నెల్లూరు(పొగతోట): గ్రామ పంచాయతీల సమగ్రాభివృద్ధే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించాలని జెడ్పీ చైర్‌పర్సన్ ఆనం అరుణమ్మ సూచించారు. సోమవారం నెల్లూరులోని జెడ్పీ సమావేశ మందిరంలో జీపీడీపీ (గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక)పై డివిజనల్, మండల స్థాయి అధికారులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. సభలు నిర్వహించకుండా, ప్రజల అభిప్రాయాలు సేకరించకుండా రూపొందించే ప్రణాళికలు నాణ్యతగా ఉండవన్నారు. తాగునీరు, పారిశుద్ధ్యం, రహదారులు, విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, మహిళా సాధికారత, యువజన అభివృద్ధి వంటి అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. జెడ్పీ సీఈఓ శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రజలు సూచించిన పనులను ప్రణాళికల్లో పొందుపరచాలని, నిధుల లభ్యతను దృష్టిలో ఉంచుకుని అభివృద్ధి పనులను గుర్తించాలని సూచించారు. మంగళవారం మండల స్థాయిలో శిక్షణ నిర్వహించి, నెలాఖరులోపు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో డీపీఓ వసుమతి, డ్వామా పీడీ స్వరూప్, డీడీఓ వాణి, ఎన్‌ఆర్‌డీఐ కో ఆర్డినేటర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.


