
బెదిరింపులకు పాల్పడడం హేయం
తలుపుల: అనంతపురం జిల్లా పంచాయతీ అధికారి నాగరాజునాయుడుని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకరరెడ్డి పరుష పదజాలంతో దూషిస్తూ బెదిరింపులకు పాల్పడడం హేయమని పంచాయతీ కార్యదర్శులు ఖండించారు. జేసీ ప్రభాకరరెడ్డి వైఖరిని తప్పు పడుతూ శుక్రవారం తలుపుల ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. నిబద్ధతతో పనిచేసే జిల్లా స్థాయి అధికారిపైనే ఇంతటి దౌర్జన్యం చేస్తున్న జేసీ ప్రభాకరరెడ్డి ఇక తన పరిధిలోని మండల, గ్రామస్థాయి అధికారులను ఎంతటి భయభ్రాంతులకు గురి చేస్తుంటారో ఊహించలేమన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జేసీ ప్రభాకరరెడ్డిపై చట్టపరమైన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వివిధ గ్రామాల కార్యదర్శులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
హోంగార్డు కుటుంబాలకు చేయూత
అనంతపురం: ఉమ్మడి అనంతపురం జిల్లాలో గత నెలలో వేర్వేరు కారణాలతో మృతి చెందిన ముగ్గురు హోంగార్డులకు సంబంధించి వారి కుటుంబాలకు ఎస్పీ పి.జగదీష్ శుక్రవారం ఆర్థిక చేయూతనందించారు. శ్రీసత్యసాయి జిల్లాకు చెందిన హోంగార్డు బి.తిరుపాల్‌నాయక్ కుటుంబానికి జిల్లా హోంగార్డుల ఒక్క రోజు వేతనాన్ని విరాళంగా ఇచ్చారు. ఈ మొత్తం రూ.4,33,200తో పాటు ఫ్లాగ్ ఫండ్ కింద రూ.10 వేలు, అనంతపురం జిల్లాలో పని చేస్తూ మరణించిన లక్ష్మీరెడ్డి కుటుంబానికి ఫ్లాగ్ ఫండ్ కింద రూ.10 వేలు, శ్రీసత్యసాయి జిల్లా హోంగార్డుగా పనిచేస్తూ చనిపోయిన నరసింహులు కుటుంబానికి ఫ్లాగ్ ఫండ్ కింద రూ.10 వేలు ఆర్థిక సాయాన్ని చెక్కుల రూపంలో అందజేశారు. జిల్లా పోలీసు కార్యాలయంలోని ఎస్పీ చాంబర్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ నీలకంఠేశ్వరరెడ్డి, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్లు పవన్‌కుమార్, రాముడు, ఆర్‌ఎస్‌ఐ జాఫర్, తదితరులు పాల్గొన్నారు.
వ్యక్తి ఆత్మహత్య
రాప్తాడు రూరల్: జీవితంపై విరక్తితో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు.. అనంతపురం రూరల్ మండలం రాచానపల్లికి చెందిన రామప్ప (47), రామాంజనమ్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ప్రైవేట్ వాహన డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్న రామప్ప కొంత కాలం క్రితం సెల్యులైటిస్ వ్యాధి బారిన పడ్డాడు. ఎడమకాలు మోకాలి నుంచి కింద పాదం వరకూ బాగా దెబ్బతినింది. చాలాచోట్ల చూపించినా నయం కాకపోవడంతో జీవితంపై విరక్తి చెందిన ఆయన శుక్రవారం తెల్లవారుజామున ఇంట్లోనే ఫినాయిల్ తాగాడు. అపస్మారక స్థితిలో చేరుకున్న రామప్పను గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే సర్వజనాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. భార్య ఫిర్యాదు మేరకు అనంతపురం రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.

బెదిరింపులకు పాల్పడడం హేయం