వెన్నుపోటు చంద్రబాబుకు కొత్తకాదు | - | Sakshi
Sakshi News home page

వెన్నుపోటు చంద్రబాబుకు కొత్తకాదు

Jun 6 2026 12:35 AM | Updated on Jun 6 2026 12:35 AM

ప్రజలకిచ్చిన హామీలను

నెరవేర్చని ప్రభుత్వం

మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి

పొదలకూరు: వెన్నుపోటు పొడవడం సీఎం చంద్రబాబుకు కొత్తకాదని.. ఎన్టీఆర్‌ హయాం నుంచి ఇప్పటి ప్రజల వరకు ఆయన పోటుకు బలైన వారేనని మాజీ మంత్రి, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి ధ్వజమెత్తారు. వెన్నుపోటుకు రెండేళ్లు నిరసన కార్యక్రమాన్ని పట్టణంలోని సంగం రోడ్డు సెంటర్‌లో గల కాకాణి రమణారెడ్డి విగ్రహం వద్ద పార్టీ శ్రేణులు, అభిమానులతో కలిసి శుక్రవారం ఆయన నిర్వహించారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు ఇచ్చిన హామీల ప్రతులను దహనం చేశారు. సంగం రోడ్డు సెంటర్‌ నుంచి పంచాయతీ బస్టాండ్‌ వరకు పెద్ద ఎత్తున నిరసన ర్యాలీని జరిపారు. ఈ సందర్భంగా కాకాణి మాట్లాడారు. అసెంబ్లీలో మూడు బడ్జెట్లను చంద్రబాబు ప్రవేశపెట్టినా, ఏ హామీనీ నెరవేర్చలేదని ధ్వజమెత్తారు. గతంలో ఎన్టీఆర్‌కు ఏ విధంగా వెన్నుపోటు పొడిచి పార్టీని లాక్కున్నారో.. అదే తరహాలో ప్రజలకు అబద్ధపు హామీలిచ్చి పాలనను సాగిస్తున్నారని మండిపడ్డారు. సూపర్‌ సిక్స్‌ను పూర్తిగా విస్మరించారని, ఆడబిడ్డ నిధి ద్వారా రెండేళ్లలో ఒక్కో మహిళకు రూ.36 వేల మేర బాకీ పడ్డారని విమర్శించారు. మరోవైపు సూపర్‌ సిక్స్‌.. హిట్‌ అంటూ సభలు, సమావేశాలను పెడుతున్నారని ఎద్దేవా చేశారు. నిరుద్యోగ భృతి, ఉచిత బస్సు ప్రయాణంలో కొర్రీలు, గ్యాస్‌ సిలిండర్ల హామీలో నాలుక మడతపెట్టడాన్ని ప్రజలు గమనిస్తూనే ఉన్నారన్నారు. కౌలు రైతులకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చి, అన్నదాత సుఖీభవలో ఏడు లక్షల మంది అన్నదాతల పేర్లను తొలగించారని ఆరోపించారు. 50 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ పింఛన్‌ను ఇస్తానని చెప్పి మోసం చేశారని, మెగా డీఎస్సీ పేరుతో దగా డీఎస్సీగా మార్చారని ధ్వజమెత్తారు. దీనిపై ఎవరైనా మాట్లాడితే కేసులు పెట్టమని చెప్పి హిట్లర్‌ను తలపిస్తున్నారని దుయ్యబట్టారు.

అభివృద్ధిపై సవాల్‌కు జవాబేదీ..?

పొదలకూరు మండలాభివృద్ధిపై సోమిరెడ్డి చేసిన సవాల్‌కు ప్రతి సవాల్‌ చేస్తే ఇప్పటి వరకు జవాబు లేదని విరుచుకుపడ్డారు. తన చోటా నేతలను పంపి ఇరిగేషన్లో జరిగిన అవినీతిని కప్పిపుచ్చేందుకు యత్నిస్తే కుదరదని, సోమిరెడ్డే చర్చకు రావాలని డిమాండ్‌ చేశారు. పొదలకూరు బస్టాండ్‌లో ప్రయాణికులు, బస్సులు నడుస్తున్న రోడ్డు మొదలుకొని గ్రామాల్లో జరిగిన పనులపై చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. ఇరిగేషన్‌ అధికారులు త్వరలో అన్ని రకాల విచారణలను ఎదుర్కోక తప్పదని చెప్పారు. సోమిరెడ్డి చెప్పిన విధంగా వ్యవహరించిన అధికారులు ఇప్పుడు డబ్బుల కట్టలను లెక్క పెట్టుకుంటున్నారని, భవిష్యత్తులో ఊచలు లెక్కపెట్టుకోవాల్సి వస్తుందని తెలిపారు. ప్రతి గ్రామానికీ ఇద్దరం వెళ్లి.. ఎవరి హయాంలో ఎంత అభివృద్ధి జరిగిందో తేల్చుకుందామని సవాల్‌ విసిరారు. సోమిరెడ్డి హయాంలో తిప్పలు కరిగిపోతున్నాయని, లేఅవుట్ల యజమానుల వద్ద వసూలు చేసుకుంటూ ప్రభుత్వ స్థలాలను దోచుకుంటున్నారని ఆరోపించారు. కనుపూరు కాలువ పనులను మనుషులతో చేయించాలని, అయితే సోమిరెడ్డి మాత్రం రూ.పది లక్షల వంతున బిట్లుగా మార్చి మెషీన్లతో చేయించి స్వాహా చేశారని విమర్శించారు. నేతలు గోగిరెడ్డి గోపాల్‌రెడ్డి, బచ్చల సురేష్‌కుమార్‌రెడ్డి, కోనం చినబ్రహ్మయ్య, తెనాలి నిర్మలమ్మ, లక్ష్మీకల్యాణి, షాకీరాబేగం, వాకాటి శ్రీనివాసులురెడ్డి, చిల్లకూరు వెంకురెడ్డి, వేణుగోపాల్‌రెడ్డి, రావుల ఇంద్రసేన్‌గౌడ్‌, హరిశ్చంద్రారెడ్డి, శ్రీనివాసులు, అంజద్‌, లచ్చారెడ్డి, దయాకర్‌రెడ్డి, రామిరెడ్డి, శ్రీనివాసులురెడ్డి, బాలకొండారెడ్డి, రమణారెడ్డి, పెంచలరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement