అ.. గౌరవ డాక్టరేట్‌ | - | Sakshi
Sakshi News home page

అ.. గౌరవ డాక్టరేట్‌

Jun 7 2026 9:30 AM | Updated on Jun 7 2026 9:30 AM

వివాదాస్పద రాజకీయ నేత బీదకు ప్రదానం

పచ్చ నేతలను ప్రసన్నం చేసుకునేలా

దిగజారిన వీఎస్‌యూ

నెల్లూరు (టౌన్‌): వీఎస్‌యూ స్నాతకోత్సవాన్ని ఈ నెల 9వ తేదీన స్థానిక వీపీఆర్‌ కన్వెన్షన్‌లో నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఏడాదికి 15 చొప్పున మూడేళ్లకు 45 గోల్డ్‌ మెడల్స్‌, 21 మందికి పీహెచ్‌డీ పట్టాలు, వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన ముగ్గురికి గౌరవ డాక్టరేట్‌లను ప్రదానం చేయనున్నారు. కాగా గౌరవ డాక్టరేట్‌లకు ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్‌ కేఐ వరప్రసాద్‌రెడ్డి, సైన్స్‌, ఉన్నత విద్యారంగంలో విశిష్ట పరిశోధనలు చేసిన ప్రొఫెసర్‌ గోబర్ధన్‌ దాస్‌తోపాటు రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్‌రావును ఎంపిక చేశారు.

బీద ఎంపికపై విమర్శలు

రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్‌రావును గౌరవ డాక్టరేట్‌కు ఎంపిక చేయడంపై పలు విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఆయన వైఎస్సార్‌సీపీ తరఫున రాజ్యసభకు ఎంపికై ఆ తర్వాత నైతిక విలువలకు పాతరేస్తూ పార్టీ ఫిరాయించి అనైతిక రాజకీయ నేతగా అప్రతిష్ట మూటగట్టుకున్నారు. ఇటీవల కావలి తీర ప్రాంతానికి అక్రమంగా వచ్చిన పుదుచ్చేరి బోట్లను స్థానికంగా ఉండే మత్స్యకారులు ప్రాణాలు తెగించి పట్టుకున్నారు. అయితే ఆ బోటును మత్స్యకారులకు సమాచారం లేకుండానే సదరు బీద అర్ధరాత్రి కుట్రలకు తెరలేపి వదిలేసి ద్రోహానికి పాల్పడ్డారు. దీని వెనుక బీద మస్తాన్‌రావు హస్తం ఉందని ఆరోపణలు కాల్‌ డేటా ఆధారంగా బయటపడన విషయం విదితమే. పెద్ద మొత్తంలో నగదు తీసుకుని బోటును పంపించారన్న ఆరోపణలు వెలువెత్తాయి. అలాంటి వ్యక్తిని గౌరవ డాక్టరేట్‌కు ఎంపిక చేయడమేమిటని ప్రశ్నించగా ఆక్వా రంగంలో విశేష కృషి చేసినందుకే అని వర్సిటీ అధికారులు సమాధానం చెప్పారు.

వివరాలను చెప్పేందుకు వర్సిటీ నిరాకరణ

విక్రమ సింహపురి యూనివర్సిటీని దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో ఏర్పాటు చేశారు. ఏడాదికి ఒకసారి నిర్వహించాల్సిన స్నాతకోత్సవాన్ని రెండేళ్లు, లేదా మూడేళ్లకు ఒకసారి వర్సిటీ అధికారులు నిర్వహిస్తున్నారు. ఎన్నేళ్లకు జరిగినా ఒకరికే గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే గతంలో వర్సిటీ స్నాతకోత్సవాలు, గౌరవ డాక్టరేట్‌కు ఎంపిక చేసిన వ్యక్తుల వివరాల కోసం వర్సిటీ కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్‌ను సంప్రదించగా అందరూ చర్చించుకుని చెబుతామని మెసేజ్‌ పంపించారు. తొలుత వివరాలు చెబుతామని చెప్పిన కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్‌ అధికారి తరువాత మనస్సు మార్చుకున్నారు. ఫోన్‌ చేసినా లిఫ్ట్‌ చేయకుండా ఉన్నారు. గతంలో జరిగిన స్నాతకోత్సవాలు, గౌరవ డాక్టరేట్‌లు గోప్యంగా ఎందుకు ఉంచుతున్నారో ఎవరికీ అర్థం కాని పరిస్థితి ఉంది.

రాజకీయాలకతీతంగా వ్యవహరించాల్సిన వీఎస్‌యూ అధికారులు వివాదాస్పద

రాజకీయ నేత, టీడీపీ రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్‌రావుకు గౌరవ డాక్టరేట్‌ ఇవ్వడం విమర్శలకు తావిస్తోంది. అధికార పార్టీ నేతలను ప్రసన్నం చేసుకునేందుకు విక్రమ సింహపురి యూనివర్సిటీ దిగజారుడుతనంగా వ్యవహరిస్తోందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కూటమి అధికారంలోకి వచ్చాక వర్సిటీలు సైతం రాజకీయాలకు వేదికలుగా మారాయి. ఈ క్రమంలో అర్హత, స్థాయి లేని అధికార పార్టీ నేతకు డాక్టరేట్‌ కట్టబెడుతోంది.

రాజకీయ కోణంలో చూడటం లేదు

ఆక్వారంగంలో విప్లవాత్మక మార్పులు, విశేష కృషి చేసినందుకు రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్‌రావును గౌరవ డాక్టరేట్‌కు ఎంపిక చేశాం. ఆయన ఎంతోమందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు. ఆయనను రాజకీయ కోణంలో చూడడం లేదు. గౌరవ డాక్టరేట్‌లకు ఎంతమందినైనా ఎంపిక చేసుకోవచ్చు. ఇంతమంది అనే నిబంధన లేదు.

– అల్లం శ్రీనివాసరావు,

వైస్‌ చాన్సలర్‌, వీఎస్‌యూ

Advertisement
 
Advertisement
Advertisement