సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ఉద్యోగాలను కల్పించకపోగా, ఉన్న కొలువులనూ పీకుతూ టీడీపీ వికటాట్టహాసం చేస్తోంది. నిజానికి యువతకు 20 లక్షల ఉపాధి అవకాశాలను కల్పిస్తామని.. లేకపోతే వచ్చేంత వరకు నెలకు రూ.మూడు వేల నిరుద్యోగ భృతిని అందిస్తామంటూ నాడు ఆర్భాటంగా చంద్రబాబు ప్రకటించారు. అయితే ఇది నెరవేరకపోవడంతో యువత అయోమయానికి గురవుతోంది. సర్కార్ నుంచి స్పష్టమైన ప్రకటన నేటికీ రాకపోవడంతో జిల్లాలోని దాదాపు ఐదు లక్షల మంది ఆవేదనకు గురవుతున్నారు.
అందరి ఆశలూ భృతిపైనే..
కూటమి ప్రభుత్వం కొలువుదీరి దాదాపు రెండేళ్లవుతున్నా, నిరుద్యోగ భృతి ఊసే ఎత్తడంలేదు. డిగ్రీ, ఇంజినీరింగ్, ఇంటర్, పదో తరగతి అర్హతతో జిల్లాలోని ఎంతో మంది ఉద్యోగావకాశాల కోసం నిరీక్షిస్తున్నారు. ప్రభుత్వ కొలువుల కోసం కష్టపడుతూనే.. ఇంటి వద్దే వ్యవసాయం చేసుకుంటున్న వారూ ఉన్నారు. మరికొందరు ఆర్థిక వెసులుబాటు లేక పట్టణాల్లో చిన్న పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఉన్నత చదువులు చదివి ఉద్యోగాలు లభించక కాయకష్టంపైనే ఆధారపడిన వారి సంఖ్య కోకొల్లలు.
అప్పులు చేస్తూ..
మెగా డీఎస్సీ ద్వారా జిల్లాలో దాదాపు 650 పోస్టులు మాత్రమే వచ్చాయి. ఒకవేళ నోటిఫికేషన్లు ఏమైనా వస్తే శిక్షణ పొందేందుకు రూ.వేలల్లో ఫీజులను చెల్లించాల్సి ఉంది. ఆర్థికంగా భారమైనా అప్పులు చేసి మరీ వీటిని పొందుతున్నారు. ఫీజులతో పాటు ప్రైవేట్ వసతిగృహాల్లో ఉండేందుకు ప్రతి నెలా రూ.ఆరు వేలకుపైగా ఖర్చవుతోంది. నిరుద్యోగ భృతి ఇస్తే వీరికి కొంత మేరకై నా వెసులుబాటు లభించే అవకాశం ఉంటుంది.
గతంలో మాదిరిగా మోసం చేస్తారా..?
గతంలో తరహాలో ప్రస్తుతం సైతం మోసం చేస్తారాననే అనుమానాలూ లేకపోలేదు. నిజానికి 2014 – 19 మధ్యలోనూ నిరుద్యోగ భృతి అంటూ చంద్రబాబు దగా చేశారు. అప్పట్లో నాలుగేళ్ల పాటు ఈ అంశంపై మౌనవ్రతం వహించారు. చివర్లో సవాలక్ష సాకులు చూపి కొద్ది మందికి కొన్ని నెలల పాటు రూ.రెండు వేలను వేశారు. ఏది ఏమైనా చంద్రబాబు మార్కు రాజకీయాలకు నిరుద్యోగుల పరిస్థితి దయనీయంగా మారింది.
జగనన్న హయాంలో సాఫీగా..
నిరుద్యోగులకు ఉపాధి కల్పనే లక్ష్యంగా గత సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అడుగులేశారు. ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ ఫర్ అవుట్‌సోర్స్‌డ్ సర్వీసెస్ (ఆప్కాస్)ను ఏర్పాటు చేసి ఎంతో పారదర్శకంగా ఉద్యోగావశాకాలను కల్పించారు. శాశ్వతంగా.. ప్రత్యేక కేటగిరీల్లో.. ప్రైవేట్ రంగాల్లో.. వలంటీర్లు.. సచివాలయాలు.. ఇలా ఎంతో మందికి ఉపాధి కల్పించి వారి కళ్లల్లో వెలుగులు నింపారు. అయితే ఆయనకు మంచి పేరు రావడాన్ని సహించలేని కూటమి సర్కార్ నాడు ఏర్పాటు చేసిన సంస్కరణలకు చరమగీతం పాడి యువతకు శోకాన్ని మిగిల్చింది.
ఉపాధి లేదు.. భృతీ రాదు
బాబు ష్యూరిటీ.. భవిష్యత్తు గ్యారెంటీ అంటూ గత ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్ హామీలను టీడీపీ ఎంతో ఆర్భాటంగా ప్రకటించింది. ఇందులో ప్రథమ వాగ్దానం ఉద్యోగాల కల్పన. యువతకు 20 లక్షల ఉపాధి అవకాశాలు.. లేకపోతే వచ్చేంత వరకు నెలకు రూ.మూడు వేల నిరుద్యోగ భృతిని అందిస్తామంటూ జిల్లాలోని నెల్లూరు, కావలి ఉదయగిరి సభల్లో అప్పటి ప్రతిపక్ష నేత.. ప్రస్తుత సీఎం చంద్రబాబు ఊకదంపుడు ఉపన్యానాలు చేశారు. ఆయన వ్యవహార శైలిపై అనేక అపోహలున్నా, ఈసారైనా మారుతారేమోననే భావనతో సైకిల్ పార్టీకి యువత ఓట్లేసి పట్టం కట్టారు. ఇంకేముంది.. విజయం సాధించి ఈ నెల 12తో రెండేళ్లు పూర్తవుతున్నా, నిరుద్యోగులకు ఆయన రిక్తహస్తం చూపుతున్నారు. ఈ క్రమంలో ఉపాధి రాక.. భృతీ అందక జిల్లాలోని ఎంతో మంది అల్లాడుతున్నారు.
యువతకు 20 లక్షల ఉద్యోగాలు లేదా నెలకు రూ.మూడు వేలిస్తామని హామీ
నమ్మి ఓట్లేసినందుకు దగా
రెండేళ్లవుతున్నా, దీనిపై ప్రకటన చేయని సర్కార్
జిల్లాలో గంపెడాశలతో
నిరీక్షిస్తున్న ఎంతో మంది
వైఎస్సార్సీపీ హయాంలో లభించిన కొలువులు
జిల్లాలో ఇలా..
కుటుంబాలు – దాదాపు 7.2 లక్షలు
నిరుద్యోగులు – ఐదు లక్షలకుపైగా


