
లోపాలను సరిదిద్దుకోండి : డీఎంహెచ్‌ఓ
పుట్టపర్తి అర్బన్: లోపాలను సరిదిద్దుకొని జిల్లాలో మాతాశిశు మరణాలను పూర్తిగా అరికట్టేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఫైరోజాబేగం ఆదేశించారు. జూన్ నెలలో జిల్లాలో చోటు చేసుకున్న మాతాశిశు మరణాలపై సంబంధిత వైద్యాధికారులతో శుక్రవారం తన కార్యాలయంలో ఆమె సమీక్షించారు. సోమందేపల్లి, పుట్టపర్తి, బోయపేట, కొక్కంటి, ఎనుములపల్లి, పెనుకొండలో ఒక్కొక్కటి చొప్పున, రామగిరిలో రెండేసి శిశు మరణాలు సంభవించాయని గుర్తు చేశారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన వైద్య సేవలను చేరువ చేశామని, అయినా మరణాలు సంభవించడం వెనుక ఉన్న లోపాలను గుర్తించాలని సూచించారు. ప్రతి పీహెచ్‌సీలోనూ ప్రతి నెలా గర్భిణులను సమావేశ పరిచి ఆరోగ్య సూత్రాలు తెలియజేయాలన్నారు. ప్రతి కాన్పునూ స్వయంగా పర్యవేక్షించాలన్నారు. కార్యక్రమంలో డీసీహెచ్‌ఎస్ డాక్టర్ మధుసూదన్, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ మంజువాణి, గైనకాలజిస్ట్ డాక్టర్ ప్రత్యూష, పీడీయాట్రిషియన్ డాక్టర్ శ్రీనునాయక్, డీపీహెచ్‌ఎన్‌ఓ వీరమ్మ, పీహెచ్‌సీ వైద్యాధికారులు, ఆరోగ్య, అంగన్‌వాడీ, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.
జీతాల మంజూరులో జాప్యం తగదు : ఎస్టీయూ
గాండ్లపెంట: బదిలీలు, పదోన్నతుల్లో భాగంగా కొత్తగా మంజూరైన పోస్టుల్లో చేరిన ఉపాధ్యాయుల జీతాల మంజూరులో జాప్యం చేయరాదని ప్రభుత్వానికి ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు హరిప్రసాదరెడ్డి సూచించారు. ఎస్టీయూ సభ్యత్వ నమోదులో భాగంగా ఎన్‌పీ కుంట మండల కేంద్రంలోని పాఠశాల వద్ద ఆయన శుక్రవారం మాట్లాడారు. పునర్వవస్థీకరణలో భాగంగా ప్రభుత్వం ఆదర్శ పాఠశాలలను, ప్రాథమికోన్నత పాఠశాలలను ఉన్నత పాఠశాలలుగా ఉన్నతీకరణ చేసి మోడల్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులను, అదనపు ఉపాధ్యాయులను గ్రేడ్–2 హెచ్‌ఎంలుగా నియమించడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. అయితే ఆయా స్దానాలలో కేటాయించిన ఉపాధ్యాయులకు జూన్ నెల వేతనాలు ఇప్పటి వరకూ మంజూరు చేయకపోవడం అన్యాయమన్నారు. సాంకేతిక లోపాలను సరిచేసి జూన్, జూలై నెలల వేతనాలు తక్షణమే మంజూరయ్యేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ వర్తింప చేయాలని, పాఠశాల స్దాయిలో బోధనేతర పనులను రద్దు చేయాలని, పెండింగ్ డీఏ, 30 శాతం మద్యంతర భృతిని తక్షణమే ప్రకటించాలని డిమాండు చేశారు. కార్యక్రమంలో ఎస్టీయూ జిల్లా కౌన్సిలర్ వెంకటేశ్వర్లు, మండల అధ్యక్షుడు రామాంజనేయులు, తిరుమల ప్రసాద్, రమేష్, హెచ్‌ఎం శాంతమ్మ, గంగయ్య, రాజశేఖర్, సాంబశివారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ప్రీ పీహెచ్‌డీ పరీక్ష షెడ్యూల్ మార్పు
అనంతపురం: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం పరిధిలో ప్రీ పీహెచ్‌డీ పరీక్ష షెడ్యూల్‌ను మార్పు చేశారు. ఈ మేరకు వర్సిటీ డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యుయేషన్స్ ప్రొఫెసర్ జి. వెంకటరమణ శుక్రవారం వెల్లడించారు. ఈ నెల 22, 23, 24 తేదీల్లో నిర్వహించాల్సిన ప్రీ పీహెచ్‌డీ పరీక్షలు ఆగస్టు 5, 6, 7వ తేదీల్లో నిర్వహించనున్నారు. ఏపీపీఎస్సీ డిగ్రీ లెక్చరర్ల రాత పరీక్ష నేపథ్యంలో ఈ మార్పు చేశారు. ఆగస్టు 5వ తేదీ రీసెర్చ్ మెథడాలజీ (పేపర్–1), 6న అడ్వాన్సెడ్ సబ్జెక్టు పేపర్/రీసెంట్ అడ్వాన్సెస్ ఇన్ ద సబ్జెక్టు(పేపర్–2), 7న పేపర్ ఆన్ రీసెర్చ్ ఏరియా (పేపర్–3) పరీక్షలు జరుగుతాయి. ప్రతి పరీక్ష ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించనున్నారు.