నెల్లూరు(అర్బన్): పర్యావరణాన్ని కాపాడుకుంటేనే జీవరాశుల మనుగడ సజావుగా సాగుతుందని, లేని పక్షంలో అనర్థాలు తప్పవని జేసీ మొగిలి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని వీఆర్సీ గ్రౌండ్స్ నుంచి మద్రాస్ బస్టాండ్ వరకు హరిత ర్యాలీని జిల్లా కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించారు. పర్యావరణాన్ని కాపాడుకుందాం అంటూ ప్లకార్డులను ప్రదర్శించారు. డప్పుల ప్రదర్శన ఆకట్టుకుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్లాస్టిక్ వాడకాన్ని నియంత్రించడంతో పాటు చెట్లను పెంచాలని పిలుపునిచ్చారు. వివిధ పాఠశాలల విద్యార్థులకు ఇటీవల నిర్వహించిన పోటీల్లో విజేతలకు బహుమతులను అందజేశారు. కాలుష్య నియంత్రణ బోర్డు ఈఈ అశోక్‌కుమార్, కమిషనర్ నందన్ తదితరులు పాల్గొన్నారు.
జూనియర్ కళాశాలల
పునఃప్రారంభం నేడు
నెల్లూరు (టౌన్): వేసవి సెలవుల అనంతరం జూనియర్ కళాశాలలను శనివారం పునఃప్రారంభించనున్నారు. దీంతో విద్యార్థులు కాలేజీల బాట పట్టనున్నారు. కాగా శని, ఆదివారాలు రావడంతో జిల్లాలోని మెజార్టీ కళాశాలలను సోమవారం ప్రారంభించే యోచనలో ఉన్నారని తెలుస్తోంది.
ఉచిత ప్రవేశానికి ఫీజులు
వసూలు చేస్తే చర్యలు
నెల్లూరు (టౌన్): జిల్లాలోని కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలల్లో 12 (1సీ) కింద ఒకటో తరగతిలో ప్రవేశం పొందిన విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేస్తే చర్యలు తప్పవని డీఈఓ బాలాజీరావు శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉచిత ప్రవేశం కల్పించిన విద్యార్థులందరికీ ఆయా పాఠశాలల్లో ఆడ్మిషన్‌ను తప్పక ఇవ్వాలని ఆదేశించారు.
శ్రీవారి దర్శనానికి
24 గంటలు
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ శుక్రవారం ఎక్కువగా ఉంది. క్యూ కాంప్లెక్స్‌లోని 31 కంపార్ట్‌మెంట్లు నిండిపోయాయి. స్వామివారిని 75,691 మంది గురువారం అర్ధరాత్రి వరకు దర్శించుకున్నారు. తలనీలాలను 39,050 మంది అర్పించారు. కానుకల రూపంలో హుండీలో రూ.4.16 కోట్లను సమర్పించారు. టైమ్ స్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. ఇవి లేని వారికి 24 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక టికెట్లు కలిగిన వారు మూడు గంటల్లోనే దర్శించుకోగలుగుతున్నారు.


