● ఒకరి మృతి, మరొకరికి తీవ్రగాయాలు
కావలి: లారీ ఢీకొట్టి ఓ యువకుడు మృతిచెందగా, మరో యువకుడికి తీవ్రగాయాలైన ఘటన శనివారం ఉదయం పట్టణంలోని ఏరియా వైద్యశాల సమీపంలో జరిగింది. పోలీసుల కథనం మేరకు.. దగదర్తి మండలం ఉలవపాళ్ల గ్రామానికి చెందిన పొట్లూరి నాగేంద్ర (19), ఎద్దల సాయి గ్రామంలో వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో గ్రామంలో జరిగే తిరునాళ్ల సందర్భంగా కావలిలో దుస్తులను కొనుగోలు చేసేందుకు ద్విచక్ర వాహనంపై వచ్చారు. పట్టణంలోని ఏరియా వైద్యశాల సమీపంలో వీరి బైక్‌ను వెనుక నుంచి లారీ ఢీకొనడంతో నాగేంద్ర అక్కడికక్కడే మృతిచెందాడు. సాయి తీవ్రంగా గాయపడటంతో ఏరియా వైద్యశాలకు తరలించి చికిత్స అందించారు. నాగేంద్ర మృతదేహాన్ని పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. తిరునాళ్ల సమయంలో ఇలాంటి ఘటన జరగడంతో స్వగ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.


