వెంకటాచలం: విక్రమ సింహపురి యూనివర్సిటీ 10, 11, 12వ స్నాతకోత్సవ వేడుకలను నెల్లూరులోని వీపీఆర్ కన్వెన్షన్ సెంటర్‌లో ఈ నెల తొమ్మిదిన నిర్వహించనున్నామని వీసీ అల్లం శ్రీనివాసరావు చెప్పారు. కాకుటూరు సమీపంలోని వర్సిటీలో విలేకరుల సమావేశంలో శుక్రవారం ఆయన మాట్లాడారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ ముఖ్యఅతిఽథిగా హాజరై, విద్యార్థులకు పట్టాలు, స్వర్ణ పతకాలను అందజేయనున్నారని వివరించారు. స్నాతకోత్సవానికి సంబంధించి 6017 మంది దరఖాస్తు చేసుకోగా, వీరిలో డిగ్రీ కోర్సుల నుంచి 4921 మంది.. పీజీ అండ్ ప్రొఫెషనల్ కోర్సుల నుంచి 1075 మంది.. 21 మంది పరిశోధక విద్యార్థులు పీహెచ్‌డీ పట్టాలను అందుకోనున్నారని తెలిపారు. పీజీ విద్యార్థుల్లో సైన్స్ విభాగం నుంచి 331.. ఆర్ట్స్ నుంచి 37.. కామర్స్ అండ్ మేనేజ్‌మెంట్ నుంచి 67 మంది పట్టాలను స్వీకరించనున్నారని పేర్కొన్నా రు. వివిధ విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభను కనబర్చిన క్రీడాకారులు, విద్యార్థులకు కలిపి మొత్తం 45 స్వర్ణ పతకాలను గవర్నర్ చేతుల మీదుగా అందజేయనున్నామని తెలిపారు. దేశానికి సేవలందించిన ముగ్గురు ప్రముఖులకు వీఎస్‌యూ తరఫున ప్రతిష్టాత్మక గౌరవ డాక్టరేట్ పురస్కారాలను అందజేయనున్నామని వెల్లడించారు. ఇన్‌చార్జి రిజిస్ట్రార్ సునీత, వర్సిటీ కళాశాల ప్రిన్సిపల్ విజయ, పరీక్షల విభాగ డీన్ వెంకట్రాయులు, పరీక్షల నిర్వహణాధికారి మధుమతి తదితరులు పాల్గొన్నారు.


