ప్రజల గోడుకు స్పందనేదీ? | - | Sakshi
Sakshi News home page

ప్రజల గోడుకు స్పందనేదీ?

Jun 9 2026 9:16 AM | Updated on Jun 9 2026 9:16 AM

కలెక్టరేట్‌లో

‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’

వినతులు స్వీకరించిన అధికారులు

నెల్లూరురూరల్‌: నెల్లూరు కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జేసీ మొగిలి వెంకటేశ్వర్లు, డీఆర్వో విజయ్‌కుమార్‌, తెలుగుగంగ ప్రత్యేక అధికారి మహేశ్వరరెడ్డి, మెప్మా పీడీ కిరణ్‌ కుమార్‌, ఐటీడీఏ పీఓ శ్రీనివాసరావు, సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌ డిప్యూటీ డైరెక్టర్‌ నాగశేఖర్‌ తదితరులు స్వీకరించారు. ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి అర్జీదారుడికి సంతృప్తికరంగా పరిష్కారం చూపాలని జేసీ అధికారులను ఆదేశించారు.

భోజన పథకాన్ని ప్రైవేట్‌కు ఇవ్వొద్దు

రాష్ట్ర ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రైవేట్‌ సంస్థలకు అప్పగించే నిర్ణయాన్ని విరమించుకోవాలని ఆంధ్రప్రదేశ్‌ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్‌ జిల్లా కమిటీ డిమాండ్‌ చేసింది. కలెక్టరేట్‌ వద్ద వారు ప్రదర్శన చేపట్టారు. యూనియన్‌ జిల్లా అధ్యక్షురాలు కె.విజయమ్మ, జిల్లా కార్యదర్శి షేక్‌ రెహానా బేగం మాట్లాడుతూ ప్రైవేట్‌కు ఆ పథకాన్ని అప్పగిస్తే వేలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలంటే స్థానికంగా వంట చేసే విధానాన్నే కొనసాగించాలని కోరారు. అలాగేకార్మికులకు నెలకు రూ.10 వేల వేతనం చెల్లించాలన్నారు.

హామీలు నెరవేర్చాలంటూ..

ఎన్నికల సమయంలో వడ్డెర సామాజిక వర్గానికి ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్‌ వడ్డెర వృత్తిదారుల సంఘం జిల్లా కమిటీ డిమాండ్‌ చేసింది. కలెక్టరేట్‌ వద్ద ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుంజి దయాకర్‌ మాట్లాడుతూ వడ్డెర కార్పొరేషన్‌కు తగిన నిధులు కేటాయించి ఆధునిక పనిముట్లు, యంత్రాలను సబ్సిడీపై అందించాలని కోరారు. మైన్స్‌ అండ్‌ మినరల్స్‌ క్వారీల్లో రిజర్వేషన్లు కల్పించడంతో పాటు సీనరేజ్‌ చార్జీల్లో రాయితీలివ్వాలని డిమాండ్‌ చేశారు. వడ్డెరలకు 50 ఏళ్లకే పెన్షన్‌ మంజూరు చేయాలని డిమాండ్‌ చేశారు. సమస్యల్ని పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు కోటకొండ వెంకటేశ్వర్లు, జిల్లా కార్యదర్శి బెల్లంకొండ బాల వెంకటేశ్వర్లు తదితర నాయకులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement