కాశీ యాత్ర మిగిల్చిన శోకం | - | Sakshi
Sakshi News home page

కాశీ యాత్ర మిగిల్చిన శోకం

Jun 9 2026 9:16 AM | Updated on Jun 9 2026 9:16 AM

వారంతా కాశీ విశ్వనాథుని కనులారా చూసి తరించాలనుకున్నారు. గంగమ్మ ఒడిలో స్నాన మాచరించి పితృదేవతలకు పిండ ప్రదానాలు చేసి జన్మధన్యం చేసుకోవాలని ఆశ పడ్డారు. ప్రత్యేక బస్సులో కాశీయాత్రకు బయల్దేరారు. పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటూ కాశీ సమీపానికి చేరుకున్నారు. ఆదివారం రాత్రి బిహార్‌ రాష్ట్రంలో బుద్ధగయాను దర్శించుకుని బయల్దేరారు. సోమవారం ఉదయానికి కాశీకి చేరుకుంటున్నామనే సంతోషంతో శివనామస్మరణ చేసుకుంటూ నిద్రలోకి జారుకున్నారు. కానీ విధి మరోలా తలచింది. లారీ రూపంలో మృత్యువు ముగ్గురిని శాశ్వతంగా శివయ్య వద్దకు చేర్చింది. మరికొందరికి విషాదాన్ని మిగిల్చింది.

బంధువులు వెళ్తున్నారని..

ఆత్మకూరు: పట్టణంలోని వీవర్స్‌కాలనీకి చెందిన తూమా ప్రసాద్‌, పద్మావతి (43) దంపతులు. వారికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె సంతానం. వ్యాపారరీత్యా కోవూరులో ఉంటున్నారు. టూర్‌ నిర్వాహకుడు వెంకటేశ్వర్లు కూడా బాగా తెలిసిన వ్యక్తి కావడం.. బంధువులు వెళ్తున్నామని చెప్పడంతో పద్మావతి భర్తను ఒప్పించి కాశీయాత్రకు బయలుదేరి వెళ్లింది. శివయ్యను దర్శించుకోకుండానే బస్సు ప్రమాదంలో ఆమె మృత్యువాత పడడంతో వీవర్స్‌ కాలనీలో నివాసం ఉంటున్న అత్తా, మామలు తమ మనవడు, మనవరాలిని ఎవరు చూసుకోవాలని గుండెలు పగిలేలా రోదిస్తున్నారు.

వంట సహాయకుడిగా వెళ్లి..

సంగానికి చెందిన హజరత్తయ్య, గోవిందమ్మ దంపతులు. వారికి ఇద్దరు సంతానం. కుమార్తెకు వివాహమైంది. కుమారుడికి ఇంకా వివాహం కాలేదు. మృతుడు హజరత్తయ్య వంట సహా యకుడిగా బస్సులో వెళ్లి ప్రమాదంలో మృత్యువాత పడ్డారు. మృతుడు వంట పనులు లేని సమయంలో బస్టాండ్‌లో సమోసాలు అమ్ముకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. కుటుంబానికి పెద్దదిక్కు అయిన హజరత్తయ్య మృత్యువాత పడిన విషయం తెలుసుకుని భార్య గోవిందమ్మ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

సంగం: సంగంలోని ఆంజనేయస్వామి దేవస్థానం నుంచి ఈ నెల 1న టూరిస్ట్‌ బస్సు 15 రోజుల కాశీయాత్రకు బయలుదేరింది. సంగం, ఆత్మకూరు, దుత్తలూరు ప్రాంతాలకు చెందిన 39 మంది యాత్రికులు, యాత్ర నిర్వాహకుడు, ఇద్దరు డ్రైవర్లు, వంట సిబ్బంది కలిపి మొత్తం 43 మందితో బస్సు అన్నవరం, సింహాచలం, పూరి, భువనేశ్వర్‌ మీదుగా ఆదివారం రాత్రి బిహార్‌ రాష్ట్రం బుద్ధగయాకు చేరుకుంది. అక్కడ బుద్ధగయా క్షేత్రాన్ని దర్శించుకున్నారు. రాత్రి భోజనాల అనంతరం కాశీకి బయలు దేరారు. అర్ధరాత్రి 12.10 గంటల సమయంలో ఔరంగాబాద్‌ జిల్లాలో రోడ్డు పక్కన ఆగిఉన్న లారీని బస్సును అదుపుతప్పి ఢీకొంది. ఈ ఘటనలో ఆత్మకూరు, సంగానికి చెందిన ముగ్గురు దుర్మరణం పాలవగా, మరో 10 మందికి పైగా తీవ్రంగా, మరికొందరు స్వల్పంగా గాయపడ్డారు. మృతుల్లో సంగానికి చెందిన యాత్ర నిర్వాహకుడు, విశ్రాంత ఆర్టీసీ కండక్టర్‌ పసుపులేటి వెంకటేశ్వర్లు (64), వంట మాస్టర్‌ చవడం హజరత్తయ్య (57), ఆత్మకూరుకు చెందిన సోమా పద్మావతి (43) ఉన్నారు. తీవ్రంగా గాయపడిన వారిలో సంగానికి చెందిన బొమ్మిశెట్టి వెంకటేశ్వర్లు, లక్ష్మమ్మ, నీలం శీనయ్య, పద్మ, వింజమూరు శివరంగయ్య, లక్ష్మమ్మ, దంపతులు, కంటాబత్తిన సంపూర్ణమ్మ, కంటాబత్తిన కామాక్షమ్మ, గురవయ్య, డీ రమణ మ్మ, జీ శ్రీదేవి, డీ మల్లేశ్వరి ఉన్నారు. ఆత్మకూరు, దుత్తలూరుకు చెందిన పలువురు యాత్రికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. కాగా వెంకటేశ్వర్లు, హజరత్తయ్య, సోమా పద్మావతి మృతదేహాలకు పోస్టుమార్టంను అక్కడి అధికారులు పూర్తి చేశారు.

భాష రాక ఇబ్బందులు

క్షతగాత్రులను చికిత్స నిమిత్తం గయాలోని మగధ మెడికల్‌ కళాశాలకు తరలించారు. క్షతగాత్రులకు హిందీ భాష రాకపోవడంతో ఇబ్బందులు పడ్డారు. అయినా వైద్యులు క్షతగాత్రులకు చికిత్స అందించి ప్రాణాలను కాపాడారు. ఆహారం లేక ఇబ్బందులు

క్షతగాత్రులను అర్ధరాత్రి ఆస్పత్రికి తరలించారు. అయితే అక్కడ సరైన ఆహారం దొరక్క ఆకలితో అలమటించారు. కొందరు పండ్లు తిని ఆకలి తీర్చుకున్నారు.

సంగంలో విషాద ఛాయలు

కాశీయాత్రకు వెళ్లిన వారిలో సంగం వాసులు 20 మందికి పైగా ఉన్నారు. సోమవారం వేకువజామున బస్సు ప్రమాద విషయం తెలియడంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. సంగం వాసులు ఇద్దరు మృతి చెందడంతో వారి కుటుంబ సభ్యులు, బంధువులు విషాదంలో మునిగిపోయారు. సంగం నుంచి బయలుదేరిన వారు గాయపడడం కలిచివేసింది.

విహారయాత్రలు నిర్వహిస్తూ..

సంగానికి చెందిన పసుపులేటి వెంకటేశ్వర్లుకు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఒక కుమార్తెకు వివాహామైంది. కుమారుడు, కుమార్తెకు వివాహాం కావాల్సి ఉంది. ప్రస్తుతం కుటుంబంతో కలిసి నెల్లూరులోని దర్గామిట్టలో నివాసం ఉంటున్నారు. మృతుడు టూరిస్ట్‌ బస్సుతో విహార యాత్రలు నిర్వహిస్తున్నారు. ఈ ప్రమాదంలో వెంకటేశ్వర్లు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు.

విక్రమ్‌రెడ్డి, రాజారెడ్డి దిగ్భ్రాంతి

కాశీయాత్రకు బయలుదేరిన టూరిస్ట్‌ బస్సు బిహార్‌ రాష్ట్రంలోని ఔరంగబాద్‌ జిల్లాలో ప్రమాదానికి గురై ఆత్మకూరు, ఉదయగిరి నియోజకవర్గాలకు చెందిన ముగ్గురు మృతి చెందడంతో పాటు మరో 15 మంది తీవ్రంగా గాయపడిన విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డి, ఉదయగిరి వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రభుత్వం క్షతగాత్రులకు మెరుగైన వైద్యంతో పాటు మిగిలిన యాత్రికులను క్షేమంగా స్వస్థలాలకు చేర్చేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.

సంగం నుంచి వెళ్లిన 43 మంది యాత్రికులు

బిహార్‌లో ఆగిఉన్న లారీని ఢీకొన్న బస్సు

జిల్లా వాసులు ముగ్గురు దుర్మరణం

మృతుల్లో సంగం, ఆత్మకూరు వాసులు

మరో 15 మందికి తీవ్ర గాయాలు

స్వల్ప గాయాలతో బయటపడిన పలువురు

స్వల్పగాయాలతో..

దుత్తలూరు: బిహార్‌లో జరిగిన బస్సు ప్రమాదంలో మండలంలోని రాచవారిపల్లి గ్రామానికి చెందిన 8 మంది స్వల్పగాయాలతో బయటపడ్డారు. గ్రామానికి చెందిన చలంచర్ల అలివేలమ్మ, షేక్‌ కాశింబీ, మోత్కూరు లలితమ్మ, మోత్కూరు కాంతమ్మ, ముసుర్ల జయమ్మ, అండ్రా రాధా, షేక్‌ ఖాజమ్మ, కొంకల సుబ్బరత్నమ్మకు గాయాలయ్యాయి. ప్రస్తుతం వీరి పరిస్థితి నిలకడగా ఉంది. బస్సు ప్రమాదం విషయం తెలుసుకుని కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. ఫోన్‌ ద్వారా సమాచారాన్ని తెలుసుకుని ఊరట చెందారు.

Advertisement
 
Advertisement
Advertisement