కన్నీటి సుడిలో కాసుల వేట | - | Sakshi
Sakshi News home page

కన్నీటి సుడిలో కాసుల వేట

Jun 5 2026 12:30 AM | Updated on Jun 5 2026 12:30 AM

కమీషన్ల రాజ్యం

నెల్లూరు(అర్బన్‌): నగరంలోని కిసాన్‌నగర్‌–మల్లెతోట ప్రాంతానికి చెందిన ఎస్కే ఫయాజ్‌(54) రెక్కాడితే గాని డొక్కాడని అత్యంత నిరుపేద కుటుంబానికి చెందిన వ్యక్తి. గత ఐదేళ్లుగా పక్షవాతంతో బాధపడుతున్నాడు. వారం క్రితం మళ్లీ స్ట్రోక్‌ రావడంతో భార్య, బిడ్డలు సోమవారం పెద్దాస్పత్రికి తీసుకొచ్చి అడ్మిట్‌ చేశారు. చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతిచెందాడు. శవాన్ని ఇంటికి తరలించేందుకు కూడా మృతుడి భార్య దగ్గర నగదు లేదు. దీంతో తెలిసిన వారు బాడీని తరలించేందుకు నగదు ఏర్పాటు చేశారు. రోగి బంధువులు ఆస్పత్రి బయట ఉండే అంబులెన్స్‌లలో ఒకరితో మాట్లాడి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉండే ఇంటి వద్దకు శవాన్ని చేర్చడానికి బాడుగ మాట్లాడుకున్నారు. రూ.1,500 కావాలని అంబులెన్స్‌ యజమానిని కోరగా అందుకు అంగీకరించారు. అంబులెన్స్‌ను ఆస్పత్రిలోనికి తీసుకుని వస్తుండగా గేటు వద్ద జీకే అని రాయబడిన మరో అంబులెన్స్‌ డ్రైవర్‌ అడ్డుకున్నాడు. సీరియల్‌ ప్రకారం నేను మాత్రమే అంబులెన్స్‌ను తీసుకెళ్లాలి. నీవు ఎలా తీసుకెళ్తావ్‌ అంటూ మొదటి అంబులెన్స్‌ వ్యక్తిపై యుద్ధానికి సిద్ధమయ్యాడు. దీంతో రూ.1,500 బాడుగకు ఒప్పుకున్న వ్యక్తి తప్పుకున్నాడు. వెంటనే జీకే అంబులెన్స్‌ డ్రైవర్‌ తనకు రూ 2,500 ఇస్తేనే శవాన్ని తరలిస్తానని తేల్చి చెప్పాడు. ఇది అన్యాయమని, మా దగ్గర డబ్బులు లేవు.. పేదవారం.. మొదటి అంబులెన్స్‌ వ్యక్తి ఒప్పుకున్న విధంగా రూ.1,500 ఇస్తామంటే జీకే అంబులెన్స్‌ డ్రైవర్‌ ఒప్పుకోలేదు. ఇలా ఒకటిన్నర గంట సేపు జరిగిపోయింది. శవాన్ని ఆస్పత్రి వద్ద రోడ్డుపై స్ట్రెచర్‌లోనే ఉంచారు. ఇక చేసేదేమి లేక రెండో అంబులెన్స్‌ డ్రైవర్‌ అడిగినంత ఇచ్చుకుని శవాన్ని తీసుకెళ్లారు.

అందుబాటులో లేని మహా ప్రస్థానం వాహనాలు

పెద్దాస్పత్రిలో ఎవరైనా మరణిస్తే మృతదేహాన్ని ఇంటి వద్దకు ప్రభుత్వ ఆస్పత్రి యాజమాన్యం మహా ప్రస్థానం వాహనాల ద్వారా తరలించాలి. పెద్దాస్పత్రిలో రెండు మహాప్రస్థానం వాహనాలున్నాయి. అవి అందుబాటులో ఉండటం లేదు. వాహనాలు మరమ్మతులకు గురవుతున్నా పట్టించుకునే నాథుడే లేడు. ఒక వేళ మహాప్రస్థానం వాహనాలు అందుబాటులో ఉన్నా.. డ్రైవర్లు అందుబాటులో ఉండరు. దీంతో ప్రైవేటు అంబులెన్స్‌ల దందా కొనసాగుతోంది. పెద్దాస్పత్రి ప్రధాన గేటుకు ఉత్తర, దక్షిణ దిశలలో కనీసం 40 ప్రైవేటు అంబులెన్సులున్నాయంటే వీరి దందా ఎలా సాగిపోతుందో అర్థం చేసుకోవచ్చు.

పెద్దాస్పత్రిలో

ప్రైవేటు రాబందులు

మృతదేహాలను తరలించాలంటే అడిగినంత ఇచ్చుకోవాల్సిందే

ఆస్పత్రి ముందే 40 వరకు

ప్రైవేటు అంబులెన్స్‌లు

బయటి వాటికి అవకావం ఇవ్వరు

పెద్దాస్పత్రికి వేలాది మంది రోగులు వైద్యం కోసం వస్తుంటారు. ఎవరైనా రోగి మృతిచెందితే కొంత మంది సిబ్బంది ద్వారా అంబులెన్స్‌ డ్రైవర్లు తెలుసుకుని పెద్ద ఎత్తున గుమిగూడుతారు. బయట అంబులెన్స్‌ల కన్నా ఆస్పత్రి వద్ద ఉండే అంబులెన్స్‌లు అధిక మొత్తాన్ని వసూలు చేస్తున్నాయి. రోగి మృతిచెందిన సమాచారాన్ని అందించిన సిబ్బందికి కొంత మొత్తాన్ని కమీషన్ల రూపంలో అంబులెన్స్‌ల డ్రైవర్లు ఇస్తున్నారని తెలుస్తోంది. అలాగే కొంతమంది డాక్టర్లు తాము చూసే రోగి పరిస్థితి దిగజారిందని, సీరియస్‌ అని బంధువులకు చెప్పి భయపెడుతున్నారు. పెద్దాస్పత్రిలో అన్నిరకాల పరికరాలు లేవంటున్నారు. ప్రైవేటు, కార్పొరేట్‌ ఆస్పత్రులకు తీసుకెళ్తే కోలుకుంటాడని చెప్పి అంబులెన్స్‌ల ద్వారా కార్పొరేట ఆస్పత్రులకు పంపుతున్నారనే చర్చ జరుగుతోంది. కార్పొరేట్‌ ఆస్పత్రుల నుంచి కమీషన్లు తీసుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈక్రమంలో మహా ప్రస్థానం, 108 అంబులెన్స్‌ వాహనాలున్నా ప్రైవేటు అంబులెన్స్‌ల దందా ఇక్కడ యథేచ్ఛగా జరిగిపోతోంది. అరికట్టాల్సిన అధికారులు పట్టించుకోవడం లేదు. కలెక్టర్‌ జోక్యం చేసుకుని ప్రైవేటు అంబులెన్స్‌ల దోపిడీని అరికట్టాలని పేద రోగులు డిమాండ్‌ చేస్తున్నారు.

నగరంలోని జిల్లా పెద్దాస్పత్రి రాబందులకు కేరాఫ్‌గా మారిపోయింది. అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరి మరణిస్తే మృతదేహాన్ని ఇంటి వరకు తరలించేందుకు కూడా ప్రైవేటు అంబులెన్స్‌ల డ్రైవర్లు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. పుట్టెడు దుఃఖంలో కన్నీటి సుడిలో కొట్టుమిట్టాడుతున్న కుటుంబసభ్యులను సైతం కాసుల కోసం వేటాడుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement