నెల్లూరు(బృందావనం): తన మాట, పాట, భాష, యాస, సంస్కృతి, వ్యక్తిత్వం, హావభావాలు తదితర సద్గుణాల మేళవింపుతో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జీవితం సినీ సంగీత చరిత్రలో ఒక మైలురాయి అని, ఎన్ని తరాలైనప్పటికీ ఆయన భారతీయుల మదిలో అమరజీవిగా నిలిచిపోతారని భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు అన్నారు. మినీబైపాస్‌రోడ్డులోని అన్నమయ్య సర్కిల్ వద్ద ఎన్టీఆర్ పార్కులో ఏర్పాటు చేసిన గానగంధర్వుడు బాలసుబ్రహ్మణ్యం కాంస్య విగ్రహాన్ని ప్రజాప్రతినిధులు, కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయన జయంతి సందర్భంగా నెల్లూరులో కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. మనభాషను, సంస్కృతిని పరిరక్షించుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందని, తెలుగుభాషకు ఎనలేని కీర్తిని తీసుకురావడంలో తన గాత్రమాధుర్యంతో బాలసుబ్రహ్మణ్యం నిర్వహించిన కృషి అనన్య సామాన్యమైందిగా పేర్కొన్నారు. తెలుగు సినిమా సంగీతానికి ‘ఘంటసాల–బాలు’’ ద్వయం స్వర్ణయుగాన్ని తీసుకొచ్చారని శ్లాఘించారు. తెలుగుపాటలకు పట్టాభిషేకం చేసి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకుల హృదయ సింహాసనాలపై ఘంటసాల, బాలూ ద్వయం నిలిచిపోయిందన్నారు. తన దినచర్యలో బాలు గాత్రం ఒక అంతర్భాగమై పోయిందన్నారు. తెలుగు ప్రజల నిత్య జీవితాల్లోనూ, ఆలయాల సుప్రభాత సంగీత నివేదనల్లోనూ బాలు స్వరం నిత్యం ధ్వనిస్తూనే ఉంటుందన్నారు. తనకు బాలగంగాధర్‌తిలక్ రాసిన కవితా సంపుటి ‘అమృతం కురిసిన రాత్రి’ గుర్తుకొస్తుందంటూ అందులోని పంక్తులను వివరించారు. దేవతలు సైతం కీర్తించేలా ఉండే ఆ వ్యక్తిత్వం బాలుకి అచ్చుగుద్దినట్లు సరిపోతాయన్నారు. ఆ కవితా సంపుటిలో పేర్కొన్న మేరకు బాలసుబ్రహ్మణ్యం అమరుడంటూ భావోద్వేగంగా పేర్కొన్నారు. తన కంటే బాలసుబ్రహ్మణ్యం వయస్సులో కాస్త పెద్దవారైనప్పటికీ తనపై ఎంతో అభిమానం, గౌరవం చూపేవారని గుర్తుచేసుకున్నారు. బాలసుబ్రహ్మణ్యం తండ్రి సాంబమూర్తి ఎంతో శ్రమకోర్చి వీధివీధి తిరిగి హరికథాగానం చేస్తూ బియ్యం సేకరించి భిక్షాటన పూర్వక త్యాగరాజస్మరణోత్సవాలను నిర్వహించి భక్తిభావం కలిగించారని, తండ్రికి తగ్గ తనయుడిగా బాలు త్యాగరాజ స్మరణోత్సవాలను నిర్వహించిన తీరు అనన్యసామాన్యమన్నారు. బాలు విగ్రహ ఏర్పాటుకు సహకరించిన మంత్రి నారాయణ, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డిలను, కార్యక్రమాన్ని సమన్వయపరిచిన లాయర్ వారపత్రిక సంపాదకుడు తుంగా శివప్రభాత్‌రెడ్డిని అభినందించారు. శాంత బయోటెక్ వ్యవస్థాపక చైర్మన్, పద్మభూషణ్ డాక్టర్ కేఐ వరప్రసాద్‌రెడ్డి, అఖిల భారత తెలుగుసమాఖ్య అధ్యక్షుడు, బాలు ఆప్తమిత్రుడు ఆచార్య సీఎంకే రెడ్డి, ప్రముఖ సంగీత దర్శకులు ఎంఎం కీరవాణి, మణిశర్మ, ఎస్పీ బాలు కుమారుడు ఎస్పీ చరణ్, కుటుంబసభ్యుడు శుభలేఖ సుధాకర్, ఆర్కిటెక్ట్ రామిరెడ్డి సాకేత్‌రెడ్డి, దీపా వెంకట్ తదితరులు మాట్లాడారు. బాలు ఆప్తులు, మిత్రులు, సన్నిహితులు శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి, వీరిశెట్టి హజరత్‌బాబు, గ్రోసు సుబ్బారావు, తాటి చలపతిరావులను సైతం సత్కరించారు.
అలరించిన స్వరనీరాజనం
ఎంఎం కీరవాణి, మణిశర్మ, నాగూరుబాబు(మనో), ఎస్పీ శైలజ, ఎస్పీ వసంత, ఎస్పీ చరణ్, ఎస్పీ అభిషేక్ గానగంధర్వుడికి స్వరనీరాజనం పలికారు. బాలు గళం నుంచి జాలువారిన ఎన్నో అద్భుత గీతాలను ఆలపించారు.
బాలు విగ్రహావిష్కరణలో
పాల్గొన్న అతిథులు
ఆయన పాటలు ఎప్పటికీ
గుర్తుండిపోతాయి
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
ఘనంగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కాంస్య విగ్రహావిష్కరణ


