విడవలూరు: మండలంలోని గాదెలదిన్నె గ్రామం ఎస్టీ కాలనీలో ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన విషాదకర ఘటన శుక్రవారం వెలుగు చూసింది. మేనమామ ఇంటికి వెళ్లేందుకు భర్త, కుటుంబ సభ్యులు నిరాకరించడంతో మనస్తాపానికి గురైన మహిళ పురుగు మందు తాగి బలవన్మరణానికి పాల్పడింది. పోలీసుల కథనం మేరకు.. గాదెలదిన్నెకు చెందిన రాచగిరి సుబ్బరత్న (29) తన భర్త శివయ్యతో కలిసి నివాసం ఉంటోంది. గురువారం సాయంత్రం ఇసుకపాళెంలో ఉన్న తన మేనమామ ఇంటికి వెళ్లాలని కోరగా, భర్తతోపాటు కుటుంబ సభ్యులు అందుకు అంగీకరించలేదు. దీంతో మనస్తాపానికి గురైన సుబ్బరత్న ఇంట్లో ఉన్న పురుగు మందు తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను 108 అంబులెన్స్‌లో నెల్లూరులోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో శుక్రవారం ఉదయం చనిపోయింది. కుమార్తె మృతితో తల్లిదండ్రులు పద్మ, శేషయ్య తీవ్ర విషాదంలో మునిగిపోయారు. మృతికి గల కారణాలపై సమగ్ర దర్యాప్తు జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేశారు.
చక్రాల కింద నలిగిన ప్రాణం
● గుర్తుతెలియని వాహనం ఢీకొని
వివాహిత మృతి
● భర్తకు గాయాలు
చిల్లకూరు: ఓ వ్యక్తి తన భార్యాబిడ్డతో మోటార్‌బైక్‌పై ఊరికి బయలుదేరాడు. అయితే గుర్తుతెలియని వాహనం ఢీకొని వివాహిత మృతిచెందిన విషాదకర ఘటన గురువారం అర్ధరాత్రి వరగలి క్రాస్‌రోడ్డు ప్రాంతంలో జరిగింది. పోలీసుల కథనం మేరకు.. ఏర్పేడు మండలం సరస్వతి కండ్రిగకు చెందిన గోపీ నెల్లూరులోని ఓ ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలో పనిచేస్తున్నాడు. అక్కడే ఇల్లు అద్దెకు తీసుకుని నివాసముంటున్నాడు. అతని కుటుంబ సభ్యులకు ఇబ్బందిగా ఉందని ఫోన్ రావడంతో శువ్రారం ఉదయం బయల్దేరుదామని అనుకున్నారు. అయితే గోపీ భార్య లాలిత్య (23) వెంటనే వెళ్దామని చెప్పడంతో రెండేళ్ల పాపను తీసుకుని బైక్‌పై బయలుదేరారు. చిల్లకూరు మండలం వరగలి క్రాస్‌రోడ్డు వద్ద బ్రిడ్జి పనుల నిమిత్తం మలుపు ఏర్పాటు చేశారు. గోపీ బైక్‌ను మలుపుతిప్పే సమయంలో వెనుకనుంచి గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. లాలిత్య అదే వాహనం వెనుక చక్రాల కింద పడి అక్కడికక్కడే మృతిచెందింది. గోపీకి గాయాలయ్యాయి. చంటి బిడ్డకు ఎలాంటి గాయాలు కాలేదు. సమాచారం అందుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రుడిని గూడూరు ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఎస్సై సురేష్‌బాబు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేశారు.
విద్యుదాఘాతానికి గురై వ్యక్తి మృతి
సంగం: మండలంలోని సిద్ధీపురం గ్రామంలో విద్యుదాఘాతానికి గురై రావూరు శీనయ్య (47) అనే వ్యక్తి శుక్రవారం మృతిచెందాడు. కుటుంబ సభ్యుల కథనం మేరకు.. శీనయ్య ఇంట్లో పనిచేస్తూ కమ్ములు ఎత్తుతున్న సమయంలో ప్రమాదవశాత్తు సమీపంలో ఉన్న మెయిన్ విద్యుత్ తీగలను తాకడంతో షాక్‌కు గురయ్యాడు. స్థానికుల సమాచారంతో 108 అంబులెన్స్ సిబ్బంది వచ్చి పరిశీలించి శీనయ్య మృతిచెందినట్లు నిర్ధారించారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. వారు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు.
నిబంధనలతో మాకేం పని..
సైదాపురం: ఖనిజాన్ని తరలించే టిప్పర్లు, లారీలు నిబంధనలకు విరుద్ధంగా అధిక టన్నేజీతో తరలిపోతున్నాయి. ఈ విషయం తెలిసినా అధికారులు పట్టించుకోవడం లేదు. 18 టన్నులు తరలించాల్సిన టిప్పర్లు అంతకుమించి తరలిస్తుండటం నిత్యం ప్రమాదాలకు కూడా దారితీస్తోంది. ఉన్నతాధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
కండలేరులో
37.750 టీఎంసీలు
రాపూరు: కండలేరు జలాశయంలో శుక్రవారం నాటికి 37.750 టీఎంసీ నీరు నిల్వ ఉన్నట్లు ఈఈ గజేంద్రరెడ్డి తెలిపారు. కండలేరు నుంచి సత్యసాయి గంగ కాలువకు 1,900, లోలెవల్ కాలువకు 50, పిన్నేరు కాలువకు 5, మొదటి బ్రాంచ్ కాలువకు 85 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు.


