నెల్లూరు (టౌన్): నగరంలోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో ఈనెల 10వ తేదీన జిల్లా స్థాయి అండర్–15 బాల, బాలికల చెస్ చాంపియన్‌షిప్ పోటీలను నిర్వహించనున్నట్లు జిల్లా చెస్ అసోసియేషన్ సెక్రటరీ మస్తాన్‌బాబు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా చెస్ అసోసియేషన్, రాయ్ చెస్ అకాడమి సంయుక్తంగా జరిపే పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు ఈనెల 8వ తేదీలోపు 80963 28326, 96033 45326 నంబర్లకు ఫోన్ చేసి పేర్లను నమోదు చేసుకోవాలన్నారు. మొదటి నాలుగు స్థానాలు సాధించిన క్రీడాకారులు విజయవాడలో ఈనెల 13, 14వ తేదీల్లో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధిస్తారన్నారు.
ఊరెళ్లారు.. దోచేశారు
● 30 సవర్ల బంగారు నగల అపహరణ
వెంకటాచలం: ఇంట్లోని వారు బంధువుల ఊరికి వెళ్లగా గుర్తుతెలియని వ్యక్తులు తాళాలు పగులగొట్టి చోరీకి పాల్పడిన ఘటన మండలంలోని చెముడుగుంట గ్రామంలో శనివారం గుర్తించారు. వళ్లూరు లతమ్మ మూడు రోజుల క్రితం ఇంటికి తాళాలు వేసి బంధువుల గ్రామానికి వెళ్లింది. శనివారం ఉదయం లతమ్మ నివాసంలో పనిచేసే మహిళ ఇంటి వద్దకు రాగా తాళాలు పగులగొట్టి ఉండటంతో వెంటనే లతమ్మకు సమాచారం ఇవ్వడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంకటాచలం సీఐ సురేంద్రబాబు, ఎస్సై ఆంజనేయులు ఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ టీమ్ సిబ్బందిని రప్పించి వేలు ముద్రలు సేకరించారు. బీరువాలో 30 సవర్ల బంగారు నగలు, రూ.40 వేల నగదు చోరీకి గురైనట్లు లతమ్మ బంధువులు పోలీసులకు తెలియజేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అగ్నికి ఆహుతైన కారు
మర్రిపాడు: మండలంలోని నెల్లూరు ముంబై జాతీయ రహదారిపై శనివారం కదిరినాయుడుపల్లి అటవీ ప్రాంతంలో ఓ కారు అగ్నికి ఆహుతైంది. ప్రొద్దుటూరు నుంచి పెంచలకోన వెళ్తున్న సమయంలో కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించి వెంటనే వాహనాన్ని నిలిపివేసి అందరిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. కొద్ది సేపటికే మంటలు మరింత వ్యాపించి కారు పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అధిక ఉష్ణోగ్రతలు, సాంకేతిక లోపాల కారణంగా ఇలాంటి ఘటనలు జరుగుతుంటాయని, వాహనదారులు జాగ్రత్తలు పాటించాలని ఎస్సై బలరాంరెడ్డి సూచించారు.
రైలు కిందపడి వృద్ధుడి ఆత్మహత్య
నెల్లూరు(క్రైమ్): గూడ్స్ రైలు కింద పడి వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన కల్లూరుపల్లి హౌసింగ్‌బోర్డు కాలనీ సమీపంలో చైన్నె వైపు వెళ్లే రైలు పట్టాలపై శనివారం చోటుచేసుకుంది. మృతుడు సుమారు 55 నుంచి 60 ఏళ్ల మధ్య ఉండొచ్చు. కాఫీ రంగు హాఫ్ హ్యాండ్స్ షర్ట్, గ్రే రంగు ప్యాంటు ధరించి ఉన్నాడు. సమాచారం అందుకున్న నెల్లూరు రైల్వే ఎస్సై ఎన్.హరిచందన ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. జీజీహెచ్ మార్చురీకి మృతదేహాన్ని తరలించి కేసు నమోదు చేశారు. మృతుని వివరాలు తెలిసిన వారు 92475 75628 నంబర్‌కు తెలియజేయాలని కోరారు.
కండలేరులో 37.540 టీఎంసీల నీరు
రాపూరు: కండలేరు జలాశయంలో శనివారం నాటికి 37.540 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ఈఈ గజేంద్రరెడ్డి తెలిపారు. కండలేరు నుంచి సత్యసాయి గంగ కాలువకు 1,900, హైలెవల్ కాలువకు 50, లోలెవల్ కాలువకు 50, పిన్నేరు కాలువకు 5, మొదటి బ్రాంచ్ కాలువకు 85 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు వివరించారు.


