చంద్రబాబు అరాచకాలకు రెండేళ్లు | - | Sakshi
Sakshi News home page

చంద్రబాబు అరాచకాలకు రెండేళ్లు

Jun 9 2026 9:16 AM | Updated on Jun 9 2026 9:16 AM

అన్ని వర్గాలను మోసగించారు

వెన్నుపోటు పాలనపై ప్రజలు నిరసన

మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి

తోటపల్లిగూడూరు(పొదలకూరు): ‘చంద్రబాబు అరాచక పాలనకు రెండేళ్లు నిండాయి. సూపర్‌సిక్స్‌ పేరుతో హామీలను గుప్పించి అధికారంలోకి వచ్చిన ఆయన హామీలను పూర్తి స్థాయిలో అమలు చేయకుండా ప్రజలకు వెన్నుపోటు పొడిచారు’ అని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి తెలిపారు. వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమంలో భాగంగా తోటపల్లిగూడూరు మండలం నరుకూరులోని రుషి కల్యాణ మండపంలో సర్వేపల్లి నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలతో సోమవారం ఆయన ముఖాముఖి నిర్వహించారు. తొలుత పార్టీ రాష్ట్ర మహిళా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కాకాణి పూజితారెడ్డి, పార్టీ శ్రేణులతో కలిసి నరుకూరు సెంటరు నుంచి కల్యాణ మండపం వరకు నల్ల బెలూన్లతో నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం నాయకులు, కార్యకర్తల ముఖాముఖిలో మాట్లాడారు. దేశ వ్యాప్తంగా ఎందరో ముఖ్యమంత్రులు ఉన్నా చంద్రబాబు వంటి అబద్ధాల కోరు ఎక్కడా లేరన్నారు. నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం ఉందని చెప్పుకొనే బాబు సొంత మేధస్సుతో ఒక్క ప్రజాసంక్షేమ పథకాన్ని ప్రవేశపెట్టిన దాఖలాలు లేవన్నారు. కూటమి ప్రభుత్వం ప్రకటించిన పథకాలన్నీ కాపీ కొట్టినవేనన్నారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రైతు భరోసా పథకం కింద ఏడాదికి రూ.13,500 అందజేస్తే దాన్ని కాపీ కొట్టి అన్నదాత సుఖీభవ పేరుతో రూ.20 వేలు ఇస్తానని రైతులను ఏ మార్చారని ఆరోపించారు. జగన్‌ అమ్మఒడి, డీఎంకే ఉచిత బస్సు, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల ఉచిత గ్యాస్‌ సిలిండర్‌ పథకాలను కాపీ కొట్టి అమలు చేస్తానని ప్రకటించి ఒక్కటి కూడా సక్రమంగా అమలు చేయలేదన్నారు. నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి, తదితర హామీలను పూర్తిగా అమలు నెరవేర్చలేదన్నారు. వెనుకబడిన వర్గాల అభివృద్ధి పేరుతో బీసీ డిక్లరేషన్‌ చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత పక్కన పెట్టారన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి జనరంజక పాలనను ప్రజలు గుర్తుచేసుకుని తిరిగి ఆయన అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారని తెలిపారు. చంద్రబాబు నిర్ణయాలు నిరుద్యోగులకు శాపంగా మారాయని ధ్వజమెత్తారు. సర్వేపల్లిలో చంద్రమోహన్‌రెడ్డి చేసిందేమి లేదని, అభివృద్ధిపై బహిరంగ చర్చకు రావాలని సవాల్‌ విసిరాడని, స్వీకరించి రమ్మంటే పలాయం చిత్తగించాడని విమర్శించారు. సోమిరెడ్డికి దమ్ము, ధైర్యం ఉంటే విసిరిన సవాల్‌కు కట్టుబడి ఉండాలన్నారు. కాకాణి పూజిత మాట్లాడుతూ చంద్రబాబు అన్ని వర్గాలను మోసగించారన్నారు. కూటమి పాలనలో దాడులు, అరాచకాలు తప్పించి సుపరిపాలన అందించిన దాఖలాలు లేవని విమర్శించారు. కష్టకాలంలో పార్టీకి వెన్నుదన్నుగా ఉన్న ప్రతి కార్యకర్తకు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు చిల్లకూరు సుధీర్‌రెడ్డి, ఉప్పల శంకరయ్యగౌడ్‌, ఎం.చిరంజీవిగౌడ్‌, తలమంచి సురేంద్రబాబు, పద్మనాభరెడ్డి, రమేష్‌రెడ్డి, శేషమ్మ, సుబ్రహ్మణ్యంరెడ్డి, మల్లికార్జున, గంగాధర్‌రెడ్డి, మణి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement