స్నాతకోత్సవ సంబరం | - | Sakshi
Sakshi News home page

స్నాతకోత్సవ సంబరం

Jun 10 2026 12:49 AM | Updated on Jun 10 2026 12:49 AM

అంతా గందరగోళం

నెల్లూరు (టౌన్‌): విద్యార్థులు తమ విద్యను వ్యక్తిగత అభివృద్ధికే కాకుండా సమాజ శ్రేయస్సుకు వినియోగించాలని గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ పిలుపునిచ్చారు. కనుపర్తిపాడు సమీపంలోని వీపీఆర్‌ కన్వెన్షన్‌ హాల్లో మంగళవారం నిర్వహించిన విక్రమ సింహపురి యూనివర్సిటీ 10, 11, 12వ స్నాతకోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడారు. నాక్‌ నుంచి 3.23 సీజీపీతో ఏ గ్రేడ్‌ను ఇటీవల పొందడం గర్వకారణమన్నారు. ప్రధానమంత్రి ఉచ్ఛతర్‌ శిక్ష అభియాన్‌ కింద రూ.20 కోట్ల గ్రాంట్‌ మంజూరు కావడం, డీప్‌ ఓషన్‌ మిషన్‌ కార్యక్రమం కింద మైరెన్‌ బయాలజీ విభాగానికి రూ.4.12 కోట్లు లభించడం వర్సిటీ అభివృద్ధికి దోహదపడుతుందని కాంక్షించారు. వీటి ద్వారా పరిశోధన, డిజిటల్‌ విద్య, విద్యార్థుల నైపుణ్యాభివృద్ధికి మరింత ఊతం లభించనుందని చెప్పారు. జాతీయ సేవా పథకం ద్వారా కార్యక్రమాలు, గ్రామీణాభివృద్ధి, కమ్యూనిటీ డెవలప్‌మెంట్‌, కాలేజీ టు విలేజ్‌, ల్యాబ్‌ టు ల్యాండ్‌ లాంటి వాటిని అభినందించారు.

సవాళ్లకు సన్నద్ధం చేయాలి

ప్రస్తుత కాలంలో ఏఐ ప్రాధన్యం రోజురోజుకూ పెరుగుతోందని, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉన్నత విద్యాసంస్థలు స్వీకరించి భవిష్యత్తు సవాళ్లకు విద్యార్థులను సంసిద్ధం చేయాలని పిలుపునిచ్చారు. డిజిటల్‌ విద్యను విస్తృతంగా వినియోగించాల్సిన అవసరం ఉందన్నారు. విద్యార్థులు తమ వృత్తి జీవితంలో కమ్యూనికేషన్‌ స్కిల్స్‌, వ్యక్తిత్వ వికాస నైపుణ్యాలు, నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవాలని సూచించారు. పట్టాలు అందుకున్న విద్యార్థులకు శుభాకాంక్షలను తెలియజేశారు. అనంతరం పద్మభూషణ్‌, శాంతా బయోటెక్‌ వ్యవస్థాపకుడు వరప్రసాద్‌రెడ్డి మాట్లాడారు. నెల్లూరు మట్టిలో పుట్టిన బిడ్డగా తనకు దక్కిన ఈ గౌరవం.. తల్లి ఒడిలో దక్కిన ఆశీస్సుగా భావిస్తున్నానని చెప్పారు. విద్య, వైద్యానికి ప్రభుత్వాలు ప్రాధన్యమి వ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. విశ్వవిద్యాలయాలు కేవలం ప్రభుత్వ నిధులపైనే ఆధారపడకుండా స్వయం సమృద్ధిని సాధించాలని సూచించారు. విద్యార్థులు ఉద్యోగాల వెంటపడకుండా పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని కాంక్షించారు.

డాక్టరేట్లు, గోల్డ్‌ మెడళ్ల ప్రదానం

శాంతా బయోటెక్‌ వ్యవస్థాపకుడు వరప్రసాద్‌రెడ్డి, నీతి ఆయోగ్‌ సభ్యుడు, ప్రముఖ మాలిక్యులర్‌ శాస్త్రవేత్త గోవర్ధన్‌దాస్‌, రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్‌రావుకు గౌరవ డాక్టరేట్లను గవర్నర్‌ చేతుల మీదుగా అందజేశారు. అనంతరం 45 మంది విద్యార్థులకు స్వర్ణ పతకాలు.. 21 మందికి డాక్టరేట్లు.. డిగ్రీ, పీజీ విద్యార్థులకు పట్టాలను అందజేశారు. తొలుత వర్సిటీ పురోగతిని వీసీ శ్రీనివాసరావు వివరించారు. అనంతరం గవర్నర్‌ను సత్కరించి జ్ఞాపికను అందజేశారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, సర్వేపల్లి, కోవూరు ఎమ్మెల్యేలు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, వర్సిటీ మాజీ వీసీలు విశ్వేశ్వరరావు, సుదర్శనరావు, రిజిస్ట్రార్‌ సునీత తదితరులు పాల్గొన్నారు.

నెల్లూరులో ఉల్లాసంగా.. ఉత్సాహంగా

ముఖ్యఅతిథిగా హాజరైన

గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌

ముగ్గురికి గౌరవ డాక్టరేట్ల ప్రదానం

45 మందికి స్వర్ణ పతకాలు..

21 మందికి పీహెచ్‌డీ పట్టాల అందజేత

గవర్నర్‌ కార్యక్రమం ముగిసిన అనంతరం భోజన సమయంలో అంతా గందరగోళం నెలకొంది. స్నాతకోత్సవానికి విద్యార్థులు, తల్లిదండ్రులే కాకుండా సంబంధం లేని వ్యక్తులు ఎక్కువ మంది వచ్చారు. మరోవైపు పాస్‌లను ఎవరికి అంటే వారికి వర్సిటీ అధికారులు ఇచ్చారని తెలుస్తోంది. బయట్నుంచి వచ్చిన వ్యక్తులను వీఐపీ లైన్లో అక్కడున్న పోలీసులు, సెక్యూరిటీ పంపారు. మీడియా ప్రతినిధులను మాత్రం లోపలికి అనుమతించలేదు. మధ్యాహ్నం రెండు గంటలు దాటినా భోజనం పెట్టకపోవవడంతో గందరగోళం నెలకొంది. అక్కడ ఏర్పాటు చేసిన పోలీసులు, సెక్యూర్టీ సైతం ఓవరాక్షన్‌ చేశారు. ఏర్పాట్లూ అంతంతమాత్రంగా ఉండటంతో అందరూ అసహనం వ్యక్తం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement