నెల్లూరురూరల్: రాష్ట్రంలో బీసీల జనాభా నిష్పత్తికి అనుగుణంగా స్థానిక సంస్థల్లో 44 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ప్రత్యేక బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించాలని అఖిల భారత ఓబీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు అంగిరేకుల వరప్రసాద్ యాదవ్ డిమాండ్ చేశారు. మంగళవారం నెల్లూరులోని ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2027లో సమగ్ర బీసీ కులాల జనగణన పూర్తయ్యే వరకు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించరాదని ఆయన కోరారు. బీసీ కులవృత్తిదారులకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు బ్యాంక్ లింకేజ్ రుణాల కోసం ప్రభుత్వం రూ.430 కోట్లు విడుదల చేయాలన్నారు. ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాథోడ్ సుజాన్ సింగ్ మాట్లాడుతూ ఎన్నికల హామీ మేరకు 50 సంవత్సరాల వయస్సు నిండిన బీసీలకు పింఛన్ పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఓబీసీ విద్యార్థి, యువజన సంఘం రాష్ట్ర కన్వీనర్ ఉల్లిపాయల మురళీకృష్ణ యాదవ్ మాట్లాడుతూ రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు సుమారు రూ.2,000 కోట్లను ఇవ్వాలన్నారు. లేకపోతే ఈనెల 27న విద్యాశాఖ కమిషనరేట్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. సమావేశంలో నేతలు ఉన్నవ సుబ్బారావు, పేరయ్య, రమాదేవి, ప్రదీప్ యాదవ్, సుధీర్, రవి, హరికష్ణ, సునీల్ పాల్గొన్నారు.


