● రియల్టర్లను బెదిరించడం నిజం కాదా?
● ఆక్రమణలు ఉన్నాయని హడావుడి చేయడం నిజం కాదా?
● అవినీతి, దోపిడీ,
మనీ స్కామ్‌లే కావ్య చరిత్ర
● మాజీ ఎమ్మెల్యే ప్రతాప్‌కుమార్‌రెడ్డి ఆరోపణలు
కావలి : కావలి పట్టణం చుట్టు పక్కల ఏర్పాటు చేసిన రియల్ ఎస్టేట్ లేఅవుట్లలో 126 ఎకరాల ప్రభుత్వ భూమి ఆక్రమించారని హడావుడి చేసిన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డికి చిత్తశుద్ధి ఉంటే.. దమ్ము, ధైర్యం ఉంటే.. విజిలెన్స్ విచారణ జరిపించి ఆ భూములను ప్రభుత్వానికి స్వాధీనం చేయాలని మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి సవాల్ విసిరారు. ఆదివారం కావలిలోని తన నివాసంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వెంచర్లలో ప్రభుత్వ భూమి, కాలువ పోరంబోకు భూమి ఉందని పురపాలక సంఘ అధికారులతో తనిఖీ చేయించి రియల్టర్లను బెదిరించడమే కాకుండా వెంచర్‌లలో గుంటలు తీయించడం నిజం కాదా? అని నిలదీశారు. ఏకంగా విజిలెన్స్ విచారణ చేయాలంటూ లేఖలు రాసి మా పార్టీలో ఉన్న రియల్టర్లు భూముల ఆక్రమణల పేరుతో వేధించి, ముడుపులు దండుకుని విచారణను ఆపడం నిజం కాదా? అని ప్రశ్నించారు. మీ పార్టీలోని ఒక వ్యక్తి ప్రోద్బలంతో విజిలెన్స్ అధికారులు విచారణకు రావడంతో నీకు నచ్చని వారి వెంచర్లను తనిఖీ చేయాలంటూ ఆంక్షలు విధించలేదా అని నిలదీశారు.
విచారణను ఎదుర్కోలేక.. అధికారులపై దౌర్జన్యాలా?
మీ పార్టీలోని ఒక నాయకుడు గట్టిగా పట్టుబట్టడంతో విజిలెన్స్ అధికారులు కావలిలోని రియల్ ఎస్టేట్లలో భూ ఆక్రమణలపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టడంలో భాగంగా వివిధ కార్యాలయాల్లో సోదాలు నిర్వహిస్తుంటే ఎమ్మెల్యే అనుచరులు విజిలెన్స్ అధికారులపై దౌర్జన్యం చేయించడం వెనుక నీ పాత్ర ఉందని, విచారణను ఎదుర్కోలేకనే ఇలా బరితెగించారంటూ మండిపడ్డారు. ఎమ్మెల్యేకు దమ్ము ధైర్యం ఉంటే విజిలెన్స్ విచారణ కాదు సీబీఐతో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. రియల్టర్ల వద్ద కోట్లాది రూపాయలు వసూలు చేసుకొని విచారణ అడ్డుకుంటున్న ఘనత నీదన్నారు.
మట్టి, గ్రావెల్ కొల్లగొట్టేస్తున్నారు..
నియోజకవర్గంలో అక్కడ ఇక్కడ అనే తేడా లేకుండా ప్రభుత్వ, ప్రైవేట్ భూముల్లోనూ ఎమ్మెల్యే, ఆయన అనుచరులు యథేచ్ఛగా గ్రావెల్, మట్టి అక్రమంగా తవ్వుతూ రూ.కోట్లు కొల్లగొడుతున్నారని ప్రతాప్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. తాను గెలుపొందిన ఆరు నెలల్లోనే తుమ్మలపెంట రోడ్డును పూర్తిస్థాయిలో నిర్మించి 2025 జనవరిలో నూతన సంవత్సరం వేడుకలను నిర్వహిస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. నేటికి అసంపూర్తిగా ఉందని, చేసిన పనుల్లోనూ అనేక అక్రమాలు ఉన్నాయని వాటిపై పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలన్నారు.
ఫిషింగ్ హార్బర్ మా ఘనత
తీర ప్రాంత మత్స్యకారుల సంక్షేమం ఆర్ధికాభివృద్ధిని కాంక్షించి ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిధులు మంజూరు చేసి 90 శాతానికిపైగా పూర్తి చేసిన ఘనత మాది అన్నారు. హార్బర్ కాంట్రాక్ట్ పనులు చేసిందీ కూడా ఇప్పటి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి అని గుర్తు చేశారు. అయితే అదేదో కూటమి ప్రభుత్వం మంజూరు చేసి నిర్మాణం చేసినట్లు నిస్సిగ్గుగా చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. 35 ఎకరాల భూమిని ప్రైవేట్ సంస్థకు ధారాదత్తం చేసిన మీకు మత్స్యకారుల సంక్షేమం, అభివృద్ధిపై చిత్తశుద్ధి ఎక్కడ అని ప్రశ్నించారు.
రూ.600 కోట్ల మనీస్కామ్
కావలి మర్రిచెట్టు కాలనీలో ఒక వ్యక్తి మనీ లాండరింగ్ పేరుతో రూ.వంద కోట్లు మనీస్కామ్‌కు పాల్పడ్డాడని, రూ.600 కోట్ల స్కామ్ జరిగిందని ఆరోపించిన కావ్య కృష్ణారెడ్డి.. ఇందులో ఒక్క రూపాయి అయినా బాధితులకు తిరిగి ఇప్పించగలిగావా? అని ప్రతాప్‌కుమార్‌రెడ్డి ప్రశ్నించారు. బాధితులు తమ వద్దకు వస్తే ప్రతి ఒక్కరికి ప్రతి పైసా అందించే బాధ్యత నాది అని చెప్పావే.. ఇప్పుడు ఆ ఊసే లేదంటే.. వారితో లాలూచీ పడ్డావా? అని నిలదీశారు. ఈ సమావేశంలో వైఎస్సార్‌సీపీ అల్లూరు మండల కన్వీనర్ దండా కృష్ణారెడ్డి, బోగోలు కన్వీనర్ మద్దిబోయిన వీర రఘు, నాయకులు గంధం ప్రసన్నాంజనేయులు, పద్మనాభరెడ్డి, పలువురు నాయకులు పాల్గొన్నారు.


