మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డిపై అక్రమ కేసు | - | Sakshi
Sakshi News home page

మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డిపై అక్రమ కేసు

Jun 10 2026 12:49 AM | Updated on Jun 10 2026 12:49 AM

కావలి: మంత్రి లోకేశ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మాజీ ఎమ్మె ల్యే, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కావలి నియోజకవర్గ ఇన్‌చార్జి రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డిపై పట్టణ పోలీస్‌స్టేషన్లో టీడీపీ నేతలు సోమవారం ఫిర్యాదు చేశారు. దీంతో అక్రమ కేసును పోలీసులు మంగళవారం నమోదు చేశారు. కూటమి ప్రభుత్వం కొలువుదీరిన నాటి నుంచి కావలి నియోజకవర్గంలో అక్రమాలకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో చెరువులు, గుంటలు, వాగులు, వంకలు ఇలా ఎక్కడపడితే అక్కడ గ్రావెల్‌, మట్టి అక్రమ తవ్వకాలను యథేచ్ఛగా సాగిస్తున్నారు. ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులను బనాయించడమే కాకుండా దాడులకు తెగబడుతున్నారు. కూటమి నేతలు కొందరు స్థానిక ఎమ్మెల్యే అండదండలతో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంలో భాగంగా అక్రమ లేఅవుట్లు వేసి అందులో ఉన్న ప్రభుత్వ భూములు, కాలువలను ఆక్రమిస్తున్నారు. దీంతో నియోజకవర్గంలో సభలు, సమావేశాలను మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి కొన్ని రోజులుగా ఏర్పాటు చేసి అవినీతి, అక్రమాలపై ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏమి చేయాలో పాలుపోక మంత్రి లోకేశ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ టీడీపీ నేతలు ఫిర్యాదు చేయడంతో కేసును నమోదు చేశారు. ఇదే సమయంలో ప్రతాప్‌కుమార్‌రెడ్డిపై సోషల్‌ మీడియా వేదికగా టీడీపీ నేతలు, కార్యకర్తలు అసభ్యంగా వ్యవహరిస్తూ పోస్టులు పెడుతున్నారు. కవ్వింపు చర్యలకు పాల్పడుతూ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నారు. నియోజకవర్గంలోని కావలి, అల్లూరు, దగదర్తి, బోగోలు మండలాల్లో టీడీపీ నేతలపై మంగళవారం ఫిర్యాదు చేసినా, ఇంతవరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. ఈ తరుణంలో మాజీ ఎమ్మెల్యేపై కేసు నమోదు చేయడమేమిటని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు టీడీపీ నేత, ఏరియా వైద్యశాల అభివృద్ధి కమిటీ డైరెక్టర్‌ చవల రామకృష్ణ.. విజిలెన్స్‌ అధికారుల విధులకు ఆటంకం కలిగించి వారిపై దురుసుగా వ్యవహరించడంతో విజిలెన్స్‌ సీఐ స్వయంగా వెళ్లి పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఘటన జరిగి వారమైనా, నిందితుడు రామకృష్ణ నిర్భయంగా సభలు, సమావేశాల్లో పాల్గొంటున్నారు. కూటమి ప్రభుత్వానికో న్యాయం, ప్రతిపక్షానికో న్యాయమా అంటూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు, ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

జెడ్పీ సర్వసభ్య

సమావేశం నేడు

నెల్లూరు(పొగతోట): జెడ్పీ సాధారణ సర్వసభ్య సమావేశాన్ని నగరంలోని జెడ్పీ కార్యాలయంలో బుధవారం మధ్యాహ్నం 2.30కు నిర్వహించనున్నామని సీఈఓ శ్రీధర్‌రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. చైర్‌పర్సన్‌ ఆనం అరుణమ్మ అధ్యక్షతన సమావేశాన్ని నిర్వహించనున్నామని వివరించారు. జెడ్పీ సభ్యులు, ఆయా శాఖల జిల్లా అధికారులు తప్పక హాజరుకావాలని కోరారు.

డీఆర్సీ మీటింగ్‌ నేడు

నెల్లూరు రూరల్‌: జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఫరూక్‌ నెల్లూరులో బుధవారం పర్యటించనున్నారని కలెక్టర్‌ హిమాన్షు శుక్లా తెలిపారు. జెడ్పీ కార్యాలయంలో ఉదయం పది నుంచి మధ్యాహ్నం రెండు వరకు నిర్వహించనున్న డీఆర్సీ సమావేశానికి మంత్రి హాజరుకానున్నారని చెప్పారు. సంబంధిత శాఖల అధికారులు పూర్తి స్థాయిలో సన్నద్ధంగా ఉండాలని సూచించారు.

విమానంలో

మృతదేహాల తరలింపు

ఆత్మకూరు: వారణాశితో పాటు పలు పుణ్యక్షేత్రాలకు బస్సులో వెళ్తూ బిహార్‌లోని ఔరంగాబాద్‌ వద్ద ఆత్మకూరు, సంగం, తదితర ప్రాంతాలకు చెందిన వారు ఘోర ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఘటనలో ముగ్గురు మృతి చెందగా, 15 మంది గాయపడ్డారు. ఈ క్రమంలో అక్కడి ప్రభుత్వాధికారులతో రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడి మృతదేహాలు, యాత్రలోని మిగిలిన ప్రయాణికులను స్వస్థలాలకు తరలించేలా ఏర్పాట్లు చేశారు. ముగ్గురి మృతదేహాలను విమానాల్లో చైన్నెకు.. ఆపై స్వస్థలాలకు చేరేలా ఏర్పాట్లు చేశారని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి కార్యాలయం పేర్కొంది. తీవ్రంగా గాయపడిన వారికి పట్నా మెడికల్‌ కళాశాల ఆస్పత్రిలో మెరుగైన చికిత్సను అందిస్తున్నారని చెప్పారు.

చైన్నె విమానాశ్రయానికి అధికారులు

సంగం: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సంగానికి చెందిన వెంకటేశ్వర్లు, హజరత్తయ్య భౌతికకాయాలను స్వగ్రామానికి తీసుకొచ్చేలా చర్యలను వేగవంతం చేశారు. మృతదేహాలను స్వీకరించి సంగం మండలానికి తరలించేందుకు గానూ చైన్నె విమానాశ్రయానికి తహసీల్దార్‌ అంబటి వెంకటేశ్వర్లు, ఎస్సై భోజ్యా నాయక్‌ చేరుకున్నారు. అన్ని ప్రక్రియలు పూర్తయిన అనంతరం ప్రత్యేక వాహనంలో తరలించనున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement