అడగలేరని.. చిన్నచూపా | - | Sakshi
Sakshi News home page

అడగలేరని.. చిన్నచూపా

Jun 8 2026 9:59 AM | Updated on Jun 8 2026 9:59 AM

గతంలోనూ ఘటనలు

పురిటి బిడ్డలకు రక్షణ కరువు

ఎలక్ట్రానిక్‌ ట్యాగ్‌ను తీసేసిన

కూటమి ప్రభుత్వం

సర్వజన ఆస్పత్రిలో శిశువును

విక్రయించిన తండ్రి

తల్లి కేకలతో బిడ్డను కాపాడిన

సెక్యూరిటీ సిబ్బంది

నిందితుడిని వదిలేసిన పోలీసులు

నెల్లూరు(అర్బన్‌): కూటమి ప్రభుత్వం తీసుకున్న చర్యలు పసిబిడ్డల పాలిట శాపంగా మారాయి. అప్పుడే పుట్టిన శిశువులు లేదా కొద్దిరోజుల వయసున్న బిడ్డలను అపహరణల నుంచి రక్షించేందుకు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రుల ప్రసూతి విభాగాల్లో శిశువుల చేతికి లేదా కాలికి ప్రత్యేక ఎలక్ట్రానిక్‌ ట్యాగ్‌ను అమర్చేవారు. దీనిని ఆర్‌ఎఫ్‌ఐడీ (రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్‌) ఆధారిత బేబీ ట్యాగింగ్‌ సిస్టమ్‌ లేదా ఎలక్ట్రానిక్‌ ఇన్‌ఫాంట్‌ ప్రొటెక్షన్‌ సిస్టమ్‌ అని పిలుస్తారు. ఈ ట్యాగ్‌ ఆస్పత్రి భద్రతా వ్యవస్థతో అనుసంధానమై ఉంటుంది. అనుమతి లేకుండా శిశువును వార్డు లేదా నిర్దేశిత ప్రాంతం నుంచి బయటకు తీసుకెళ్లేందుకు ప్రయ త్నిస్తే వెంటనే అలారం మోగుతుంది. దీంతో సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తమై శిశువును కాపాడే అవకాశం ఉంటుంది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలోని సర్వజన, జిల్లా ఆస్పత్రుల్లో ఈ విధానం అమల్లో ఉండేది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత శిశువులకు ట్యాగ్‌లు అమర్చే విధానాన్ని నిలిపివేసింది. దీంతో అలారంలు అలంకారప్రాయంగా మారిపోయాయి. పురిటి బిడ్డల భద్రత ప్రశ్నార్థకంగా మారిందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. దీనికి నిదర్శనంగా 5వ తేదీన నెల్లూరు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి ప్రసూతి విభాగంలో చోటుచేసుకున్న ఘటన నిలిచింది.

రూ.50 వేల కోసం..

అనంతసాగరం ప్రాంతానికి చెందిన ముక్తియార్‌, లక్ష్మీకాంత దంపతులకు ఇప్పటికే ఇద్దరు కుమారులున్నారు. ఇటీవల లక్ష్మీకాంత ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో మూడోసారి మగబిడ్డకు జన్మనిచ్చింది. మద్యానికి బానిసైన భర్త తన భార్యకు తెలియకుండా నవజాత శిశువును విక్రయించేందుకు ప్రయ త్నించాడు. శిశువును రూ.50 వేలకే విక్రయించేందుకు ఓ వ్యక్తితో బేరం కుదుర్చుకున్నాడు. భార్య మరుగుదొడ్డికి వెళ్లిన సమయంలో బురఖా ధరించి బిడ్డను తీసుకుని ఆస్పత్రి బయటకు వచ్చాడు. ఆస్పత్రి ఎదురుగా కారులో వేచి ఉన్న వ్యక్తులకు శిశువును అప్పగించాడు. అయితే మంచంపై బిడ్డ కనిపించకపోవడంతో తల్లి లక్ష్మీకాంత ఆందోళనకు గురై ఏడుస్తూ బయటకు వచ్చింది. ఆమె కేకలు విన్న సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తమై కారును చుట్టుముట్టి శిశువును సురక్షితంగా తిరిగి తల్లికి అప్పగించారు.

ట్యాగ్‌ ఉంటే ఘటనే జరిగేది కాదు

శిశువుకు ఎలక్ట్రానిక్‌ ట్యాగ్‌ అమర్చివుంటే, వార్డు పరిధి దాటిన వెంటనే అలారం మోగేది. దీంతో శిశువును బయటకు తీసుకెళ్లడం సాధ్యమయ్యేది కాదు. ఈ ఘటన మరోసారి బేబీ ట్యాగింగ్‌ విధానం అవసరాన్ని స్పష్టంగా తెలియజేస్తోంది.

తండ్రే నిందితుడు కావడంతో..

ఘటన అనంతరం సెక్యూరిటీ సిబ్బంది ముక్తియార్‌ను నాలుగో నగర పోలీసులకు అప్పగించారు. విచారణలో తాను బిడ్డను పోషించలేక విక్రయించేందుకు ప్రయత్నించానని, కొనుగోలు చేసిన వ్యక్తులు దర్గా ప్రాంతంలో పరిచయమైన వారేనని ముక్తియార్‌ చెప్పినట్లు సమాచారం. అయితే పోలీసులు అతడిపై కేసు నమోదు చేయకుండా హెచ్చరించి వదిలేసినట్లు ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి. దీంతో 6వ తేదీన ఉదయం ముక్తియార్‌ తిరిగి ఆస్పత్రికి వచ్చి, మూడో బిడ్డను తాను పోషించలేను, ఎలాగైనా అమ్మేస్తాను అంటూ నిర్భయంగా మాట్లాడినట్లు అక్కడి వారు చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేయకపోవడమే అతడికి ధైర్యం ఇచ్చిందని ఆస్పత్రి పరిసరాల్లో చర్చ సాగింది.

గతంలో కూడా నెల్లూరు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో తల్లితో ఉన్న నాలుగేళ్ల చిన్నారిని అపహరించిన ఘటన చోటుచేసుకుంది. అనంతరం పోలీసులు చిన్నారిని గుర్తించి రక్షించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత పోలీసు, వైద్యారోగ్య శాఖలపై ఉందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. నవజాత శిశువుల భద్రత కోసం తిరిగి బేబీ ట్యాగింగ్‌ విధానాన్ని అమల్లోకి తీసుకురావాలని గర్భిణులు, వారి కుటుంబ సభ్యులు డిమాండ్‌ చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement