కోడ్‌ ఉంది... తస్మాత్‌ జాగ్రత్త | Sakshi
Sakshi News home page

కోడ్‌ ఉంది... తస్మాత్‌ జాగ్రత్త

Published Fri, Apr 12 2024 12:20 AM

- - Sakshi

● హిందూపురం నియోజకవర్గం చిలమత్తూరు మండలం వడ్డిపల్లి ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న రంగారెడ్డి ఇటీవల టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. దీనిని కలెక్టర్‌ అరుణ్‌బాబు తీవ్రంగా పరిగణిస్తూ ఆదేశాలు జారీ చేయడంతో రంగారెడ్డిని డీఈఓ మీనాక్షి సస్పెండ్‌ చేశారు.

● పెనుకొండ ఆర్టీసీ డిపోలో ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌గా–2గా పనిచేస్తున్న రామాంజినేయులు తన విధులకు హాజరు కాకుండా అనంతపురంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి దగ్గుబాటి వెంకటప్రసాద్‌ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ వచ్చారు. ఈ విషయాన్ని పసిగట్టిన అధికారులు వెంటనే చర్యలు తీసుకున్నారు. ఆయనను సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

హిందూపురం టౌన్‌: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో ఎన్నికల నియామావళి (ఎన్నికల కోడ్‌)ని అధికార యంత్రాంగం పక్కాగా అమలు చేస్తోంది. దీంతో ప్రభుత్వ ఉద్యోగులు మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సి వస్తోంది. ఏ మాత్రం పొరపాట్లకు తావిచ్చినా భారీ మూల్యం చెల్లించుకోక తప్పడం లేదు. పోటీలో ఉన్న అభ్యర్థులను కలవడం, వారు ఏర్పాటు చేసిన విందులకు హాజరవ్వడం వంటిని కోడ్‌ ఉల్లంఘన కిందకు తీసుకుంటున్నారు. వీటిపై ఎన్నికల కమిషన్‌ చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఇటీవల ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పలువురు ఉద్యోగులు, ఉపాధ్యాయులు సస్పెన్షన్‌కు గురయ్యారు.

నేరుగా ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదులు..

ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు ప్రజలను కలుస్తూ ప్రచారం చేయడంతో పాటు ఓటర్లకు దగ్గరయ్యేందుకు సమావేశాలు, విందులు ఏర్పాటు చేస్తున్నారు. గతంలో ఇలాంటి విందులకు ఉద్యోగులు వెళ్లినా బయటకు తెలిసేది కాదు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిన ప్రస్తుత రోజుల్లో ప్రత్యర్థి శిబిరంలో ఏం జరుగుతుందో రాజకీయ నాయకులు సామాజిక మాధ్యామాల ద్వారా ఎప్పుటికప్పుడు పసిగడుతున్నారు. ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు. అందరి చేతుల్లో స్మార్ట్‌ఫోన్లు ఉండడంతో ఎవరో ఒకరు ఫొటో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తుండడంతో వాటిని ప్రత్యర్థులు పరిశీలించి ఎన్నికల కోడ్‌ ఉల్లంఘనకు సంబంధించిన అంశాలుంటే వెంటనే నేరుగా ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఆ సమావేశాలు, విందులకు వెళితే అనవసరంగా ఇబ్బందుల్లో పడక తప్పదని అధికారులు హెచ్చరిస్తున్నారు.

నిబంధనలు పాటించాలి..

ప్రతి ఉద్యోగి ఎన్నికల నిబంధనలు పాటించాల్సిందేనని జిల్లా ఎన్నికల అధికారి అరుణ్‌బాబు స్పష్టం చేశారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులతో పాటు ప్రభుత్వ వేతనం పొందుతున్న వారందరూ నిబంధనల మేరకు ఏ రాజకీయ పార్టీకి అనుకూలంగా గానీ, వ్యతిరేకంగా గానీ ప్రచారం చేయరాదన్నారు. ఆయా రాజకీయ పార్టీల సభలకు హాజరు కాకూడదన్నారు. అభ్యర్థులు, వారి ప్రతినిధులు ఏర్పాటు చేసిన విందులలో పాల్గొన్న ఇబ్బందులు ఎదుర్కొవాల్సి ఉంటుందని హెచ్చరించారు. దగ్గరి బందువు పోటీ చేస్తున్నా, కుటుంబ సభ్యులు ఉన్నా, స్నేహితులు పోటీ చేస్తున్నా సరే ఉద్యోగులు రాజకీయ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని సూచించారు.

ప్రభుత్వ ఉద్యోగులు

అప్రమత్తంగా ఉండాలి

ఆధారాలతో పట్టుబడితే వేటు తప్పదు

 
Advertisement
 
Advertisement