● హామీలివ్వడం.. గాలికొదిలేయడం ఆయనకు అలవాటే
● ధ్వజమెత్తిన కాకాణి గోవర్ధన్‌రెడ్డి
మనుబోలు: సీఎం చంద్రబాబుకు వెన్నుపోటు పొడవడం వెన్నతో పెట్టిన విద్య అని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి ధ్వజమెత్తారు. వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమంలో భాగంగా మనుబోలులో ర్యాలీని మంగళవారం నిర్వహించారు. అనంతరం పద్మావతి కల్యాణ మండపంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఎన్నికలకు ముందు సూపర్‌సిక్స్ అని, ఆపై మరొకటి కలిపి సూపర్ సెవన్ అని హామిలిచ్చిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చాక ఒక్క దాన్నీ సక్రమంగా అమలు చేయడంలేదని ధ్వజమెత్తారు. ఆడబిడ్డ నిధి.. నిరుద్యోగులకు 20 లక్షల ఉద్యోగాలు.. నెలకు రూ.మూడు వేల నిరుద్యోగ భృతిని ఇస్తానని చెప్పి గెలిచాక కుచ్చుటోపీ పెట్టారని విమర్శించారు.
దగా డీఎస్సీ
మెగా డీఎస్సీ పేరుతో నిరుద్యోగులను దగా చేశారని మండిపడ్డారు. స్పోర్ట్స్ కోటా పేరుతో గతంలో 29 క్రీడలుండగా, ఇప్పుడు దాన్ని 65 చేశారని తెలిపారు. ఇందులో పేకాట, టగ్ ఆఫ్ వార్, యోగా లాంటి వాటిని చేర్చారని చెప్పారు. క్రీడా అసోసియేషన్లను అప్పటికప్పుడు పెట్టించి, వాటి ద్వారా నకిలీ సర్టిఫికెట్లను సృష్టించి తమకు అనుకూలమైన వారికి అడ్డదారిలో ఉద్యోగాలను కట్టిబెట్టారని ఆరోపించారు. ఇలా 421 ఉద్యోగాలను చంద్రబాబు, లోకేశ్ అమ్ముకున్న విషయమై వాస్తవాలను చెప్పాలని నిలదీశారు. కేసులు పెడతామని తమను బెదిరించినంత మాత్రాన, డీఎస్సీలో జరిగిన దగా, అవినీతిపై మాట్లాడకుండా ఉండబోమని స్పష్టం చేశారు. ఉచిత బస్సులు అవసరమైన చోట ఆగడంలేదంటూ మహిళలు వాపోతున్నారని తెలిపారు. మూడు గ్యాస్ సిలిండర్లు.. తల్లికి వందనం పేరిట వంచించారని ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో ధాన్యం ధరలు రూ.24 వేల నుంచి రూ.26 వేలుంటే, ఇప్పుడు రూ.20 వేలు సైతం పలకడంలేదని విమర్శించారు. రైతులకు యూరియాను సైతం సక్రమంగా ఇవ్వలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందని ధ్వజమెత్తారు. కనీసం ఒక్కరికై నా కొత్త పింఛన్‌ను ఇచ్చారానని ప్రశ్నించారు. గద్దర్‌కు కారిచ్చా.. భగత్‌సింగ్‌కు నేనే తుపాకీ ఇచ్చా నంటూ డబ్బాలు కొట్టుకోవడం తప్ప ప్రజలకు పవన్ కల్యాణ్ చేసిందేమీలేదని ఎద్దేవా చేశారు. గతంలో 30 వేల మంది ఆడపిల్లలు అదృశ్యమయ్యారని ఆరోపించి, ఇప్పుడేమి చేస్తున్నారని ప్రశ్నించారు.
దెబ్బకు దెబ్బ తప్పదు
తమ పార్టీ శ్రేణులపై దాడులకు పాల్పడుతూ.. తప్పుడు కేసులతో ఎవరైతే ఇబ్బందులకు గురిచేస్తున్నారో.. తాము అధికారంలోకి వచ్చాక వారికి దెబ్బకు దెబ్బ తప్పదని హెచ్చరించారు. తనపై ఆరోపణలు చేస్తున్న సోమిరెడ్డి తన సవాల్‌ను స్వీకరించి బహరంగ చర్చకు రావాలని డిమాండ్ చేస్తే, తోకముడిచి పారిపోతున్నారని విమర్శించారు.
మహిళలకు కనీస మర్యాద లేదు
ప్రస్తుత ప్రభుత్వంలో మహిళలకు కనీస మర్యాదలేదని పార్టీ మహిళా విభాగ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత ఆరోపించారు. సూపర్‌సిక్స్ లో నాలుగు హామీలు మహిళలకు అని చెప్పి, వారికి వెన్నుపోటు పొడిచారని మండిపడ్డారు. నేతలు బొమ్మిరెడ్డి హరగోపాల్‌రెడ్డి గుండాల ఆదినారాయణ, కడివేటి చంద్రశేఖర్‌రెడ్డి, ముంగర రవీందర్‌రెడ్డి, మారంరెడ్డి ప్రదీప్‌రెడ్డి, చిట్టమూరు అజయ్‌రెడ్డి, దాసరి భాస్కర్‌గౌడ్, గుండాల వజ్రమ్మ, చిట్టమూ రు అనితమ్మ, గుమ్మడి వెంకటసుబ్బయ్య, చేడిమా ల బుజ్జిరెడ్డి, ఆవుల తులసీరామ్, గుంజి రమేష్, జానకిరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


