దగదర్తి: ఉలవపాళ్లలో దళితుల శ్మశాన భూమిని కొందరు ఆక్రమించేందుకు యత్నించిన నేపథ్యంలో సర్వేను రెవెన్యూ అధికారులు శుక్రవారం నిర్వహించారు. వివాదాస్పద భూమి హద్దులను పరిశీలించారు. దళితుల శ్మశాన భూమి ఆక్రమణకు యత్నం అనే శీర్షికన సాక్షిలో కథనం గురువారం ప్రచురితం కావడంతో అధికారులు స్పందించారు. ఈ సందర్భంగా దళితులు మాట్లాడారు. గ్రామంలోని కొందరు వ్యక్తులు తమ స్వలాభం కోసం శ్మశాన భూమిని కబ్జాదారులకు అప్పగించేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. తామంతా ఏకమై అడ్డుకోవడంతో వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయని తెలిపారు. రెవెన్యూ అధికారుల సహకారంతో కొందరు వ్యక్తులు ఆక్రమించేందుకు యత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా సర్వే వివరాలను తహసీల్దార్‌కు నివేదిక రూపంలో అందజేయనున్నామని అధికారులు తెలిపారు.


