● వ్యవసాయ పరిశోధన స్థానం
శాస్త్రవేత్త వినీత
నెల్లూరు(వేదాయపాళెం): రైతులు అధిక దిగుబడులు సాధించాలంటే నాణ్యమైన విత్తనాల ఎంపికకు ప్రాధాన్యమివ్వాలని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నెల్లూరు వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ యు.వినీత అన్నారు. జాతీయ విత్తన దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం నెల్లూరులోని పరిశోధన స్థానం సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ఏ పంటకై నా నాణ్యమైన విత్తనాలు ఉపయోగించినప్పుడే అధిక దిగుబడులు సాధించవచ్చన్నారు. విత్తనాల నాణ్యతలో లోపాలుంటే రైతులు నష్టపోయే అవకాశం ఉందని హెచ్చరించారు. వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు సిఫార్సు చేసిన విత్తనాలను ఉపయోగించడం ద్వారా అధిక దిగుబడులు సాధించడమే కాకుండా సమయం, శ్రమ ఆదా అవుతాయన్నారు. విత్తనాల కొనుగోలు సమయంలో సంబంధిత బిల్లులను భద్రపరచుకోవాలని, భవిష్యత్‌లో ఏవైనా సమస్యలు ఎదురైతే అవి ఉపయోగపడతాయని సూచించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారిణి పి.సత్యవాణి, ఆత్మ పీడీ శారద, తిరుపతి వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ప్రతిమ, శాస్త్రవేత్తలు డాక్టర్ వెంకయ్య, డాక్టర్ కిరణ్‌కుమార్, విశ్రాంత సీనియర్ శాస్త్రవేత్తలు వై. సూర్యనారాయణ, పి.రమేష్‌బాబు, రైతులు పాల్గొన్నారు.


