పచ్చిరొట్టతో భూసారం మెండు | Sakshi
Sakshi News home page

పచ్చిరొట్టతో భూసారం మెండు

Published Fri, Sep 29 2023 12:46 AM

పెడపల్లి వద్ద సాగు చేసిన జీలుగ పంట - Sakshi

పుట్టపర్తి అర్బన్‌: పంటల సాగులో రసాయనిక ఎరువుల వాడకంతో అనేక అనర్థాలు చోటు చేసుకున్నాయి. నేల భౌతిక లక్షణాలు దెబ్బతిని సారం క్రమంగా కోల్పోతోంది. సూక్ష్మ పోషక లోపాల కారణంగా పంట ఉత్పత్తులు గణనీయంగా తగ్గాయి. వ్యవసాయంలో పెట్టుబడులూ పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో నేల సహజత్వాన్ని కాపాడేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంది. వ్యవసాయంలో మార్పును ఆహ్వానిస్తూ అన్నదాతలకు పెద్ద ఎత్తున్న ప్రోత్సాహాకాలను అందజేస్తోంది. పచ్చిరొట్ట సాగుతో భూసారం పెంచేలా చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా భూసారం పెంపుపై జిల్లా వ్యవసాయాధికారులు, శాస్త్రవేత్తలు విస్తృత అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తూ రైతుల్లో చైతన్యం తీసుకువస్తున్నారు.

ఐదేళ్ల క్రితం బీడు భూములు..

గతంలో ప్రైవేటు ఎరువుల కంపెనీల ప్రకటనలు చూసి మోసపోయిన రైతులు అధిక పంట దిగుబడులు ఆశిస్తూ విచక్షణారహితంగా రసాయనిక ఎరువులు వినియోగిస్తూ వచ్చారు. ఫలితంగా భూమి తన సహజత్వాన్ని కోల్పోతూ వచ్చింది. సారం లేని భూమిలో పంటల సాగు చేపట్టిన రైతులు నష్టాల ఊబిలో కూరుకుపోతూ వచ్చారు. ఫలితంగా వ్యవసాయం భారమై ఐదేళ్ల క్రితం వరకూ చాలా వరకూ భూములు బీడుగా వదిలేసి, పట్టణ ప్రాంతాలకు వలసపోయారు. రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వ్యవసాయానికి అత్యంత ప్రాధాన్యతనిచ్చారు. ఈ క్రమంలో జల వనరుల అభివృద్ధికి పెద్ద ఎత్తున చర్యలు తీసుకున్నారు. దీనికి తోడు ప్రకృతి సహకరించడంతో 2019 తర్వాత విస్తారంగా వర్షాలు కురిసాయి. చెరువులు, కుంటలు, నదులు జలకళను సంతరించుకున్నాయి. వలస వెళ్లిన రైతులు పల్లె బాట పట్టారు. పలుగు, పార చేతబట్టి పొలం పనుల్లో నిమగ్నం కావడంతో భూసారం పెంపుపై ప్రభుత్వ ఆదేశాల మేరకు రైతులను చైతన్య పరిచే కార్యక్రమాలను అధికారులు విస్తృతం చేశారు. ఫలితంగా రసాయన ఎరువుల స్థానంలో పచ్చిరొట్ట ఎరువులు సాగు చేసి భూసారం పెంపుతో పాటు మంచి దిగుబడులూ సాధిస్తున్నారు. ఇటీవల ప్రభుత్వం నానో యూరియా, నానో డీఏపీ వంటి లిక్విడ్‌ ఎరువులను అందుబాటులోకి తీసుకురావడంతో రసాయనిక ఎరువులు వినియోగం పూర్తిగా తగ్గింది.

సబ్సిడీతో పచ్చిరొట్ట ఎరువు విత్తనాలు..

పచ్చి రొట్ట ఎరువులైన జీలుగ, జనుము, పిల్లి పెసర, ఉలవ తదితర విత్తనాలను ప్రభుత్వం సబ్సిడీపై అందజేస్తోంది. వీటి సాగు చేయడం ద్వారా నేల భౌతిక స్థితితో పాటు స్థూల, సూక్ష్మ సాంద్రతలో స్పష్టమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. భూమిలో నీటి నిలువ శక్తి శాతం పెరిగింది. గాలిలో ఉండే నత్రజనిని స్థిరీకరిస్తుండడంతో పైపాటుగా వేసే నత్రజని ఎరువుల భారం తగ్గింది. భూ సారం పెరిగింది. సాధారణంగా ఎరువులు వేసినప్పుడు నత్రజని, పోటాషియం, బాస్వరం మాత్రమే అందుతాయి పచ్చిరొట్ట ఎరువులతో మొక్కలకు కావాల్సిన 16 రకాల పోషకాలు అందుతాయి. భూముల్లో చౌడు శాతం తగ్గేందుకు ఎంతో ఉపయోగపడ్డాయి. నేలలో మంచి బ్యాక్టీరియా, సూక్ష్మజీవులు, వానపాములు పెంపునకు సహకరించి భూమి ఆరోగ్యాన్ని పెంపొందించాయి. పచ్చిరొట్ట ఎరువు సాగు చేసే రైతులకు ప్రభుత్వం 50 శాతం సబ్సిడీతో విత్తనాలను అందజేస్తోంది. జీలుగ కిలో రూ.79 కాగా రూ.39.5 అందజేస్తుంది. అలాగే జనుము కిలో రూ.42 , పిల్లి పెసర రూ.48.5తో అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ఏడాది 475 మంది రైతులకు 165 క్వింటాళ్ల పచ్చిరొట్ట ఎరువు విత్తనాలను అందజేశారు. 80 శాతం సబ్సిడీతో13,174 మంది రైతులకు 3,310 క్వింటాళ్ల ఉలవలు అందజేశారు.

భూసారం పెంపుపై

విస్తృత అవగాహన సదస్సులు

పంటల సాగులో పచ్చిరొట్ట

ఎరువుల వినియోగంపై చైతన్యం

3,475 క్వింటాళ్ల విత్తనాలు

సబ్సిడీపై అందజేసిన ప్రభుత్వం

భూమికి మంచిది

పచ్చిరొట్ట ఎరువుల సాగుపై ఇప్పుడిప్పుడే రైతుల్లో అవగాహన పెరుగుతోంది. మెట్ట భూమి కంటే వరిమడిలో దీని ప్రభావం త్వరగా చూపుతుంది. దీనిని సాగు చేసి మొగ్గ దశలో నేలలోకి కలియ దున్నితే మంచి ఎరువుగా ఉపయోగపడుతుంది. భూమి సారవంతమవుతుంది. ఇందులో నత్రజని, పోటాషియం, భాస్వరం అధికంగా ఉంటుంది.

– రామసుబ్బయ్య,

ఏరువాక శాస్త్రవేత్త, పుట్టపర్తి

జీలుగను నేలలో కలియ దున్నిన దృశ్యం
1/3

జీలుగను నేలలో కలియ దున్నిన దృశ్యం

పుట్టపర్తి వద్ద వరి మడిలో ఆకు తొక్కడానికి సిద్ధం చేసిన నేల
2/3

పుట్టపర్తి వద్ద వరి మడిలో ఆకు తొక్కడానికి సిద్ధం చేసిన నేల

3/3

Advertisement
 
Advertisement