బాబూ షూరిటీ, భవిష్యత్ గ్యారెంటీ అంటూ అబద్ధపు ప్రచారంతో అడ్డదారిలో అధికారంలోకి వచ్చిన కూటమి సర్కారు మహిళలకు తీరని అన్యాయం చేసింది. బాబు బురిడీతో మహిళల భవిష్యత్ ఛిన్నాభిన్నమైంది. 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1,500 సాయం అందిస్తానని చెప్పిన హామీలు నెరవేర్చకపోగా, పొదుపు, సీ్త్ర నిధి రుణాలకు కొర్రీలు పెట్టారు. కొత్త రుణాలివ్వడం లేదు. గత ప్రభుత్వం అమలు చేసిన పథకాలను అటకెక్కించారు. సకాలంలో పొదుపు చెల్లించిన మహిళలకు సున్నా వడ్డీ ఊసే లేదు. మహిళలను కోటీశ్వరులను చేస్తానంటూ పీ–4 పథకంతో కొత్త గారడీ చేసిన చంద్రబాబు.. ఇటీవల మహానాడులో లక్ష మంది మహిళలను లక్షాధికారులను చేసినట్లు చెప్పేశారు. వాస్తవానికి పీ–4 పథకానికి ఆశించిన స్థాయిలో ప్రజాస్పందన కరువైంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బ్యాంకర్లు మహిళలకు కొత్త రుణాలిచ్చేందుకు విముఖత చూపుతున్నారు. మహిళలకు ఉచిత బస్సు అంటూ ఏడాది పాటూ ఊరించి.. ఊరించి గతేడాది ఆగస్టులో ప్రారంభించారు.


