● సన్నిహితుడే హంతకుడు
● ఆపై పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయిన
వైనం
నెల్లూరు(క్రైమ్): నెల్లూరు నగరంలో పట్టపగలు మహిళ దారుణ హత్యకు గురైంది. సన్నిహితంగా ఉంటున్న వ్యక్తే అనుమానంతో ఆమెను కడతేర్చాడు. అనంతరం నిందితుడు పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు. పోలీసుల కథనం మేరకు.. కనుపర్తిపాడుకు చెందిన రేవతి (35)కి సుమారు 18 సంవత్సరాల క్రితం సుమన్ అనే వ్యక్తితో వివాహమైంది. వీరికి ఇద్దరు సంతానం. విభేదాల నేపథ్యంలో ఐదేళ్ల క్రితం రేవతి భర్త నుంచి విడిపోయింది. ఆమె పిల్లలతో కలిసి కనుపర్తిపాడులో తండ్రి వద్ద ఉంటోంది. ఈక్రమంలో అదే ప్రాంతానికి చెందిన కడప శ్రీకాంత్‌తో ఆమెకు పరిచయమైంది. ఇద్దరూ సన్నిహితంగా ఉంటున్నారు. ఇటీవల ఆమె మరొకరితో మాట్లాడుతుందన్న అనుమానంతో శ్రీకాంత్ తరచూ గొడవ పడేవాడు. ఎలాగైనా రేవతిని అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు.
కత్తితో పొడిచి..
మంగళవారం రేవతి కొండాయపాళెంలోని ఓ భవనంలో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్న తన తండ్రికి భోజనం బాక్స్ ఇచ్చి స్కూటీలో పెట్రోల్ పట్టించుకుని వెళ్తానని బయటకు వచ్చింది అక్కడ శ్రీకాంత్ ఆమెను కలిశాడు. ఇద్దరూ పడారుపల్లి చెరువుకట్ట రేవు వద్దకు వెళ్లారు. వారి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. శ్రీకాంత్ తన వెంట తెచ్చుకున్న కత్తితో రేవతిపై పలుమార్లు పొడవడంతో అక్కడికక్కడే మృతిచెందింది. అనంతరం నిందితుడు నేరుగా వేదాయపాళెం పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి తాను ఓ మహిళను హత్య చేశానని జరిగిన విషయం చెప్పాడు. ఇన్‌స్పెక్టర్ కె.శ్రీనివాసరావు తన సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని జీజీహెచ్ మార్చురీకి తరలించారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. నిందితుడి కాలికి గాయమై ఉండటంతో అతడిని చికిత్స నిమిత్తం జీజీహెచ్‌లో చేర్పించినట్లు ఇన్‌స్పెక్టర్ చెప్పారు.
మద్యానికి బానిసై.. పెట్రోల్ పోసుకుని..
● వ్యక్తి ఆత్మహత్యాయత్నం
నెల్లూరు సిటీ: మద్యానికి బానిసైన ఓ వ్యక్తి పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన సౌత్‌మోపూరులో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. రూరల్ పరిధిలోని అంబాపురంలో నివాసముంటున్న కార్తీక్ (35), జ్యోతికి ఎనిమిదేళ్ల కుమార్తె ఉంది. ఆ ప్రాంతంలోని కొలిమిలో పనిచేస్తున్న కార్తీక్ మద్యానికి బానిసై అప్పుల పాలయ్యాడు. భార్య ఎంత చెప్పినా మార్పు రాకపోవడంతో వీరి మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో భార్య తన బిడ్డతో కలిసి సౌత్‌మోపూరులోని పుట్టింటికెళ్లింది. ఎన్నిసార్లు అడిగినా ఆమె ఇంటికి రాకపోవడంతో కార్తీక్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. భార్య ఇంటికి రాలేదనే కారణంతో ఫూటుగా మద్యం తాగి, అత్తింటికి వెళ్లి వారిని బెదిరించే క్రమంలో పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. మంటల్లో చిక్కుకున్న అతడిని స్థానికులు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతున్నాడు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని విచారణ చేపట్టారు. రూరల్ సీఐ వేణు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
సీఏఎం హైస్కూల్లో
అగ్నిప్రమాదం
నెల్లూరు(క్రైమ్): నెల్లూరు నగరంలో కొన్నేళ్లుగా మూతబడిన సీఏఎం హైస్కూల్లో మంగళవారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్కూల్లోని కిటికీలు, తలుపులు, పేరుకుపోయిన చెత్తాచెదారాలు తగులబడ్డాయి. దట్టమైన పొగలు రావడాన్ని గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. గతంలోనూ ఇదే తరహాలో అగ్నిప్రమాదం జరిగినట్లు సమాచారం. ప్రమాదానికి గల కారణాలు తెలియరావాల్సి ఉంది. ఆకతాయిలు పనిగా అందరూ అనుమానిస్తున్నారు. కొన్నేళ్లుగా స్కూల్ మూతపడి ఉండటంతో ఆకతాయిలు, గుర్తుతెలియని వ్యక్తులకు ఈ ప్రాంతం అడ్డాగా మారింది.
వంట చేస్తుండగా..
● చీరకు నిప్పంటుకుని వృద్ధురాలికి
తీవ్ర గాయాలు
కోవూరు: మండలంలోని పాటూరు పంచాయతీ పరిధిలోని చెంచమ్మ కాలనీలో ఓ వృద్ధురాలు ఇంటి వద్ద వంట చేస్తుండగా ప్రమాదవశాత్తు చీరకు నిప్పంటుకుని తీవ్రంగా గాయపడింది. స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. తిరువల్లూరు యానాదమ్మ (70) మంగళవారం ఉదయం తన ఇంటి వద్ద పొయ్యిపై వంట చేస్తోంది. ఈ క్రమంలో గాలికి చీర కొంగు పొయ్యిలో పడింది. దీంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించి చీరకు అంటుకున్నా యి. మంటలను ఆర్పేందుకు ఆమె ప్రయత్నించినప్పటికీ అప్పటికే తీవ్ర గాయాలయ్యాయి. యానాదమ్మ పెద్దగా కేకలు వేయడంతో స్థానికులు మంటల్ని ఆర్పారు. సమాచారం అందుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని బాధితురాలికి ప్రథమ చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం నెల్లూరు ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రికి తరలించారు.
నిమ్మ ధరలు (కిలో)
పెద్దవి : రూ.50
సన్నవి : రూ.20
పండ్లు : రూ.10


