
నాణ్యత తుంగపాలు
హెచ్చెల్సీ ఆధునికీకరణ పనులు ఇష్టారాజ్యంగా కొనసాగుతున్నాయి. కాంట్రాక్టర్ల స్వార్థం... అధికారుల కమీషన్ల కక్కుర్తి కారణంగా ఇప్పటి వరకు పనులు పూర్తి నాసిరకంగా జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. రెండ్రోజుల్లోనే పనులు ముగించేస్తే ఆ తర్వాత నీళ్లొచ్చేస్తాయని, ఇక నాణ్యత గురించి అడిగేదెవరనే ధీమా కాంట్రాక్టర్లు, అధికారుల్లో వ్యక్తమవుతోంది.
● హెచ్చెల్సీ ఆధునికీకరణ పనుల్లో ఇష్టారాజ్యం
● అధికారుల పర్యవేక్షణ లోపం.. కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం
● ఇంకా కొనసాగుతున్న బ్రిడ్జిల నిర్మాణ పనులు
బొమ్మనహాళ్/కణేకల్లు: జిల్లాకు వరప్రదాయినిగా ఉన్న హెచ్చెల్సీపై ఇటు రైతులు.. అటు ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. సాగునీటితోపాటు జిల్లా ప్రజల దాహార్తిని ఈ ప్రాజెక్ట్ తీర్చుతోంది. అయితే రూ.35.06 కోట్లతో చేపట్టిన ఆధునికీకరణ పనులు నాసిరకంగా సాగుతుండడంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. అధికారులు ఈ ఏడాది మార్చి నెలలో టెండర్లు నిర్వహించారు. అగ్రిమెంట్ల ప్రక్రియ ముగిసిన వెంటనే పనులు ప్రారంభించి ఉంటే ఈ పాటికి వందశాతం పనులు పూర్తయ్యేవి. అయితే ఇందుకు విరుద్ధమైన పరిస్థితులు చోటు చేసుకున్నాయి. పనులు ప్రారంభించే విషయంలో కాంట్రాక్టర్లు అనవసరంగా కాలయాపన చేశారు. చేపట్టిన పనులు కూడా నత్తనడకన కొనసాగిస్తూ వచ్చారు. కనీసం చేసిన పనులైనా నాణ్యతతో ఉన్నాయంటే అది కూడా లేదు. హెచ్చెల్సీ లైనింగ్, యూటీ, కాలువలో కాంక్రీట్ బెడ్డింగ్ పనులు నాసికరంగా జరిగాయి.
48 గంటల్లోనే బయట పడిన
పనుల్లో డొల్లతనం
హెచ్చెల్సీ లైనింగ్ పనులు పూర్తి నాసిరకంగా జరిగాయి. మైలాపురం, నాగలాపురం, యర్రగుంట యూటీ వద్ద చేపట్టిన లైనింగ్ పనుల్లో నాణ్యత డొల్లతనం కేవలం 48 గంటల్లోనే బయట పడింది. పూర్తయిన పనుల్లో ఇసుక, కంకర తేలి అధికారుల పర్యవేక్షణ లోపాన్ని ఎత్తి చూపుతున్నాయి. పనుల్లో ఎటు చూసినా హెచ్చుతగ్గులు... ఇసుక ప్యాచ్‌లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మైలాపురం వద్ద గతంలో కాలువకు గండి పడిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఆ ప్రాంతంలో పూర్తయిన పనుల్లో నాణ్యత లోపం స్పష్టంగా అవగతమవుతోంది. నిబంధనల ప్రకారం ఎర్రమట్టితో కాలువ గట్టును పూడ్చి బాగా గట్టు పటిష్టపడేలా రోలింగ్ చేయాల్సి ఉంది. అయితే ఇందుకు విరుద్ధంగా కట్టకు సమాంతరంగా ఎర్రమట్టి పోసి వదిలేశారు. కాలువ గట్టు బలోపేతానికి నాణ్యమైన ఎర్రమట్టిని వాడాల్సి ఉండగా, లూజ్ సాయిల్ వేసి వాడి పడేసిన పాత రాళ్లను పరిచి పనులు ముగించేశారు. నాణ్యత లేని కారణంగా భవిష్యత్తులో పగుళ్లు ఏర్పడే ప్రమాదముందని రైతులు పేర్కొంటున్నారు. లైనింగ్‌కు ఉపయోగించే సిమెంట్ కాంక్రీట్ మిశ్రమంలో ఇసుక, కంకర ఎక్కువ వాడి సిమెంట్ తక్కువ వేశారని అంటున్నారు.
కనిపించని అధికారులు
హెచ్చెల్సీ ఆధునికీకరణ పనులను దగ్గరుండి పర్యవేక్షించాల్సిన ఇంజినీర్లు పనుల వద్ద కన్పించకుండాపోయారు. హెచ్చెల్సీ ఎస్‌ఈ, ఈఈలు విధిగా పనులు జరిగేచోట ఏఈఈలను నియమించినా వారు మాత్రం ఉండకుండా పోవడం గమనార్హం. ముఖ్యమైన పనులుంటే ఫోన్‌లోనే ఆదేశాలిచ్చి పనులు సాగేలా చేశారన్న ఆరోపణలున్నాయి. దీంతో ఆధునికీరణ పనుల్లో కాంట్రాక్టర్లు ఆడిందే ఆట... పాడిందే పాటగా సాగింది.
నీళ్లొస్తున్నా... కొనసాగుతున్న పనులు
హెచ్చెల్సీకి శుక్రవారం ఉదయం ఆంధ్రా సరిహద్దున 105 కిలోమీటర్ వద్ద నీటిని విడుదల చేశారు. ఓ వైపు కాలువలో నీరు ప్రవహిస్తుండగా మరోవైపు పనుల్లో కాంట్రాక్టర్ల హడావుడి కన్పించింది. లైనింగ్, కాలువగట్ల పటిష్టత పనులు చేస్తూనే ఉన్నారు. ఉద్దేహళ్–మళ్లికేతి బ్రిడ్జి, నాగలాపురం బ్రిడ్జి పనులు పూర్తి కాలేదు. దీంతో నీటి ప్రవాహానికి ఆటంకం కలగకుండా ఓ వైపు వదిలి, మరో వైపు బ్రిడ్జి పనులు చేస్తున్నారు. ఈ పనులు పూర్తయ్యేందుకు వారం రోజులు సమయం పట్టే అవకాశం ఉందని అంటున్నారు.
ప్రారంభం కాని కణేకల్లు చెరువు
అవుట్‌ఫాల్ రెగ్యులేటర్
కణేకల్లు చెరువు అవుట్‌ఫాల్ రెగ్యులేటర్ పనులు ఎక్కడి వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. ప్రస్తుతం హెచ్చెల్సీకి నీరు రావడంతో ఈ పనులు చేయలేని పరిస్థితి నెలకొంది. హెచ్చెల్సీకి నీటి సరఫరా బంద్ అయిన తర్వాత అంటే వచ్చే ఏడాది ఫిబ్రవరిలో పనులు ప్రారంభించాలని అధికారులు నిర్ణయించినట్లు సమాచారం.

నాణ్యత తుంగపాలు