వింజమూరు(ఉదయగిరి): ఎఫ్‌ఎల్‌ఎన్ శిక్షణకు 420 మంది ఉపాధ్యాయులు రాగా, వారిలో కేవలం 150 మందికే అల్పాహారం అందడంతో మిగితా వారు అందోళనకు దిగిన ఘటన గురువారం వింజమూరు జెడ్పీ ఉన్నత పాఠశాలలో జరిగింది. ఉదయగిరి నియోజకవర్గంలోని ఒకటి, రెండో తరగతుల ఉపాధ్యాయులకు ఆరు రోజుల పాటు స్థానిక జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో ఫౌండేషన్ లిట్రసీ అండ్ న్యూమరసీ(ఎఫ్‌ఎల్‌ఎన్) శిక్షణా తరగతులు ప్రారంభమయ్యాయి. ఉదయం 8 గంటలకు హాజరు కాగా 8.30కి అల్పహారం అందించాలి. కాగా మొదటి రోజు అల్పహారం కొద్దిమందికే అందించారు. దీంతో మిగతా వారు ఆందోళనకు దిగారు. దీనివల్ల ఉదయం 9 గంటలకు ప్రారంభం కావాల్సిన శిక్షణ తరగతులు రెండు గంటలు ఆలస్యంగా జరిగాయి. మధ్యాహ్న భోజనం కూడా మెనూ ప్రకారం ఇవ్వలేదు. అది కూడా నాణ్యత లేకుండా ఉందని పలువురు ఉపాధ్యాయులు అన్నారు. వీరి భోజనం, అల్పాహారం కోసం ప్రతి టీచర్‌కు రోజుకు రూ.300 కేటాయించారు. ఆహారం అందించే కాంట్రాక్టు ప్రైవేటు సంస్థకు అప్పగించారు. ఈ క్రమంలో ఇలా చేయడంపై ఉపాధ్యాయులు నిలదీశారు. ఈ అంశంపై ఎంఈఓ మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ మొదటి రోజు చిన్నచిన్న లోపాలు జరిగాయని, రేపు జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు.


