం వాటిని కనీసం ప్రస్తావించలేదు. దీంతో టీడీపీ పార్టీ శ్రేణులు సైతం నిరాశ చెందారు.
జిల్లా అభివృద్ధికి దక్కని హామీ
గొప్పల డప్పుతో సభ ముగించిన సీఎం
పెదవి విరిచిన జిల్లా జనం


