● జనవిజ్ఞాన నేతలు
నెల్లూరు(అర్బన్): పరిశ్రమల పేరుతో స్వలాభం కోసం ఇష్టారాజ్యంగా చెట్లు, అడవులను నరికేస్తుండటంతోనే భూతాపం పెరిగిపోతోందని జనవిజ్ఞాన వేదిక (జేవీవీ) నాయకులు అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జేవీవీ ఆధ్వర్యంలో శుక్రవారం నెల్లూరులోని హరనాథపురంలో ఉన్న డాక్టర్ జెట్టి శేషారెడ్డి విజ్ఞాన కేంద్రంలో పర్యావరణంపై డాక్టర్ శ్రీనునాయక్ అధ్యక్షతన చర్చాగోష్టి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆవేదిక పర్యావరణ సబ్ కమిటీ జిల్లా కన్వీనర్ డాక్టర్ ఎండీ రఫీ మాట్లాడుతూ ప్లాస్టిక్ వల్ల పర్యావరణంతోపాటు భూమి కలుషితమైందన్నారు. ఫలితంగా గ్లోబల్ వార్మింగ్ పెరిగి అతివృష్టి, అనావృష్టి, అంటువ్యాధులు, విషజ్వరాలు, కేన్సర్ లాంటివి నేడు సమాజాన్ని పట్టి పీడిస్తున్నాయన్నారు. విద్యుత్, నీటి వృథాను అరికట్టాలన్నారు. పరిశ్రమలు స్థాపించే వారు ముందుగా 30 శాతం భూమిలో మొక్కలు పెంచిన తర్వాతనే లైసెన్సులు ఇవ్వాలన్నారు. కఠిన నిర్ణయాలు అమలు చేస్తేనే భూతాపాన్ని తగ్గించవచ్చన్నారు. కార్యక్రమంలో జేవీవీ జిల్లా అధ్యక్షుడు ఎంవీ చలపతి, మోహన్‌రెడ్డి, మాదాల రాము, హరిప్రసాద్, రవీంద్రరెడ్డి, బాషా పాల్గొన్నారు.


