రైతుకు సాయంగా నిలుద్దాం | Sakshi
Sakshi News home page

రైతుకు సాయంగా నిలుద్దాం

Published Sat, Nov 18 2023 9:04 AM

మాట్లాడుతున్న చైర్మన్‌ అవుటాల రమణారెడ్డి, పాల్గొన్న వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు - Sakshi

పుట్టపర్తి అర్బన్‌: ఆరుగాలం శ్రమించి పంటలు సాగు చేసే రైతులకు సాయంగా నిలుద్దామని జిల్లా వ్యవసాయ సలహా మండలి అధ్యక్షుడు అవుటాల రమణారెడ్డి అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్‌ హాలులో జిల్లా వ్యవసాయ సలహా మండలి సమావేశం నిర్వహించారు. జిల్లాలోని 21 మండలాలను ప్రభుత్వం కరువు జాబితాలో చేర్చగా, మిగతా 11 మండలాలనూ కరువు జాబితాలో చేర్చాలని తీర్మానం చేశారు. అనంతరం సభాధ్యక్షుడు అవుటాల రమణారెడ్డి మాట్లాడుతూ... రైతు సంక్షేమం కోసం వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. రబీ సీజన్‌లో బోర్ల కింద వేరుశనగ పంట సాగుకు అవసరమైన విత్తనాలు అందించాలని, ఇందుకు అవసరమైన నివేదికలను ప్రభుత్వానికి పంపాలన్నారు. అర్హులైన రైతులకు పొట్టేళ్లు, కోళ్లు, పందుల పెంపకం యూనిట్లకు సహకార బ్యాంకుల ద్వారా రుణ సదుపాయం కల్పిస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు ఏడీసీసీ బ్యాంకు చైర్‌పర్సన్‌ లిఖిత హామీ ఇచ్చిందన్నారు. ఎస్సీ రైతులకు ఇచ్చే వ్యవసాయ కిట్లను సక్రమంగా పంపిణీ చేయాలన్నారు. లోఓల్టేజీ సమస్యను పరిష్కరించేలా విద్యుత్‌ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. మత్స్య శాఖ ద్వారా జిల్లాలో ఫిష్‌ ఫుడ్‌ ఫెస్టివల్‌ నిర్వహించేందుకు కృషి చేయాలన్నారు. బుక్కపట్నం మండలం తరుగువాండ్లపల్లి వద్ద హంద్రీనీవా కాలువపై బ్రిడ్జి నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని కోరారు.

రాగి సాగు విస్తీర్ణం పెరిగేలా చర్యలు..

జిల్లాలో రాగి సాగు విస్తీర్ణం పెంచేందుకు వ్యవసాయాధికారులు చర్యలు తీసుకోవాలని జాయింట్‌ కలెక్టర్‌ చేతన్‌ సూచించారు. రాగులకు ప్రభుత్వమే మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేస్తోందని, ఈ విషయాన్ని రైతులకు తెలియజెప్పి రాగులు సాగు చేసేలా చూడాలన్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు, ఈ– క్రాప్‌ బుకింగ్‌ వంటివి సకాలంలో పూర్తి చేయాలన్నారు. జిల్లా వ్యవసాయాధికారి సుబ్బారావు మాట్లాడుతూ..ఖరీఫ్‌ సీజన్‌లో రైతులు కొంత మేర నష్ట పోయారని, దీంతో కరువు మండలాల జాబితాను పెంచి ప్రభుత్వానికి నివేదిస్తామని పేర్కొన్నారు. సమావేశంలో వ్యవసాయ సలహా మండలి సభ్యుడు బసిరెడ్డి, ఏపీఎంఐపీ పీడీ సుదర్శన్‌, మత్స్యశాఖ అధికారి చంద్రశేఖర్‌రెడ్డి, జిల్లా సహకార శాఖ అధికారి కృష్ణానాయక్‌, పశుసంవర్ధక శాఖ జేడీ శుభదాస్‌, హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌ ఎస్‌ఈ మురళీ, మైనర్‌ ఇరిగేషన్‌ ఈఈ గంగాధర్‌, విద్యుత్‌ శాఖ డీఈ శరవణన్‌ తదితరులు ఉన్నారు.

వ్యవసాయ సలహా మండలి

సమావేశంలో అవుటాల రమణారెడ్డి

కరువు జాబితాలో జిల్లాలోని

అన్ని మండలాలు చేర్చాలని తీర్మానం

1/1

Advertisement
 
Advertisement
 
Advertisement