అవార్డు అందుకున్న బాషా | Sakshi
Sakshi News home page

అవార్డు అందుకున్న బాషా

Published Thu, Sep 28 2023 1:10 AM

ఉత్తమ ఫొటోగ్రాఫర్‌ అవార్డు అందుకుంటున్న మహబూబ్‌బాషా  - Sakshi

అనంతపురం కల్చరల్‌: రాష్ట్ర స్థాయి ఉత్తమ ఫొటోగ్రాఫర్‌ అవార్డును ‘సాక్షి’ ఫొటో జర్నలిస్టు డి.మహబూబ్‌బాషా బుధవారం అందుకున్నారు. ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర పర్యాటక శాఖ సౌజన్యంతో ఫొటోగ్రఫీ అకాడమీ ఆఫ్‌ ఇండియా ఇటీవల ఉత్తమ ఫొటోగ్రాఫర్ల జాబితాను ప్రకటించింది. ఇందులో డి.మహబూబ్‌బాషాను రాష్త్ర స్థాయి ఉత్తమ ఫొటోగ్రాఫర్‌ అవార్డుకు ఎంపిక చేయడంతో బుధవారం విజయవాడ వేదికగా సాగిన పర్యాటక దినోత్సవంలో సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి ఇంతియాజ్‌ బాషా చేతుల మీదుగా ఆయన అవార్డు అందుకున్నారు. పురస్కారంతో పాటు బంగారు పతకం, ప్రశంసాపత్రాన్ని అందజేస్తూ మహబూబ్‌బాషాను నిర్వాహకులు సత్కరించారు.

పర్యాటక శాఖాధికారికి అవార్డు

అనంతపురం కల్చరల్‌: జిల్లా పర్యాటక శాఖ అధికారి జి.నాగేశ్వరరెడ్డికి రాష్ట్ర స్థాయి ఉత్తమ అధికారి అవార్డు దక్కింది. ప్రస్తుతం ఆయన ఉమ్మడి అనంతపురం జిల్లా పర్యాటక శాఖ అధికారిగా పనిచేస్తున్నారు. ఆరు దశాబ్దాలుగా పర్యాటక శాఖకు జిల్లాలో సొంత కార్యాలయం లేని విషయాన్ని గుర్తించిన ఆయన, చొరవ తీసుకుని ఎంపీ కోటా నిధులతో కార్పొరేట్‌ తరహాలో నూతన భవనాన్ని ఏర్పాటు చేయించారు. అలాగే పర్యాటక ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేయడం, దేశంలోనే ఉత్తమ టూరిజం విలేజ్‌గా లేపాక్షికి జాతీయ స్థాయి అవార్డు దక్కడం వెనుక ఆయన పడిన శ్రమకు గుర్తింపుగా రాష్ట్ర స్థాయి అవార్డుకు ప్రభుత్వం ఎంపిక చేసింది. ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం ఆయన అవార్డు అందుకోవాల్సి ఉండగా, జిల్లాలో పర్యాటక వేడుకల నిర్వహణ కారణంగా వెళ్లలేకపోయారు. ఆయన తరఫున అవార్డును పర్యాటక శాఖ జిల్లా మేనేజర్‌ దీపక్‌ అందుకోనున్నారు.

మహిళ దుర్మరణం

తనకల్లు: రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ దుర్మరణం పాలైంది. పోలీసులు తెలిపిన మేరకు.... ఎన్‌పీ కుంట మండలం యాదలవాండ్లపల్లికి చెందిన తిమ్మమ్మ (46), నరసింహులు దంపతులు బుధవారం ఉదయం విద్యుత్‌ సామగ్రి కొనుగోలుకు కొక్కంటి క్రాస్‌కు వచ్చారు. సామగ్రి కొనుగోలు చేసుకున్న అనంతరం ద్విచక్రవాహనంపై తిరుగు ప్రయాణమయ్యారు. ఉస్తినిపల్లి క్రాస్‌ సమీపంలోకి చేరుకోగానే వెనుక వస్తున్న ఐచర్‌ వాహనానికి సైడ్‌ ఇచ్చే క్రమంలో ద్విచక్ర వాహనాన్ని నరసింహులు పక్కకు తిప్పాడు. దీంతో బైక్‌ అదుపుతప్పి వెనుక కూర్చొన్న తిమ్మమ్మ రోడ్డుపై పడింది. ఆ వెనకనే వస్తున్న ఐచర్‌ వాహనం చక్రం ఆమె తల మీదుగా దూసుకెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.

ఉపాధ్యాయుల లోటు రానివ్వొద్దు

డీఈఓకు విన్నవించిన

వైఎస్సార్‌టీఎఫ్‌ నాయకులు

పుట్టపర్తి అర్బన్‌: పని సర్దుబాటులో భాగంగా ఏ స్కూలులోనూ ఉపాధ్యాయుల లోటు రానివ్వకుండా చూడాలని డీఈఓ మీనాక్షికి జిల్లా వైఎస్సార్‌టీఎఫ్‌ నాయకులు విన్నవించారు. ఈ మేరకు బుధవారం కొత్తచెరువులోని జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో డీఈఓను కలసి వినతిపత్రం అందజేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. అవసరమైన పాఠశాలల్లో అదనపు ఉపాధ్యాయులను తీసుకోవాలని, అంగవైకల్యం, దీర్ఘకాల వ్యాధులతో బాధపడే వారికి తగిన ప్రాధాన్యతనివ్వాలని కోరినట్లు వివరించారు. వీలైనంత తొందరగా పని సర్దుబాటు ప్రక్రియ ముగించాలని విన్నవించినట్లు తెలిపారు. డీఈఓను కలిసిన వారిలో వైఎస్సార్‌టీఎఫ్‌, పీఆర్‌టీయూ నాయకులు పీవీ రమణారెడ్డి, రజనీకాంత్‌రెడ్డి, నబీసాహెబ్‌, రంగధామరెడ్డి, హర్షవర్దన్‌రెడ్డి, కేశప్ప తదితరులు ఉన్నారు.

వ్యక్తి అనుమానాస్పద మృతి

రొళ్ల: నీటి కుంటలో పడి ఓ వ్యక్తి మృతి చెందిన తీరుపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు తెలిపిన మేరకు.. రొళ్ల మండలం బీజీ హళ్లి పంచాయతీ మల్లసముద్రం గ్రామానికి చెందిన హనుమంతరాయప్ప, పుట్టమ్మ దంపతులకు ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. హనుమంతరాయప్ప మృతి చెందడంతో కుమారుడు దేవరాజు(40)తో కలసి పుట్టమ్మ నివసిస్తోంది. వ్యక్తిగత పనిపై మంగళవారం మధ్యాహ్నం రొళ్లకు వచ్చిన దేవరాజ్‌ తిరిగి ఇంటికి చేరుకోలేదు. బుధవారం ఉదయం రగ్నగిరి పంచాయతీ బాజయ్యపాళ్యం గ్రామానికి చెందిన ఫీల్డ్‌ అసిస్టెంట్‌ తిమ్మారెడ్డి వ్యవసాయ పొలంలోని నీటి తొట్టెలో దేవరాజ్‌ మృతదేహాన్ని గుర్తించిన స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. ముఖంపై రక్తగాయాలు ఉండడంతో దేవరాజ్‌ మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ కుటుంబసభ్యులు ఫిర్యాదు చేయడంతో ఆ దిశగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

డీఈఓ మీనాక్షికి వినతిపత్రం ఇస్తున్న 
వైఎస్సార్‌టీఎఫ్‌ నాయకులు
1/3

డీఈఓ మీనాక్షికి వినతిపత్రం ఇస్తున్న వైఎస్సార్‌టీఎఫ్‌ నాయకులు

నాగేశ్వరరెడ్డి
2/3

నాగేశ్వరరెడ్డి

మృతుడు దేవరాజు
3/3

మృతుడు దేవరాజు

Advertisement
 

తప్పక చదవండి

Advertisement