పింఛన్.. ఈ పదాన్ని వింటేనే ఎంతో మందికి కన్నీరొస్తోంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన దాదాపు ఈ రెండేళ్లలో దీని కోసం అర్హులు కళ్లు కాయలు కాచేలా నిరీక్షిస్తున్నారు. నూతనంగా మంజూరు చేయకపోగా, ఉన్న వాటిని సైతం తొలగిస్తూ సరికొత్త కుట్రలను సర్కార్ అమలు చేస్తోంది. దాదాపు 60 వేల మందికిపైగా ఎదురుచూస్తున్నారంటే, ప్రభుత్వం ఎంత నిర్దయగా వ్యవహరిస్తోందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో 2024 ఏప్రిల్ నాటికి 3.19 లక్షల మంది దీన్ని పొందుతుండగా, ఈ సంఖ్య ప్రస్తుతానికి 2.9 లక్షలకు పరిమితమైంది. అంటే ఈ రెండేళ్లలో దాదాపు 29 మంది వేల మందిని తొలగించి, వీరి జీవనంపై చంద్రబాబు ఎలా దెబ్బకొట్టారో తెలుసుకోవచ్చు. వంచనకు బ్రాండ్ ఆంబాసిడరైన ఈయన పేదల ఆశలతో ఆడుకుంటున్నారని పలువురు మండిపడుతున్నారు.
కొత్తగా ఒక్కటీ ఇవ్వలేదాయే..
నెల్లూరు(పొగతోట): కూటమి ప్రభుత్వం కొలువుదీరి మరో ఆరు రోజుల్లో రెండేళ్లు పూర్తి కానుంది. ఈ కాలంలో కొత్తగా ఒక్కరంటే ఒక్కరికీ పింఛన్‌ను మంజూరు చేయలేదనే వాస్తవం విస్మయానికి గురిచేస్తోంది. భర్త మరణిస్తే భార్యకో.. భార్య మరణిస్తే భర్తకు కేటాయించడం మినహా కొత్త వాటిని ఇచ్చే దిశగా ఎలాంటి చర్యలు చేపట్టడంలేదు. ఫలితంగా వీటిని పొందేందుకు గానూ జిల్లాలో దాదాపు 60 వేల మంది ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నారు.
దరఖాస్తు దాఖలుకూ ఆంక్షలే..
పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకునేందుకు సైతం వీల్లేకుండా ఆంక్షలను సర్కార్ విధించింది. ఫలితంగా అధికారులకు అర్హులు వినతిపత్రాలను సమర్పి ంచి.. ఎప్పుడెప్పుడు వస్తుందాననే గంపెడు ఆశతో నిరీక్షిస్తున్నారు. ఇదంతా ఒక ఎత్తయితే, ఉన్న వాటిని సైతం తొలగించే పనిలో కూటమి ప్రభుత్వం నిమగ్నమైంది. సర్కార్ ఏర్పడిన ఈ రెండేళ్లలో దాదాపు 29 వేలకు పైగా పింఛన్లను తొలగించి వారి కుటుంబాల్లో అంతులేని శోకాన్ని మిగిల్చింది. పరిశీలన పేరుతో దివ్యాంగుల పింఛన్లకు సైతం కోత విధించేందుకు ఉపక్రమించింది.
ఇంత వ్యత్యాసమా..?
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో 2024 ఏప్రిల్ నాటికి జిల్లాలో 3.16 లక్షల మంది పింఛన్‌ను పొందేవారు. అయితే ఈ సంఖ్య ప్రస్తుతం 2,90,009కు పరిమితమైంది. కుట్రలను అమలు చేయడంలో భాగంగా సర్కార్ ఈ రకంగా వ్యవహరిస్తోందనే చర్చా లేకపోలేదు. గ్రామీణ ప్రాంతాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులనే సాకును చూపి వీటికి కోత వేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై అధికారులను ప్రశ్నిస్తే, వారి నుంచి వస్తున్న సమాధానం మరీ విడ్డూరంగా ఉంటోంది. పింఛన్లను పొందే వారిలో ప్రతి నెలా 500 నుంచి వెయ్యి మందికిపైగా మరణిస్తున్నారని, అందుకే ఇలా తగ్గుతోందని చెప్తుండటం విస్మయానికి గురిచేస్తోంది.
దివ్యాంగులనూ వదల్లేదు..
ప్రభుత్వమిచ్చే పింఛన్‌తో కొంత మేర ఊరటగా ఉండే దివ్యాంగులపై సైతం ప్రస్తుత సర్కార్ పైశాచికాన్ని ప్రదర్శించింది. గత ప్రభుత్వ హయాంలో అనర్హులకు మంజూరు చేశారనే సాకును చూపి పరిశీలన ప్రక్రియకు సిద్ధమైంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా భారీ స్థాయిలో వ్యతిరేకత రావడంతో వెనక్కి తగ్గింది. మరోవైపు పంపిణీ ప్రక్రియ ప్రస్తుతం లోపభూయిష్టంగా మారిందనే భావన పలువురిలో వ్యక్తమవుతోంది.
వైఎస్సార్సీపీ హయాంలో
2024 ఏప్రిల్ నాటికి – 3.19 లక్షలు
ప్రస్తుత టీడీపీ ప్రభుత్వంలో.. 2.9 లక్షలు
జగనన్న హయాంలో ఇంటి ముంగిటకే
పేదల కష్టాలను తీర్చాలనే లక్ష్యంతో గత సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నో విప్లవాత్మక కార్యక్రమాలను అమలు చేశారు. ఆయన ఏర్పాటు చేసిన వలంటీర్ల వ్యవస్థ ఎంతో గొప్పగా నిలిచింది. ఎవరూ ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ప్రతి నెలా ఒకటో తేదీ తెల్లవారుజామునే ఠంఛన్‌గా వీరి ద్వారా ఆవ్వాతాతల ఇంటి తలుపులు తట్టి అందజేసేవారు. ప్రభుత్వ కార్యాలయాలు, అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిన అవసరం లేకుండానే, కొత్త పింఛన్ల కోసం ఇంటి నుంచే దరఖాస్తు చేసుకునే వెసులుబాటును వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సర్కార్ కల్పించింది. పూర్తి వివరాలను వలంటీర్ అప్‌లోడ్ చేసిన మరుసటి నెల నుంచే ఇవి మంజూరయ్యేవి. అయితే ప్రస్తుత టీడీపీ హయాంలో ఇవేవీ మచ్చుకై నా కానరావడంలేదు.
బూటకపు హామీలతో పబ్బం
చాపకింద నీరులా తొలగిస్తున్న సర్కార్
కొత్తవి ఇవ్వరు.. పాతవీ ఉంచరు
రెండేళ్లుగా తప్పని ఎదురుచూపులు
ఎవరైనా మరణిస్తేనే ఇస్తారంట..!
పరిశీలన పేరుతో
దివ్యాంగులపై వేధింపులు
జిల్లాలో ఇలా..
విజయమే పరమావధిగా గత ఎన్నికలకు ముందు ఆచరణ సాధ్యం కాని హామీలను చంద్రబాబు గుప్పించారు. ఇదే కోవలో పింఛన్లు సైతం ఉన్నాయి. అయితే ఈ అంశం అమల్లో సర్కార్ ఘోరంగా విఫలమైంది. సంపద సృష్టించి.. సంక్షేమ పథకాలను అమలు చేస్తానంటూ ఇటీవలి కాలంలో ఈయన పదేపదే చెప్తున్నారు. సంపద సృష్టించే అవకాశాల్లేని తరుణంలో.. వీటిని ఎలా నెరవేరుస్తారనే భావన సర్వత్రా వ్యక్తమవుతోంది.


