టిప్పర్‌ ఢీకొని బీటెక్‌ విద్యార్థి మృతి | Sakshi
Sakshi News home page

టిప్పర్‌ ఢీకొని బీటెక్‌ విద్యార్థి మృతి

Published Mon, May 20 2024 8:10 AM

టిప్పర్‌ ఢీకొని బీటెక్‌ విద్యార్థి మృతి

బత్తలపల్లి: స్థానిక జాతీయ రహదారిపై టిప్పర్‌ ఢీకొన్న ఘటనలో ద్విచక్ర వాహనంపై వెళుతున్న ఓ యువకుడు మృతి చెందాడు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన మేరకు... చెన్నేకొత్తపల్లి మండలం ప్యాదిండికి చెందిన జంగాలపల్లి హనుమంతరెడ్డి కుమారుడు అశోక్‌రెడ్డి(22), బత్తలపల్లి మండలం అప్పరాచెరువు గ్రామానికి చెందిన బ్యాళ్ల వెంకటశివయ్య కుమారుడు విష్ణువర్ధన్‌బాబు చైన్నెలోని ఓ పైవేట్‌ కళాశాలలో వరుసగా ఒకరు ఫైనల్‌ ఇయర్‌, మరొకరు థర్డ్‌ ఇయర్‌ చదువుతున్నారు. ఒకే ప్రాంతానికి చెందిన వారు కావడంతో స్నేహితులయ్యారు.

 ఈ క్రమంలోనే వేసవి సెలవులు రావడంతో ద్విచక్ర వాహనంపై తిరుగు ప్రయాణమైన వీరు ఆదివారం ముదిగుబ్బ మండలం రాళ్ల అనంతపురంలోని అశోక్‌రెడ్డి అక్క ఇంటికి చేరుకున్నారు. మధ్యాహ్నం భోజనం ముగించుకుని స్వగ్రామానికి బయలుదేరారు. నల్లబోయనపల్లి వద్దకు చేరుకోగానే గ్రామ సర్వీసు రోడ్డుపై నుంచి వచ్చిన ఐచర్‌ వాహనాన్ని తప్పించే క్రమంలో రోడ్డు మధ్యలోకి చేరుకున్నారు. 

అదే సమయంలో అనంతపురం నుంచి ఉప్పలపాడు ఇసుక రీచ్‌కు వెళుతున్న టిప్పర్‌ ఢీకొంది. ప్రమాదంలో అశోక్‌రెడ్డి తలకు తీవ్రగాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన విష్ణువర్దన్‌బాబును స్థానికులు వెంటనే 108 అంబులెన్స్‌ ద్వారా ఆర్డీటీ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న రాళ్లఅనంతపురంలోని సోదరి అక్కడకు చేరుకుని తమ్ముడి మృతదేహం పడి బోరున విలపించింది. ఎస్‌ఐ శ్రీనివాసులు, ఏఎస్‌ఐ సోమశేఖర్‌మూర్తి అక్కడకు చేరుకుని పరిశీలించి, కేసు నమోదు చేశారు.

Advertisement
 
Advertisement
 
Advertisement