తవ్వుకో.. దోచుకో..! | - | Sakshi
Sakshi News home page

తవ్వుకో.. దోచుకో..!

Jun 7 2026 9:30 AM | Updated on Jun 7 2026 9:30 AM

సర్వేపల్లిలో ఆగని గ్రావెల్‌ దందా

నిద్రావస్థలో అధికారులు

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: సర్వేపల్లి నియోజకవర్గంలో గ్రావెల్‌ దందా విచ్చలవిడిగా సాగుతోంది. అక్రమ రవాణాకు సంబంధించి సోషల్‌ మీడియా, పత్రికల్లో నిత్యం కథనాలొస్తున్నా, అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడంతో అంతా ఇష్టారాజ్యంగా సాగుతోంది. ప్రభుత్వ, పేదలకు పంచిన అసైన్‌మెంట్‌ భూములు, చెరువులు ఇలా దేన్నీ వదలకుండా రూ.కోట్ల విలువజేసే గ్రావెల్‌ సంపదను కొల్లగొడుతున్నారు.

ఎర్ర నేల భూములపై కన్ను

సర్వేపల్లి నియోజకవర్గంలోని వెంకటాచలం, పొదలకూరు, ముత్తుకూరు మండలాల్లో ఎర్ర నేల భూములు అధికంగా ఉన్నాయి. వీటిని తవ్వితే వచ్చే గ్రావెల్‌, మట్టికి మంచి గిరాకీ ఉంది. దీంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి గ్రావెల్‌ మాఫియా ఇక్కడ రెచ్చిపోతోంది. వాస్తవానికి భూగర్భ, గనుల శాఖ అనుమతులతో ప్రభుత్వానికి రాయల్టీని చెల్లించి, తవ్వకాలను జరపాల్సి ఉంది. అయితే సర్వేపల్లి ముఖ్యనేత అండదండలతో ఎలాంటి అనుమతుల్లేకుండానే తవ్వకాలను రేయింబవళ్లూ చేపడుతున్నారు. నిత్యం వందలాది టిప్పర్లలో తరలిస్తున్నారు. వీటిని నెల్లూరు నగరం చుట్టూ వెలిసే లేఅవుట్లకు పంపుతూ భారీ మొత్తంలో దోచుకుంటున్నారు.

దందా ఇలా..

● వెంకటాచలం మండలంలోని సర్వేపల్లి, నాగంభొట్ల కండ్రిగ, శ్రీకాంత్‌కాలనీ, రామదాసుకండ్రిగ గ్రామాల్లోని ప్రభుత్వ, అటవీ పొరంబోకు, పేదలకు పంపిణీ చేసిన అసైన్‌మెంట్‌ భూముల్లో ఎలాంటి అనుమతుల్లేకపోయినా, గ్రావెల్‌ను తరలించి సొమ్ము చేసుకుంటున్నారు.

● పొదలకూరు మండలంలోని మరుపూరు, ప్రభగిరిపట్నం, చిట్టేపల్లి తదితర గ్రామాల్లో టిప్పర్లలో రేయింబవళ్లూ రవాణా చేస్తున్నారు.

● ముత్తుకూరు మండలంలోని పలు గ్రామాల్లోనూ ఇదే పరిస్థతి నెలకొంది.

దిక్కున్న చోట చెప్పుకోండి

వెంకటాచలం మండలం రామదాసుకండ్రిగలో పేదలకు పంపిణీ చేసిన అసైన్‌మెంట్‌ భూముల్లో తవ్వకాలను శనివారం ప్రారంభించారు. ఈ గుంతుల్లో పడి తమ గేదెలు చనిపోతాయని, తమ గ్రామంలో గ్రావెల్‌ను తవ్వొద్దని స్థానికులు అడ్డుకునేందుకు యత్నించగా, తమకు అన్ని అనుమతులున్నాయంటూ వాగ్వాదానికి దిగారు. ఆపే ప్రసక్తే లేదని, దిక్కున్న చోట చెప్పుకోండని బెదిరించడంతో చేసేదేమీలేక గ్రామస్తులు వెనుదిరిగారు.

రామదాసుకండ్రిగలో యంత్రంతో తవ్వకాలు

ఆఫీసర్ల మొద్దు నిద్ర

సర్వేపల్లి నియోజకవర్గంలో గ్రావెల్‌ను అక్రమంగా తవ్వి దోపిడీకి పాల్పడుతున్నా, మొద్దు నిద్రను అధికారులు వీడటంలేదు. అదే సామాన్య రైతులు తమ పొలాల్లోకి మట్టిని తరలించుకోవాలంటే, అనుమతులను ఆఫీసర్లు ఇవ్వడం లేదు. ట్రాక్టర్ల ద్వారా పొలాలు, నివాసాల వద్దకు మట్టిని తరలించేందుకు యత్నిస్తుంటే, ఏఎమ్మార్‌ సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకొని, తమ సంస్థకు నగదు చెల్లించనిదే తవ్వకాలు చేయొద్దంటూ అడ్డుకుంటున్నారని రైతులు మండిపడుతున్నారు. అయితే సర్వేపల్లి ముఖ్యనేత అండతో ప్రభుత్వ భూముల్లో భారీ యంత్రాలతో గ్రావెల్‌ను తవ్వి టిప్పర్ల ద్వారా అక్రమంగా తరలిస్తున్నా, ఎవరూ పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పగలు, రాత్రనే తేడా లేకుండా దందా కొనసాగుతున్నా, జిల్లా అధికార యంత్రాంగం పట్టించుకోకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికై నా అధికారులు స్పందించి కఠిన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement