కొమ్మి సోదరుడి అక్రమ దందా | - | Sakshi
Sakshi News home page

కొమ్మి సోదరుడి అక్రమ దందా

Jun 8 2026 9:59 AM | Updated on Jun 8 2026 9:59 AM

కూటమి ప్రభుత్వం వచ్చాక

రెచ్చిపోతున్న తెలుగు తమ్ముడు

పెన్నా పోరంబోకు భూముల్లో ఇసుక దోపిడీ

ఆయన గుప్పెట్లో వందలాది

ఎకరాల ప్రభుత్వ భూమి

తహసీల్దార్‌కు ఫిర్యాదు చేసిన గ్రామస్తులు

చేజర్ల: కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలుగు తమ్ముళ్ల అవినీతికి అడ్డు లేకుండా పోయింది. ప్రకృతి వనరులు దోచుకుంటున్నారు. ఓ మాజీ ఎమ్మెల్యే సోదరుడు యథేచ్ఛగా పెన్నా పోరంబోకు భూమిలో ఉన్న ఇసుకను అక్రమ రవాణా చేస్తున్నాడు. ఇప్పటికే వందలాది ఎకరాల ప్రభుత్వ భూమి నిబంధనలకు విరుద్ధంగా అతడి ఆధీనంలో ఉన్నాయి. అది చాలుదన్నట్టుగా పెన్నా పరివాహక ప్రాంతం నుండి ఇసుకను దోచే కార్యక్రమం చేపట్టాడు. కాగా 6వ తేదీన గ్రామస్తులు అధికారులకు ఫిర్యాదు చేశారు.

అధికారం ఉందని..

తెలుగుదేశం రాష్ట్ర నాయకుడు, మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మయ్య నాయుడు స్వగ్రామమైన చేజర్ల మండలం, పుల్లనీళ్ల్లపల్లి గ్రామంలో ఆయన సోదరుడు కొమ్మి సిద్ధులు నాయుడు పెన్నా పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ భూముల్లో ఇసుకను భారీ యంత్రాల సహాయంతో లోడేస్తున్నాడు. పెల్లేరు రెవెన్యూ గ్రామ పరిధిలోని 235 – 2లో 10 ఎకరాలకు పైగా అనాధీన భూమి ఉండగా దానిని సిద్ధులు నాయుడు ఆక్రమించుకుని ఉన్నాడు. ఈ పొలం చదును చేసేందుకు ఇసుకను తరలిస్తున్నారు. అతను ఆక్రమించిన భూమి నుంచి ఎగువ వైపున పొలాల్లోకి అధికారికంగా రహదారి ఉన్నా దానిని సైతం ఆక్రమించి ఇబ్బందులు పెడుతున్నారని బాధిత రైతులు, గ్రామస్తులు చెబుతున్నారు.

తహసీల్దార్‌ దృష్టికి..

మా ప్రభుత్వం ఇది.. ఏం చేస్తారంటూ రాజకీయ, కుల బలంతో ఇబ్బందులకు గురిచేస్తున్న మాజీ ఎమ్మెల్యే సోదరుడి చేష్టలకు గ్రామస్తులు విసిగిపోయారు. ఎట్టకేలకు ధైర్యం తెచ్చుకుని శనివారం చేజర్ల తహసీల్దార్‌ ఆర్‌.మస్తానయ్యకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇప్పటికే వందలాది ఎకరాల ప్రభుత్వ భూమిని సిద్ధులు నాయుడు ఆక్రమించుకుని అనుభవిస్తున్నట్లు చెప్పారు. తాజాగా పెన్నా పోరంబోకు భూముల్లోని ఇసుకను సైతం దోచేస్తూ పొలాలకు వెళ్లే దారిని సైతం ఆక్రమించాడన్నారు. రాజకీయ బలంతోనే లక్ష్మయ్య నాయుడి సోదరుడు ఎస్సీ, ఎస్టీ, బీసీ, బలహీన వర్గాలకు ప్రభుత్వం ఇచ్చిన భూములను దౌర్జన్యంగా ఆక్రమించి ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. పెన్నా పరీవాహక ప్రాంతంలోని వందలాది ఎకరాలు ఏటి పోరంబోకు భూముల్లో బోర్‌ పాయింట్లు, విద్యుత్‌ సర్వీసులు అక్రమంగా ఏర్పాటు చేసి నెల్లూరుకు చెందిన ప్రైవేట్‌ వ్యక్తులకు లీజుకు ఇచ్చి ఏటా రూ.లక్షలు ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నాడని తెలిపారు. కలెక్టర్‌ స్పందించి సదరు మాజీ ఎమ్మెల్యే సోదరుడి ఆధీనంలో ఉన్న ప్రభుత్వ భూములను వెలికి తీసి బాధ్యులకు అందజేయాలన్నారు. అలాగే కబ్జాకు గురైన భూములను అతని చెర నుంచి విడిపించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

● ఇసుక అక్రమ దందా విషయంపై తహసీల్దార్‌ను సాక్షి వివరణ కోరగా ప్రభుత్వ భూముల్లో నుంచి ఇసుకను తరలించడం చట్టరీత్యా నేరమని, విచారించి చర్యలు తీసుకుంటామన్నారు.

పెన్నా ప్రాంతంలో ట్రాక్టర్‌లో ఇసుక లోడింగ్‌

ట్రాక్టర్‌ ద్వారా ఇసుక డంప్‌ చేస్తూ..

Advertisement
 
Advertisement
Advertisement