రెండేళ్ల కూటమి పాలనలో విధ్వంసం | - | Sakshi
Sakshi News home page

రెండేళ్ల కూటమి పాలనలో విధ్వంసం

Jun 10 2026 12:49 AM | Updated on Jun 10 2026 12:49 AM

వైఎస్సార్‌సీపీ సిటీ ఇన్‌చార్జి,

ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డి

నెల్లూరురూరల్‌: ‘కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనలో విధ్వంసం తప్ప ఏమీ లేదు. చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేశారు’ అని వైఎస్సార్‌సీపీ సిటీ ఇన్‌చార్జి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నెల్లూరు నగరంలోని 16వ డివిజన్‌ జగదీష్‌ నగర్‌లో ఉన్న శ్రీకన్వెన్షన్‌ హాల్లో మంగళవారం ‘చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు’ కార్యక్రమం జరిగింది. దీనికి అధ్యక్షత వహించిన ఎమ్మెల్సీ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ప్రకటించిన సూపర్‌ సిక్స్‌ హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేయలేదని విమర్శించారు. మహిళలకు నెలకు రూ.1,500, యువతకు నిరుద్యోగ భృతి వంటి పథకాలు ఇప్పటికీ అమలు కాలేదన్నారు. మెగా డీఎస్సీలో అక్రమాలు జరిగాయని, అర్హులైన అభ్యర్థులకు అన్యాయం జరిగిందని ఆరోపించారు. రాబోయే రోజుల్లో కూడా ప్రజా సమస్యలపై పోరాటం కొనసాగిస్తామన్నారు. పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరల పెరుగుదలతో సామాన్యులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష కార్యకర్తలపై అక్రమ కేసులు నమోదు చేసి వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఎరువులు, పురుగు మందుల సరఫరాలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ఈనెల 12న రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు పేరుతో నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

● నెల్లూరు నగర నియోజకవర్గ పరిశీలకుడు కొండ్రెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ రెండేళ్ల పాలనలో ప్రజలను నిరాశపరిచే విధానాలను కూటమి అమలు చేసిందన్నారు. వైఎస్సార్‌సీపీ హయాంలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ వైద్య కళాశాలలు, నాడు – నేడు పనులు, గ్రామ, వార్డు సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలను నిర్వీర్యం చేశారని విమర్శించారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర, జిల్లా నాయకులు, కార్పొరేటర్లు, డివిజన్‌ ఇన్‌చార్జిలు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement