తల్లి ఆశలకు సమాధి | - | Sakshi
Sakshi News home page

తల్లి ఆశలకు సమాధి

Jun 9 2026 9:16 AM | Updated on Jun 9 2026 9:16 AM

విద్యుదాఘాతానికి గురై

కుమారుడి మృతి

వింజమూరు(ఉదయగిరి): ఆ పిల్లాడు అప్పటి వరకూ తల్లి ముందు ఎంతో సరదాగా గడిపాడు. అయితే కాసేపటికే అతని ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. వింజమూరు పట్టణంలోని చల్లావారి వీధిలో సోమవారం విద్యుదాఘాతానికి గురై మహేంద్రరెడ్డి (13) మృత్యువాత పడ్డాడు. పోలీసులు, బంధువుల కథనం మేరకు.. స్థానికంగా పేర్నేటి మమత అనే మహిళ నివాసముంటోంది. భర్త కొన్నేళ్ల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయాడు. దీంతో ఆమె కూలీ పనులకు వెళ్తూ పెద్ద కుమారుడు మహేంద్రరెడ్డి, కుమార్తెను చదివిస్తోంది. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న మహేంద్రరెడ్డి ఇంటి పక్కనే పాత భవనాన్ని కూల్చివేస్తుండగా కుతూహలంతో వెళ్లి చూస్తున్నాడు. ఆ సమయంలో డ్రిల్లింగ్‌ మెషీన్‌కు విద్యుత్‌ సరఫరా అవుతున్న తీగ నేలపై ఉంది. చెప్పుల్లేకుండా అతను పొరపాటున ఆ తీగను తొక్కడంతో షాక్‌కు గురై కుప్పకూలాడు. వెంటనే కూలీలు బాలుడిని స్థానిక ప్రైవేట్‌ వైద్యశాలకు తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతిచెందినట్లుగా నిర్ధారించారు. ఊహించని ఈ ఘటనతో మమత గుండెలవిసేలా రోదించడం అక్కడున్న వారిని కలిచివేసింది. కుమారుడు ప్రయోజకుడై కుటుంబానికి అండగా ఉంటాడని కలలుగన్న తల్లిని ఓదార్చడం ఎవరి వల్లా కాలేదు. ఎస్సై ఉమామమేశ్వరరావు వివరాలు సేకరించి కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement