నిండా నిర్లక్ష్యం.. తీరని నష్టం | - | Sakshi
Sakshi News home page

నిండా నిర్లక్ష్యం.. తీరని నష్టం

Jun 8 2026 9:59 AM | Updated on Jun 8 2026 9:59 AM

నెల్లూరు(అర్బన్‌): నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి (పెద్దాస్పత్రి)లో పదిరోజులుగా జనన, మరణ ధ్రువపత్రాల జారీ నిలిచిపోయింది. అదే విధంగా పక్షవాతం బాధితులకు జారీ చేసే దివ్యాంగుల సర్టిఫికెట్ల ప్రక్రియ కూడా మార్చి 31వ తేదీ నుంచి ఆగిపోయింది. దీంతో బాధితులు రోజూ ఆస్పత్రి చుట్టూ తిరుగుతూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సమస్యపై స్పష్టమైన సమాధానం చెప్పే అధికారులు లేకపోవడంతో బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలువురు ప్రభుత్వ పథకాల లబ్ధిని కోల్పోయే పరిస్థితి నెలకొంది.

ఓటీపీ రాకపోవడంతో..

పెద్దాస్పత్రిలో జనన, మరణ ధ్రువపత్రాల జారీ బాధ్యత అడ్మినిస్ట్రేటివ్‌ అధికారిగా ఉన్న డాక్టర్‌ కళారాణి పర్యవేక్షణలో కొనసాగేది. స ర్టిఫికెట్ల జారీకి అవసరమైన కంప్యూటర్‌ లాగిన్‌ ప్రక్రియలో మొదట డాక్టర్‌ కళారాణి మొబైల్‌కు ఓటీపీ వచ్చేది. ఆ ఓటీపీని కంప్యూటర్‌ ఆపరేటర్‌కు అందజేసిన తర్వాత సర్టిఫికెట్‌ ప్రాసెస్‌ చేసేవారు. అయితే ఇటీవల ప్రభుత్వం ఆమెను వేరే జిల్లాకు బదిలీ చేయడంతో ఈ ప్రక్రియ నిలిచిపోయింది. బదిలీ అనంతరం వెంటనే మరొక అధికారికి బాధ్యతలు అప్పగించి, సంబంధిత ఓటీపీ వ్యవస్థను బదిలీ చేసే చర్యలు చేపట్టాల్సి ఉండగా ఆస్పత్రి యాజమాన్యం అలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫలితంగా రోజూ 50 మందికి పైగా ధ్రువపత్రాల కోసం ఆస్పత్రి చుట్టూ తిరుగుతున్నారు. అయినప్పటికీ సమస్య పరిష్కారంపై ఎవరూ స్పందించడం లేదని బాధితులు వాపోతున్నారు.

అందని సదరం సర్టిఫికెట్లు

పక్షవాతంతో నడవలేని, కదల్లేని రోగులకు జారీ చేసే దివ్యాంగుల సర్టిఫికెట్ల ప్రక్రియ కూడా మార్చి 31వ తేదీ నుంచి నిలిచిపోయింది. ఇప్పటి వరకు ఆర్థోపెడిక్‌ విభాగం వైద్యులు రోగులను పరిశీలించి న్యూరో ఫిజీషియన్‌కు రిఫర్‌ చేసేవారు. న్యూరో వైద్యుడు తన అభిప్రాయాన్ని నమోదు చేసిన అనంతరం ఆర్థోపెడిక్‌ విభాగం అధికారులు వివరాలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేసేవారు. దీంతో సర్టిఫికెట్‌ వయ్యేది. అయితే ప్రభుత్వం నిబంధనలు మార్చిందంటూ ఆర్థోపెడిక్‌ విభాగం వైద్యులు వివరాలను అప్‌లోడ్‌ చేయడం నిలిపివేసినట్లు తెలుస్తోంది. మరోవైపు న్యూరో ఫిజీషియన్‌ మాత్రం తాను నిబంధనల ప్రకారమే పని చేస్తున్నానని పేర్కొంటూ సంబంధిత ఉత్తర్వులను సూపరింటెండెంట్‌కు అందజేసినట్లు సమాచారం. రెండు విభాగాల మధ్య నెలకొన్న విభేదాల కారణంగా పక్షవాతం బాధితులు తీవ్రంగా నష్టపోతున్నారు. పరిస్థితిని సూపరింటెండెంట్‌ ఇప్పటి వరకు సరిచేయకపోవడంతో దివ్యాంగుల సర్టిఫికెట్లు అందక రోగులు ఇబ్బందులు పడుతున్నారు.

పింఛన్లు వచ్చేనా?

మరణించిన వారి కుటుంబ సభ్యులు, పక్షవాతం వంటి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న వారు ప్రభుత్వ పింఛన్ల కోసం తప్పనిసరిగా వైద్యులు జారీ చేసే ధ్రువపత్రాలపై ఆధారపడాల్సి ఉంటుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త పింఛన్ల మంజూరు ప్రక్రియ నిలిచిపోయింది. ప్రజల నుంచి వచ్చిన విమర్శల నేపథ్యంలో దాదాపు రెండేళ్ల తర్వాత ఈనెల 12వ తేదీ వరకు కొత్త పింఛన్ల కోసం దరఖాస్తులు స్వీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే అవసరమైన ధ్రువపత్రాలు అందకపోతే అర్హులైన లబ్ధిదారులు పింఛన్లకు దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. దీంతో అభాగ్యులు తీవ్రంగా నష్టపోతారు.

చిన్నారుల ధ్రువపత్రాలకూ ఆటంకం

ఆస్పత్రిలో జన్మించిన శిశువులకు జనన ధ్రువపత్రాలు అత్యంత కీలకం. ఆధార్‌ నమోదు, జనగణన, బీమా పాలసీలు, విద్యా ప్రవేశాలు తదితర అనేక అవసరాలకు జనన ధ్రువపత్రం తప్పనిసరి. ప్రస్తుతం జనన ధ్రువపత్రాల జారీ నిలిచిపోవడంతో కొత్తగా జన్మించిన శిశువుల తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తమకు వెంటనే జనన, మరణ ధ్రువపత్రాలు, దివ్యాంగుల సర్టిఫికెట్లు జారీ చేయాలని బాధితులు కోరుతున్నారు. కలెక్టర్‌ జోక్యం చేసుకుని సమస్యను వెంటనే పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

పెద్దాస్పత్రిలో ఆగిన జనన, మరణ ధ్రువపత్రాల మంజూరు

వితంతు పింఛన్‌కు భర్త మరణ

ధ్రువపత్రం తప్పనిసరి

దివ్యాంగుల సర్టిఫికెట్ల

మంజూరులో నిర్లక్ష్యం

ఈనెల 12తో ముగియనున్న

దరఖాస్తుల గడువు

పట్టించుకోని అధికారులు

Advertisement
 
Advertisement
Advertisement