డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలి | - | Sakshi
Sakshi News home page

డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలి

Jun 9 2026 9:16 AM | Updated on Jun 9 2026 9:16 AM

నెల్లూరురూరల్‌: మెగా డీఎస్సీ–2025 పరీక్షల నిర్వహణలో అవినీతి ఆరోపణలు, లీకేజీలు, అక్రమాలపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్‌ ఆధ్వర్యంలో కలెక్టర్‌ హిమాన్షు శుక్లాకు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో సోమవారం వినతిపత్రం అందజేశారు. ఎస్సీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు పందిటి కామరాజు మాట్లాడుతూ డీఎస్సీ 2025 నిరుద్యోగ యువత భవిష్యత్‌కు సంబంధించి కీలక పరీక్ష డీఎస్సీలో ప్రశ్నపత్రాల భద్రత, పరీక్షల నిర్వహణ, స్పోర్ట్స్‌ కోటా ఎంపికలు, సర్టిఫికెట్ల పరిశీలన వంటి అంశాలపై నిష్పక్షపాత దర్యాప్తు చేపట్టాలని కోరారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, పేద నిరుద్యోగ అభ్యర్థులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

సచివాలయ ఉద్యోగులపై పనిభారం

నెల్లూరు(పొగతోట): సర్వేలు, ఇంటింటా కార్యక్రమాలు, కేవైసీలు తదితర అదనపు బాధ్యతలతో సచివాలయ ఉద్యోగులపై తీవ్ర పనిభారం పడుతోందని యునైటెడ్‌ వెల్ఫేర్‌ జీఎస్‌డబ్ల్యూఎస్‌ గవర్నమెంట్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షురాలు రాజ్యలక్ష్మి తెలిపారు. సోమవారం నెల్లూరు కలెక్టరేట్‌లో జేసీ మొగిలి వెంకటేశ్వర్లుకు వినతిపత్రం సమర్పించిన అనంతరం ఆమె మాట్లాడారు. సచివాలయ ఉద్యోగులకు ఆటోమేటిక్‌ అడ్వాన్స్‌ ప్రమోషన్లు, ఆర్థిక ప్రయోజనాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కోరారు. గతేడాది అక్టోబర్‌లో ఆరు సంవత్సరాల సర్వీసు పూర్తయిన ఉద్యోగులకు ఇప్పటి వరకు స్పష్టమైన ఆదేశాలు వెలువడలేదని తెలిపారు. పదోన్నతులకు బదులుగా డిప్యుటేషన్లు చూపించడం శాశ్వత పరిష్కారం కాదని, ఉద్యోగుల అభిప్రాయాలను గౌరవిస్తూ పదోన్నతుల ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని కోరారు. కార్యక్రమంలో అసోసియేషన్‌ లీగల్‌ అడ్వైజర్‌ దారా సురేష్‌బాబు, కన్వీనర్‌ మురళీధర్‌, శశికిరణ్‌, అధ్యక్షుడు శ్రీనివాసులు, ఆర్గనైజింగ్‌ సెక్రటరీ లోకేష్‌, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ షాహినా, భానుప్రకాశ్‌, సంధ్య, పవన్‌కుమార్‌, కోటి, బాలరాజు, స్వాతి, దీపిక, సుమన్‌, ఫయాజ్‌ తదితరులు పాల్గొన్నారు.

శ్రీవారి దర్శనానికి 24 గంటలు

తిరుమల: తిరుమలలో సోమవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూ కాంప్లెక్స్‌లోని 31 కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. క్యూలైన్‌ శిలాతోరణం వద్దకు చేరుకుంది. ఆదివారం అర్ధరాత్రి వరకు 93,230 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. 41,754 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో శుక్రవారం రూ.3.83 కోట్లు సమర్పించారు. టైంస్లాట్‌ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టికెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 24 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement