అనర్హులకు అందలం..! | - | Sakshi
Sakshi News home page

అనర్హులకు అందలం..!

Jun 10 2026 12:49 AM | Updated on Jun 10 2026 12:49 AM

నెల్లూరు(టౌన్‌): క్రీడా రంగంలో అనర్హులను అందలం ఎక్కిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. జాతీయ విద్యాసంస్థలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో క్రీడాకారులకు 3 శాతం రిజర్వేషన్‌ కల్పించడంతో క్రీడా సర్టిఫికెట్లకు అధిక ప్రాధాన్యం ఏర్పడింది. తాజాగా నెల్లూరు జిల్లా క్రికెట్‌ జట్టు ఎంపికల్లోనూ ప్రతిభావంతులైన క్రీడాకారులకు అన్యాయం జరిగిందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జిల్లా క్రికెట్‌ జట్టు ఎంపికలను మొక్కుబడిగా నిర్వహించారని సమాచారం. జట్టు ఎంపికలో వయస్సు తక్కువ, ప్రతిభ లేని క్రీడాకారులను ఎంపిక చేశారంటూ పలువురు ఆరోపిస్తున్నారు. రాజకీయ పలుకుబడి, రూ.లక్షల లావాదేవీల కారణంగా ప్రతిభ లేకున్నా కొందరికి జిల్లా జట్టులో స్థానం కల్పించారని ప్రచారం జరుగుతోంది. క్రికెట్‌ జట్ల ఎంపికల్లో ఓ అజ్ఞాత వ్యక్తి కీలక పాత్ర పోషిస్తున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి.

గత నెలలో జట్టు ఎంపికలు

నెల్లూరులోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో వివిధ విభాగాల క్రికెట్‌ జట్ల ఎంపికలు జరుగుతున్నాయి. గత నెల 10వ తేదీన అండర్‌ – 16 బాలుర జిల్లా క్రికెట్‌ జట్టు ఎంపికలు నిర్వహించారు. దీనికి సంబంధించి గత నెల 5వ తేదీన మీడియాకు ప్రకటన విడుదల చేశారు. అందులో 2010 సెప్టెంబర్‌ ఒకటి నుంచి 2011 సెప్టెంబర్‌ ఒకటో తేదీ మధ్య జన్మించిన వారే అర్హులని పేర్కొన్నారు. క్రీడాకారులు ఆధార్‌కార్డు, జనన ధ్రువీకరణ పత్రం (ఫారం 5) తప్పనిసరిగా తీసుకురావాలని సూచించారు. ఎంపికల అనంతరం 16 మంది ప్రధాన జట్టుకు, మరో నలుగురిని స్టాండ్‌బైగా ఎంపిక చేసి మొత్తం 20 మంది క్రీడాకారులతో జిల్లా జట్టును ఖరారు చేశారు. ఇది బుధవారం నుంచి చిత్తూరు జిల్లా వాయల్పాడులో జరిగే అంతర్‌ జిల్లాల పోటీల్లో పాల్గొననుంది.

వారికి మొండిచేయి

జిల్లా క్రికెట్‌ జట్టు ఎంపికలను మొక్కుబడిగా నిర్వహించి ప్రతిభావంతులైన క్రీడాకారులను పక్కనపెట్టి, అర్హత లేని వారిని ఎంపిక చేశారన్న విమర్శలున్నాయి. అంతేకాకుండా అర్హత నిబంధనలకు విరుద్ధంగా వయసు తక్కువ ఉన్న క్రీడాకారులను ఎంపిక చేయడం చర్చనీయాంశంగా మారింది. జిల్లా జట్టులో సీహెచ్‌ వెంకటకార్తి (12–04–2012), బి.సనత్‌రెడ్డి (29–01–2012), జి.శ్రేయాన్స్‌రెడ్డి (29–03–2012)ను ఎంపిక చేయడంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నిబంధనల ప్రకారం అర్హత లేకపోయినా వీరిని అండర్‌ 16 జట్టుకు ఎలా ఎంపిక చేశారనే అంశంపై క్రీడావర్గాల్లో చర్చ జరుగుతోంది.

డబ్బు, రాజకీయ పలుకుబడితో..

వయస్సు తక్కువతోపాటు ప్రతిభ లేని, రాజకీయ పలుకబడి గల క్రీడాకారులను ఎంపిక చేశారన్న విమర్శలున్నాయి. అధికార పార్టీకి చెందిన వివిధ నియోజకవర్గాల ఎమ్మెల్యేల ప్రోద్బలం ఉందన్న ప్రచారం జరుగుతోంది. జట్టులోకి తీసుకోవాలని నేరుగా అసోసియేషన్‌ నేతలకు ఫోన్‌ చేసినట్లు తెలిసింది. ఎంపికై న కొందరి నుంచి నుంచి రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల చొప్పున తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. జట్టులో కూడా వారికి ప్రాధ్యనత ఇచ్చేలా హామీ ఇచ్చినట్లు తెలిసింది. ఒకరిద్దరు క్రీడాకారులను ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేల సిఫార్సుతో జట్టులో తీసుకున్నారని ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై పలువురు క్రీడాకారుల తల్లిదండ్రులు నేరుగా ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్‌కు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఎన్నో ఏళ్లుగా ఆటనే నమ్ముకుని రేయింబవళ్లు ప్రాక్టీస్‌ చేసి తీరా జట్టులో ఎంపిక కాకపోవడంతో పలువురు క్రీడాకారులు చేసేదేమీలేక లోలోన మదనపడుతున్న పరిస్థితి ఉంది. ఎంపికలను అసోసియేషన్లకు వదిలిపెట్టకుండా కలెక్టర్‌ కూడా దృష్టి సారిస్తే ప్రతిభ గల వారికి న్యాంయ జరుగుతుందని చెబుతున్నారు. ఇప్పటికై నా అన్ని రకాల క్రీడా విభాగాల్లో నిజాయితీగా ఎంపికలు నిర్వహించి అర్హులకు అవకాశం కల్పించాలనే డిమాండ్‌ వినిపిస్తోంది.

● దీనిపై నెల్లూరు జిల్లా క్రికెట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు రాజశేఖరరెడ్డి స్పందిస్తూ ఎంపికలు సక్రమంగా నిర్వహించామన్నారు.

● కోచ్‌ జుల్కర్‌ మాట్లాడుతూ జిల్లా జట్టు ఎంపికలో వయస్సు ఎక్కువ గలవారు ఉండకూడదని, తక్కువ ఉన్నా ఎంపిక చేసుకోవచ్చన్నారు. అయితే ప్రెస్‌నోట్‌లో వయస్సుకు సంబంధిత తేదీలు ప్రకటించారని అడగ్గా ఒకసారి పరిశీలిస్తానని సమాధానమిచ్చారు.

గత నెలలో అండర్‌ – 16 బాలుర జిల్లా క్రికెట్‌ జట్టు ఎంపికలు

వయసు తక్కువ ఉన్నవారికి అవకాశం

డబ్బులు, రాజకీయ ప్రోద్బలంతో ఎంపిక చేశారన్న విమర్శలు

ప్రతిభలేని క్రీడాకారుల ఎంపికకు

రూ.5 లక్షల వసూలు?

ఏసీఏకి తల్లిదండ్రుల ఫిర్యాదు

నేటి నుంచి అంతర్‌ జిల్లాల క్రికెట్‌ పోటీలు

Advertisement
 
Advertisement
Advertisement