రూ.23 కోట్లతో సబ్‌ స్టేషన్‌...శంకుస్థాపన చేసిన సీఎం | Sakshi
Sakshi News home page

రూ.23 కోట్లతో సబ్‌ స్టేషన్‌...శంకుస్థాపన చేసిన సీఎం

Published Wed, Nov 29 2023 1:26 AM

- - Sakshi

ఓడీచెరువు : మండల పరిధిలోని మామిళ్లకుంట్లపల్లి వద్ద రూ.23 కోట్లతో నిర్మిస్తున్న 132 కేవీ విద్యుత్‌ సబ్‌స్టేషన్‌కు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. విద్యుత్‌ సమస్యతో ఏ రైతన్నా ఇబ్బంది పడకూడదని భావించి పగటి సమయంలోనే 9 గంటల విద్యుత్‌ అందించేందుకు చర్యలు చేపట్టామని సీఎం తెలిపారు. ఈ క్రమంలోనే లోఓల్టేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతూ మామిళ్లకుంట్లపల్లి వద్ద 132 కేవీ సబ్‌స్టేషన్‌ నిర్మిస్తున్నామన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న పుట్టపర్తి ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌ రెడ్డి మాట్లాడుతూ... నియోజకవర్గంలోని ఓడీచెరువు, నల్లమాడ, అమడగూరు మండలాలకు కదిరి వద్దగల కూటగుళ్ల నుంచి విద్యుత్‌ సరఫరా జరిగేదన్నారు. దీనివల్ల లోవోల్టేజీ సమస్య ఉత్పన్నమయ్యేదన్నారు. దీంతో మోటార్లు ఆడక రైతులు ఇబ్బందులు పడేవారన్నారు. మామిళ్లకుంట్లపల్లి సబ్‌స్టేషన్‌ అందుబాటులోకి వస్తే రైతులకు 9 గంటల పాటు నాణ్యమైన విద్యుత్‌ సరఫరా అవుతుందన్నారు. పంటల సాగుకూ ఇబ్బందులు తప్పుతాయన్నారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ సలహా మండలి అధ్యక్షుడు అవుటాల రమణారెడ్డి, మార్కెట్‌ యార్డు చైర్మన్‌ శ్రీనివాసరెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు కుర్లి దామోదర్‌రెడ్డి, ఓడీచెరువు, అమడగూరు మండలాల ఎంపీపీలు పర్వీన్‌ భాను, ప్రసాద్‌ రెడ్డి, రాష్ట్ర మైనార్టీ సెల్‌ కార్యదర్శి షామీర్‌ బాషా, మండల సలహా మండలి అధ్యక్షుడు లక్ష్మీరెడ్డి, వైఎస్సార్‌ సీపీ మండల కన్వీనర్‌ రాజు నాయుడు, పట్టణ కన్వీనర్‌ కోళ్ల కృష్ణారెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

కనగానపల్లి/కదిరి అర్బన్‌: రైతు సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వ్యవసాయానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ముఖ్యంగా సాగునీటికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగానే రైతులకు నాణ్యమైన నిరంతరాయ విద్యుత్‌ను సరఫరా చేసేందుకు చర్యలు తీసున్నారు. కనగానపల్లి మండలం భానుకోట సమీపంలో కేవీ పంపనూరు తండా వద్ద రూ.110.5 కోట్లతో నిర్మించిన 220/132 కేవీ విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ను, కదిరి మండల పరిధిలోని గట్లు వద్ద రూ.81.93 లక్షలతో నిర్మించిన 220 కేవీ విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ను మంగళవారం సీఎం జగన్‌ తాడేపల్లి నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు. అలాగే ఓడీచెరువు మండల పరిధిలోని మామిళ్లకుంట్లపల్లి వద్ద రూ.23 కోట్లతో నిర్మించనున్న 132 కేవీ విద్యుత్‌ సబ్‌స్టేషన్‌కు శంకుస్థాపన చేశారు. ఆయా కార్యక్రమాల్లో రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, కదిరి ఎమ్మెల్యే డాక్టర్‌ పీవీ సిద్దారెడ్డి, పుట్టపర్తి ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్‌ బోయ గిరిజమ్మ తదితరులు పాల్గొన్నారు.

రైతులకు ఇబ్బందులు కలగనివ్వం

ఆరుగాలం శ్రమించి తన స్వేదంతో దేశానికే అన్నంపెట్టే రైతన్నకు ఇబ్బందులు కలగనివ్వబోమని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి అన్నారు. మంగళవారం భానుకోట సమీపంలోని కేవీ పంపనూరు తండా వద్ద నూతన విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్‌ అందిస్తే రాష్ట్రం సస్యశ్యామలం అవుతుందని, తద్వారా వ్యవసాయ ఉత్పత్తులు పెరిగి రాష్ట్రం కూడా అభివృద్ధి వైపు నడుస్తుందని సీఎం జగన్‌ భావిస్తున్నారన్నారు. అందువల్లే ఎక్కడికక్కడ సబ్‌స్టేషన్లు నిర్మించి వ్యవసాయ మోటార్లకు నాణ్యమైన విద్యుత్‌ సరఫరా చేస్తున్నారన్నారు. కేవీ పంపనూరు తండా ఏర్పాటు చేసిన విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ ద్వారా కళ్యాణదుర్గం, రాప్తాడు నియోజక వర్గాల్లోని సుమారు 2 లక్షల మంది విద్యుత్‌ వినియోగదారులకు ప్రయోజనం కలుతుందన్నారు. ఈ విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ నుంచి రాప్తాడు నియోజకవర్గంలోని ఆత్మకూరు, తగరకుంట, కనగానపల్లి విద్యుత్‌ సబ్‌స్టేషన్ల విద్యుత్‌ అందిస్తామన్నారు. ఆయా సబ్‌స్టేషన్‌ల నుంచి రైతులకు నాణ్యమైన విద్యుత్‌ సరఫరా అయ్యేలా చూస్తామన్నారు. రాప్తాడు నియోజక వర్గంలో ఇప్పటికే కొత్తగా ఐదు విద్యుత్‌ స్టేషన్లు నిర్మించామని, మద్దెలచెరువు, గొరిదిండ్ల వద్ద మరో రెండు సబ్‌ స్టేషన్లు ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఏడీ నాగేంద్ర, ఎంపీడీఓ అలివేలమ్మ, ఎంపీపీ భాగ్యమ్మ, జెడ్పీటీసీ సభ్యుడు మారుతి ప్రసాద్‌, వైఎస్సార్‌సీపీ మండల నాయకులు, విద్యుత్‌ శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్‌

వ్యవసాయానికి 9 గంటల పాటు నాణ్యమైన విద్యుత్‌ను నిరంతరాయంగా అందిస్తామని కదిరి ఎమ్మెల్యే డా.పీవీ సిద్దారెడ్డి అన్నారు. మంగళవారం ఆయన కలెక్టర్‌ అరుణ్‌బాబుతో కలిసి గట్లవద్ద నిర్మించిన 220 కేవీ విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ...దేవుడి దయ, ముఖ్యమంత్రి చల్లని పాలనలో రైతులంతా ఆనందంగా ఉన్నారన్నారు. సాగునీటి ఇబ్బందులు రాకూడదన్న ఉద్దేశంతోనే హంద్రీ నీవా నీటితో నియోజకవర్గంలోని అన్నిచెరువులూ నింపామన్నారు. ప్రస్తుతం ఏ చెరువు చూసినా నిండుకుండలా తొణికిసలాడుతోందన్నారు. తద్వారా భూగర్భ జలమట్టం కూడా భారీగా పెరిగి నీరు పుష్కలంగా అందుబాటులో ఉందన్నారు. దీంతో రైతులంతా పంటలు సాగు చేస్తుండగా, వ్యవసాయానికి విద్యుత్‌ వినియోగమూ పెరిగిందన్నారు. ఈ క్రమంలోనే అక్కడక్కడా విద్యుత్‌ సరఫరాలో కాస్త అంతరాయం కలిగిందన్నారు. ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్లగానే, వెంటనే విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ల ఏర్పాటుకు అనుమతులు ఇచ్చారన్నారు. గట్లవద్ద నిర్మించిన 220 కేవీ విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ వల్ల ఈ ప్రాంత వ్యవసాయ కనెక్షన్‌లకు నిరంతరాయంగా విద్యుత్‌ సరఫరా జరుగుతుందన్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ వంశీకృష్ణారెడ్డి, విద్యుత్‌ శాఖ డీఈ మెసెస్‌, ఏడీ శ్రీనివాసులు, ఎంపీపీ అమరనాథ్‌రెడ్డి, సర్పంచ్‌ ఈశ్వరయ్యతోపాటు పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

అందుబాటులోకి భానుకోట,

గట్లు సబ్‌స్టేషన్లు

వర్చువల్‌గా ప్రారంభించిన

సీఎం జగన్‌మోహన్‌రెడ్డి

హాజరైన ఎమ్మెల్యేలు తోపుదుర్తి

ప్రకాష్‌రెడ్డి, డాక్టర్‌ పీవీ సిద్దారెడ్డి

వ్యవసాయానికి నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్‌

ఓలోల్టేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం

ఓడీచెరువు మండలం మామిళ్లకుంట్లపల్లి సబ్‌స్టేషన్‌కూ భూమిపూజ

సబ్‌స్టేషన్‌కు భూమిపూజ అనంతరం మాట్లాడుతున్న ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి
1/3

సబ్‌స్టేషన్‌కు భూమిపూజ అనంతరం మాట్లాడుతున్న ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి

2/3

3/3

Advertisement
 
Advertisement
 
Advertisement