సాక్షి ప్రతినిధి, నెల్లూరు: సర్వేపల్లి నియోజకవర్గంలో సహజ వనరుల దోపిడీ యథేచ్ఛగా జరుగుతోంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి స్థానిక ముఖ్యనేత కనుసన్నల్లో ఇసుక, గ్రావెల్, బూడిద మాఫియాలు రెచ్చిపోతున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ భూముల్లో గద్దల్లా వాలి గ్రావెల్‌ను తవ్వుతున్నారు. ఎలాంటి అనుమతుల్లేకుండానే ఈ తతంగం జరుగుతుండగా, అడ్డుకోవాల్సిన అధికార యంత్రాంగం మామూళ్ల మత్తులో జోగుతోంది. ఇంత జరుగుతు న్నా, జిల్లా పాలనాధికారి మౌనం వహిస్తుండటం.. అవినీతిని ప్రోత్సహించడమేననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రభుత్వ ఖజానాకు గండి
వెంకటాచలం మండలంలోని సర్వేపల్లి పంచాయతీ పరిధిలో గల నాగంభొట్ల కండ్రిగ, ఈదగాలి పంచాయతీ శ్రీకాంత్ కాలనీ, పొదలకూరు పట్టణానికి సమీపంలోని చిట్టేపల్లి తిప్పలో ఎలాంటి అనుమతుల్లేకుండానే గ్రావెల్‌ను తవ్వుతూ, ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నారు. కూటమి ప్రభుత్వం కొలువుదీరిన నాటి నుంచి గ్రావెల్ అక్రమ రవాణా విచ్చిలవిడిగా సాగుతోంది.
రేయింబవళ్లూ..
నాగంభొట్లకండ్రిగలోని నివాసాల చుట్టూ ఉన్న సుమారు 70 ఎకరాల ప్రభుత్వ భూముల్లో గ్రావెల్‌ను రేయింబవళ్లూ టిప్పర్లలో నెల్లూరులోని లేఅవుట్లకు రవాణా చేస్తున్నారు. నియోజకవర్గ పరిధిలో నిత్యం దాదాపు వందకుపైగా వాహనాలతో గ్రావెల్ అక్రమ రవాణా సాగుతోంది. టిప్పర్ లోడింగ్‌కు రూ.పది వేల చొప్పున నిత్యం రూ.పది లక్షల వరకు వసూలు చేస్తున్నారు. ఖర్చులు పోనూ మిగిలిన మొత్తాన్ని పంచుకుంటున్నారు.
గ్రామస్తులకు బెదిరింపులు
నాగంభొట్ల కండ్రిగలో గ్రావెల్ అక్రమ రవాణాతో నివాసాల చుట్టూ భారీ గోతులు ఏర్పడి, ఇళ్లన్నీ ఎర్రమట్టితో నిండిపోయాయి. దీంతో టిప్పర్లను గ్రామస్తులు ఇటీవల అడ్డుకొని తవ్వకాలను నిలిపేయాలని పేర్కొన్నారు. విషయం తెలుసుకున్న నిర్వాహకులు.. పూటుగా మద్యం సేవించి కారులో నలుగురితో కలిసి గ్రామానికి చేరుకొని బెదిరింపులకు గురిచేశారని స్థానికులు ఆరోపించారు. అడ్డుకునేందుకు యత్నిస్తే నాన్ బెయిలబుల్ కేసులు మోపి.. జైల్లో పెట్టిస్తామని బెదిరించారని తెలిపారు.
చర్యలేవీ..?
సర్వేపల్లి పంచాయతీలో ఏడాదిన్నరగా గ్రావెల్ తవ్వకాలను మాఫియా ఇష్టారాజ్యంగా జరుపుతోంది. అనుమతుల్లేకుండానే రూ.కోట్ల విలువైన గ్రావెల్‌ను దోచుకుంటున్నారు. విషయం జిల్లా ఉన్నతాధికారులకు తెలిసినా పట్టించుకోవడంలేదు. సర్వేపల్లి ముఖ్యనేత అండదండలతో మాఫియా రెచ్చిపోతోందని టీడీపీ నేతలే బహిరంగంగా చెప్తున్నారు. ప్రజలు తమ నివాసాల వద్దకు ట్రాక్టర్లలో మట్టిని తరలిస్తుంటే రెవెన్యూ అధికారులు, పోలీసులు వెంటనే వచ్చి అడ్డుకుంటున్నారు. అయితే సర్వేపల్లిలో నిబంధనలకు విరుద్ధంగా భారీ గోతులు పెట్టి తరలిస్తున్నా, అటువైపు కన్నెత్తి చూడటంలేదు. నిర్వాహకుల నుంచి నెలనెలా ముడుపులు తీసుకుంటూ పట్టించుకోవడంలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈదగాలి పంచాయతీ పరిధిలోని శ్రీకాంత్‌కాలనీలోనూ కొన్ని రోజులుగా గ్రావెల్‌ను అక్రమంగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. గ్రామంలో ఇటీవల ఓ వ్యక్తి గ్రావెల్ గుంతలో పడి మృతి చెందారు. అయినా లెక్క చేయకుండా తవ్వుతుండటంపై ప్రజలు మండిపడుతున్నారు. జిల్లా ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని రవాణాను అడ్డుకోవాలని కోరుతున్నారు.
సర్వేపల్లిలో రెచ్చిపోతున్న గ్రావెల్ మాఫియా
ప్రభుత్వ భూముల్లోనూ
ఇష్టారాజ్యంగా తవ్వకాలు
ముఖ్యనేత అండతో
రెచ్చిపోతున్న వైనం
పట్టించుకోని అధికారులు
జరుగుతోందిలా..
మైనింగ్ అధికారుల లెక్కల మేరకు ఎకరా భూమిలో మీటర్ లోతున తవ్వకాలు జరిపితే నాలుగు వేల ఘనపు మీటర్లలో ఖనిజం (గ్రావెల్) లభిస్తుంది. టిప్పర్‌లో పూర్తిగా నింపితే 12 క్యూబిక్ మీటర్లు పడుతుంది. అంటే ఎకరాకు 400 టిప్పర్ల మేర వస్తుంది. ఈ తరహాలో ఎకరాకు 4800 క్యూబిక్ మీటర్ల మేర రవాణా అవుతోంది. టిప్పర్‌కు రూ.పది వేల చొప్పున లెక్క కడితే ఎకరాకు రూ.నాలుగు కోట్ల వరకు వస్తుంది. ఎకరాలో మీటర్ లోతులో తవ్వకాలు జరిపి.. మరీ 15 మీటర్ల లోతు తీస్తే రూ.కోట్లల్లో ఉంటోందని తెలుస్తోంది. ఇలా సర్వేపల్లి నియోజకవర్గంలో దాదాపు వందెకరాల్లో గ్రావెల్ దందా నడుస్తోంది.


