కూటమి సమర్పించు
● అధిక ధరలకు విక్రయాలు
● మద్యంప్రియుల జేబులకు చిల్లు
● వేళలు పాటించని షాపులు
● పల్లె పల్లెకు బెల్ట్ దుకాణాలకు
మద్యం సరఫరా
● పెరిగిన నేరాలు
● మామూళ్ల మత్తులో ఎకై ్సజ్ అధికారులు?
వింజమూరు(ఉదయగిరి): వింజమూరు ఎకై ్సజ్ పరిధిలోని కొండాపురం, వింజమూరు, కలిగిరి మండలాల్లో అధికారిక మద్యం దుకాణాల్లో అధిక ధరలకు విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ఎవరైనా అధిక రేట్ల గురించి ప్రశ్నిస్తే ప్రభుత్వం ధరలు పెంచిందని సమాధానం ఎదురవుతోంది. ఎలాంటి జంకు లేకుండా ప్రతి బాటిల్‌పై అదనంగా రూ.10 వరకు వసూలు చేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అధిక ధరలకు మద్యం విక్రయిస్తే షాపుల నిర్వాహకులపై పెనాల్టీలు విధించి కేసులు నమోదు చేయాల్సి ఉంటుంది. అయితే ఈ వ్యవహారం ఎకై ్సజ్ అధికారులకు తెలిసే జరుగుతున్నా మౌనంగా ఉండటం అనుమానాలకు తావిస్తోంది. అక్రమ విక్రయాలను అరికట్టాల్సిన అధికారులు నెలవారీ మామూళ్లు తీసుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. వింజమూరు మండల కేంద్రంలో నాలుగు మద్యం దుకాణాలున్నాయి. బంగ్లా సెంటర్‌లో జాతీయ రహదారి పక్కనే రెండు నిర్వహిస్తున్నారు. నిబంధనల ప్రకారం జాతీయ రహదారికి కనీసం 200 మీటర్ల దూరంలో షాపులుండాలి. అయితే ఇక్కడ ఆ నిబంధనలు అమలు కావడం లేదు.
అయినా కొనసాగింపు
రెండేళ్ల క్రితం జాతీయ రహదారి పనులు పూర్తికాక ముందు నిర్వాహకులు కోర్టు స్టే తెచ్చుకుని దుకాణం నిర్వహించారు. ప్రస్తుతం రహదారి పనులు పూర్తై టోల్ వసూళ్లు కూడా జరుగుతున్నప్పటికీ షాపు కొనసాగుతుండటంపై అధికారులు స్పందించడం లేదు. అలాగే ప్రస్తుతం ఉన్న దాని పక్కనే జల్సా పేరుతో మరొక దుకాణాన్ని పెట్టారు. అది కూడా హైవే పక్కనే నిబంధనలకు విరుద్ధంగా నడుస్తోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. మరో షాపు శిరీషా సినీహాల్ సమీపంలో, ఇంకొకటి పాత దేవతా మహాల్ పక్కన నిర్వహిస్తున్నారు. అందరూ సిండికేట్‌గా మారి అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్నారు. అంతేకాకుండా విక్రయ సమయాలను కూడా పాటించడం లేదని తెలుస్తోంది. తెల్లవారుజామున 4 గంటల నుంచే విక్రయాలు ప్రారంభించి రాత్రి 11 గంటల వరకు కొనసాగిస్తున్నట్లు సమాచారం. కొన్ని షాపులు వెనుకవైపు నుంచి కూడా మద్యం విక్రయాలు జరుపుతున్నాయని చెబుతున్నారు.
బెల్ట్ షాపుల జోరు
అధికారిక మద్యం దుకాణాల నిర్వాహకులు సిండికేట్‌గా ఏర్పడి వింజమూరు మండలంలోని 12 గ్రామ పంచాయతీల పరిధిలోని పల్లెలకు ఆటోలు, బైక్‌లు, స్కూటీల ద్వారా మద్యం సరఫరా చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. దీంతో ఒక్కో గ్రామంలో మూడు నుంచి నాలుగు చోట్ల వరకు బెల్ట్ దుకాణాలు నడుస్తున్నాయి. గ్రామ జనాభాను బట్టి బెల్ట్ షాపుల సంఖ్య కూడా పెరుగుతోంది. అక్కడ ఒక్కో బాటిల్‌పై రూ.30 నుంచి రూ.50 వరకు అదనంగా వసూలు చేస్తున్నట్లు సమాచారం.
అనేక సమస్యలు
గ్రామాల్లో మద్యం సేవనం పెరిగి గొడవలు, ఇతర అసాంఘిక కార్యకలాపాలు అధికమవుతున్నాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కొండాపురం, వింజమూరు మండలాల్లో జరిగిన కొన్ని హత్యలు కూడా మద్యం మత్తులో జరిగినవేనని స్థానికులు పేర్కొంటున్నారు. అన్ని వేళల్లో బెల్ట్ షాపులు అందుబాటులో ఉండటంతో కొందరు యువకులు మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇటీవల వరికుంటపాడు మండలంలోని ఓ గ్రామంలో మత్తులో ఉన్న యువకుడు అర్ధరాత్రి సమయంలో ఓ మహిళపై లైంగికదాడికి యత్నించడంతో కేసు నమోదైంది. అనేక గ్రామాల్లో చీకటి పడగానే యువత గుంపులుగా చేరి మద్యం సేవిస్తూ రోడ్లపై హల్‌చల్ చేస్తున్నారని మహిళలు వాపోతున్నారు.


