డొంక పొరంబోకు భూమిని ఆక్రమించి నిర్మించిన ఆర్చి
పొదలకూరు: అధికారాన్ని అడ్డం పెట్టుకొని పట్టా ల్యాండ్స్‌తో పాటు కుంట, డొంక పొరంబోకు భూములను కొందరు పెద్ద మనుషులు ఆక్రమించి భారీ లేఅవుట్‌ను ఏర్పాటు చేస్తున్నారు. భారీ ప్రచారంతో దీని నిర్మాణాన్ని చేపట్టిన నిర్వాహకులు.. సుమారు రూ.పది కోట్ల విలువజేసే పొరంబోకు భూములను కలిపేసుకున్నారు. అధికారం ముసుగులో ఎస్టీలకు చెందిన భూముల నుంచి యథేచ్ఛగా గ్రావెల్ తవ్వకాలు జరిపి సదరు వెంచర్‌కు వినియోగించారు. ముందున్న ఆర్ అండ్ బీ మెయిన్ రోడ్డుపై అనుమతుల్లేకుండా రహదారిని విస్తరించారు. పెద్ద ఆర్చిలను డొంక పొరంబోకు భూముల్లో నిర్మించి ఇదే రహదారి అంటూ చూపిస్తున్నారు. ఇంత జరుగుతున్నా.. అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. లేఅవుట్లో ఉన్న కుంట పొరంబోకు భూమి సుమారు ఎనిమిదెకరాలను కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారు. గ్రామస్తులు దీనికి ఏ మాత్రం సమ్మతించడం లేదు.
రూ.కోట్ల విలువైన ల్యాండ్స్ మాయం
సర్వేపల్లి నియోజకవర్గంలోని పొదలకూరు మండలంలో గల మరుపూరు రెవెన్యూ పరిధిలో సుమారు 120 ఎకరాల్లో లేఅవుట్‌ను మనభూమి యాజమాన్యం చేపడుతోంది. నుడా నుంచి పదెకరాల్లోపే అనుమతులను ప్రస్తుతం పొందారు. విడతల వారీగా పర్మిషన్లు పొందేందుకు యత్నిస్తున్నారు. ఇక్కడ విల్లాల నిర్మాణంతో పాటు ప్లాట్ల వ్యాపారాన్నీ చేస్తున్నారు. అయితే మరుపూరు రెవెన్యూ విలేజ్ ఎల్పీఎం నంబర్ 830లో 5.02.. ఎల్పీఎం నంబర్ 83 లో 2.96.. డొంక, కుంట పొరంబోకు రెవెన్యూ భూములను కలిపేసుకున్నారు. డొంక దారికి సంబంధించిన సుమారు 150 అడుగుల స్థలంలో ఆర్చీనీ నిర్మించారు. కుంటలోని నీటిని చుట్టుపక్కల మేతకొచ్చే పశువులు ఎప్పట్నుంచో తాగుతుంటాయి. దీన్ని పూడ్చేసి దేవాలయ నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ మొత్తం భూముల విలువ సుమారు రూ.10 కోట్లకుపైగానే ఉంటుంది. పక్కనే తూర్పువైపు పాలిచెర్లపాడు రోడ్డుకు ఆనుకుని ఉన్న అసైన్డ్ భూములను సైతం కొనుగోలు చేశారు. లేఅవుట్‌కు ముందున్న ఆర్ అండ్ బీ మెయిన్ రోడ్డు పక్కనే ఇష్టానుసారం తవ్వేసి అనుమతుల్లేకుండా రోడ్లను విస్తరించారు. రాజకీయ పలుకుబడి, అధికారం వెన్నుదన్నుగా ఉండటంతోనే లేఅవుట్ యజమానులు ఇలా వ్యవహరిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
ప్రభుత్వ భూములను కాపాడాలి
మరుపూరు వద్ద నిర్మిస్తున్న మనభూమి లేఅవుట్లో కలిపేసుకున్న రూ.కోట్ల విలువైన సుమారు ఎనిమిదెకరాల ప్రభుత్వ భూములను కాపాడాలి. ఈ విషయమై కలెక్టర్‌కు వినతిపత్రాన్ని అందజేశాం. భవిష్యత్తులో పశువులు, రైతులు నడిచేందుకు దారి.. నీరు తాగేందుకు కుంటా ఉండదు. అధికారులు చర్యలు చేపట్టకపోతే ఆందోళనకు సిద్ధంగా ఉన్నాం.
– కలిచేటి రామిరెడ్డి, గ్రామస్తుడు, మరుపూరు
డొంకదారి కబ్జా
పొలాలకు రైతులు దశాబ్దాలుగా వెళ్లే డొంక దారిని కబ్జా చేశారు. ప్రశ్నిస్తే కొత్త రోడ్డుపై వెళ్లొచ్చని బదులిస్తున్నారు. లేఅవుట్‌ను కలుపుకొన్న దారిలో భవిష్యత్తులో వెళ్లనిస్తారంటే ఎవరూ నమ్మరు. కుంటను కబ్జాను చేసి దేవాలయ నిర్మాణానికి పనులు చేపట్టారు.
– ఏనుగు అనిల్‌రెడ్డి,
గ్రామస్తుడు, మరుపూరు
సర్వే చేపట్టాం
గతంలో విచారణను ఒక సారి జరిపి, కుంటను వదిలేయాలని లేఅవుట్ యజమానులకు సూచించాం. తాజాగా వీఆర్వో, సర్వేయర్‌ను పంపి భూములను సర్వే చేయిస్తున్నాం. కబ్జాకు గురై ఉంటే చర్యలు చేపట్టి నివేదికను ఉన్నతాధికారులకు సమర్పించనున్నాం.
– శివకృష్ణయ్య,
తహసీల్దార్, పొదలకూరు
కుంట, డొంకా..
గుటకాయ స్వాహా
అధికారమే అండగా మరుపూరుకు సమీపంలో అతిపెద్ద లేఅవుట్
రూ.పది కోట్ల విలువైన పొరంబోకు ల్యాండ్స్ కబ్జా
కలెక్టర్‌కు వినతిపత్రమిచ్చిన గ్రామస్తులు


