సర్టిఫికెట్లు ఇస్తేనే వెళ్తాం | - | Sakshi
Sakshi News home page

సర్టిఫికెట్లు ఇస్తేనే వెళ్తాం

Jun 10 2026 12:49 AM | Updated on Jun 10 2026 12:49 AM

ప్రభుత్వాస్పత్రిలో బాధితుల ఆందోళన

దిగొచ్చిన అధికారులు

నెల్లూరు(అర్బన్‌): పదిరోజలుగా బర్త్‌, డెత్‌ సర్టిఫికెట్లు పంపిణీ నిలిచిపోవడంతో మంగళవారం బాధితులు పెద్దసంఖ్యలో నెల్లూరులోని ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. కాళ్లరిగేలా తిరుగుతున్నామని, వీటి కోసం ఇంకెన్ని రోజులు తిప్పుకొంటారని ఆందోళనకు దిగారు. ఆస్పత్రి ఎదుట పలువురు బైఠాయించారు. మంగళవారం ఇస్తామని ఆపరేటర్‌ చెప్పారని, ఇప్పుడు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. దీంతో మధ్యాహ్నం 12 గంటలకు ఆపరేటర్‌ వస్తారని, అప్పుడు సర్టిఫికెట్లు ఇస్తామని ఉద్యోగులు చెప్పడంతో శాంతించారు. అయితే మధ్యాహ్నం దాటినా అతను రాకపోవడంతో బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. సర్టిఫికెట్లు ఇస్తేనే వెళ్తామని భీష్మించుకున్నారు. ఉద్యోగులతో వాగ్వాదానికి దిగారు. దీంతో జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ మాధవి, ఏడీ ఏడుకొండలు, అభివృద్ధి కమిటీ సభ్యులు శ్రీనివాసులు, బ్రహ్మారెడ్డి, మల్లికార్జున్‌లు బాధితులతో మాట్లాడారు. తాత్కాలికంగా ఇద్దరు ఆపరేటర్లను ఏర్పాటు చేసి బర్త్‌, డెత్‌ సర్టిఫికెట్లను పంపిణీ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement