రాష్ట్ర గవర్నర్‌ రాక రేపు | - | Sakshi
Sakshi News home page

రాష్ట్ర గవర్నర్‌ రాక రేపు

Jun 8 2026 9:59 AM | Updated on Jun 8 2026 9:59 AM

నెల్లూరురూరల్‌: రాష్ట్ర గవర్నర్‌ ఎస్‌ అబ్దుల్‌నజీర్‌ మంగళవారం జిల్లాలో పర్యటించనున్నట్లు కలెక్టర్‌ హిమాన్షు శుక్లా ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. గవర్నర్‌ ఉదయం 10.50 గంటలకు హెలికాప్టర్‌లో నెల్లూరులోని పోలీస్‌ పరేడ్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో 11.15 గంటలకు కనుపర్తిపాడులోని వీపీఆర్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం నిర్వహిస్తున్న 10, 11, 12వ స్నాతకోత్సవాల కార్యక్రమంలో పాల్గొంటారు. గ్రాడ్యుయేట్స్‌కు పట్టాలు, గౌరవ డాక్టరేట్స్‌లు ప్రదానం చేయనున్నారు. అనంతరం తిరుపతికి బయలుదేరుతారు.

పిడుగుపాటుకు

గొర్రెల కాపరి మృతి

వరికుంటపాడు: మండలంలోని పెద్దిరెడ్డిపల్లిలో పిడుగుపాటుకు అరవ రమణయ్య (45) మృతి చెందాడు. ఈ ఘటన ఆదివారం సాయంత్రం జరిగింది. స్థానికులు, కుటుంబ సభ్యుల కథనం మేరకు.. రమణయ్య గ్రామ శివారులో గొర్రెలను మేపుతుండగా ఒక్కసారిగా వాతావరణం మారి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం ప్రారంభమైంది. ఈ క్రమంలో సమీపంలో పిడుగు పడడంతో రమణయ్య తీవ్రంగా గాయపడ్డాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, గ్రామస్తులు వెంటనే ఆయనను చికిత్స నిమిత్తం పామూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మార్గమధ్యంలోనే ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడు రమణయ్యకు భార్యతోపాటు ఇద్దరు కుమారులు ఉన్నారు.

సర్టిఫికెట్‌ కోర్సుల్లో ప్రవేశానికి

దరఖాస్తుల ఆహ్వానం

నెల్లూరు(వేదాయపాళెం): వ్యవసాయ సర్టిఫికెట్‌ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త డాక్టర్‌ జీఎల్‌ శివజ్యోతి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ ఆధ్వర్యంలో నిర్వహించే సేంద్రియ వ్యవసాయం, మిద్దె తోటల పెంపకం, పుట్టగొడుగుల పెంపకం కోర్సులకు ఆసక్తి గల యువత, రైతులు, మహిళలు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఒక్కో కోర్సుకు రూ.1500 రుసుం చెల్లించాల్సి ఉంటుందరు. ఇతర వివరాలకు భక్తవత్సలనగర్‌లోని కృషి విజ్ఞాన కేంద్ర కార్యాలయంలో సంప్రదించాలన్నారు.

పశువుల ప్రాణాంతక

వ్యాధులకు ఉచిత టీకాలు

నెల్లూరు (వేదాయపాళెం): పశువులు, మూగజీవాలను ప్రాణాంతక సాంక్రమిత వ్యాధుల నుంచి కాపాడేందుకు ఉచిత టీకాల కార్యక్రమం చేపడుతున్నామని పశువ్యాధి నిర్ధారణ ప్రయోగశాల అసిస్టెంట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ చైతన్య కిషోర్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జబ్బవాపు నివారణకు ఈ నెల 10 నుంచి 30వ తేదీ వరకు, చిటిక వ్యాధి నివారణకు ఈ నెల 15 నుంచి జూలై 15 వరకు, గొంతువాపు వ్యాధి నివారణకు ఈ నెల 25 నుంచి జూలై 25 వరకు, నీలి నాలుక వ్యాధి నివారణకు జూలై 1 నుంచి 30 వరకు టీకాలు ఉచితంగా వేస్తామని ఆయన తెలిపారు. వర్షాకాలం ప్రారంభమవుతున్న ప్రస్తుత తరుణంలో పశువులు, మేకలు, గొర్రెల్లో సంక్రమించే వ్యాధులు తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉందని తెలిపారు. ముందస్తు వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం నిర్దేశిత గడువులోపు మాత్రమే నిర్వహిస్తామన్నారు. అందువల్ల రైతులు పశుపోషకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సకాలంలో టీకాలు వేయించాలని తెలిపారు.

శ్రీవారి దర్శనానికి

20 గంటలు

తిరుమల: తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్ట్‌మెంట్లన్నీ నిండిపోయాయి. క్యూ శిలాతోరణం వద్దకు చేరుతుంది. శనివారం అర్ధరాత్రి వరకు 90,107 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. 52,236 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామి వారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.23 కోట్లు సమర్పించారు. టైంస్లాట్‌ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టికెట్లు లేని వారు స్వామి వారిని దర్శించుకోవడానికి 20 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామివారిని దర్శించుకోగలుగుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement